పాముకు చెవులు ఉన్నాయా? లేవా?

బడి వొడిలో... ఒక టీచరమ్మ ‘యథానికలు: 8 మూడు, నాలుగు తరగతులు చదువుతున్న ఇద్దరు అన్నదమ్ముల ప్రయోగం

Update: 2024-10-27 04:02 GMT

రెప్రెసెంటేషనల్ ఇమేజ్, సోర్స్ : వాషింగ్టన్ పోస్టు


ఎంతోమంది వ్యక్తులు నిరాశక్తంగా ను, దేనికి ఆశ్చర్యం చెందకుండాను ఉంటారెందుచేత? విభ్రాంతి చెందగలగటమనేది అపురూపమైన ఒక వరం. దేనికి చలించకుండా, ఆశ్చర్య పడకుండా ఉండగల మానవులు నిర్జీవులతో సమానం: బీభూతి భూషన్ బందోపాద్యాయ.

పిల్లల్లో ఉండే అతి సామాన్యమైన విషయాలు ఎంత అద్భుతమైన ఆనందాన్ని అందించగలవో నా వృత్తిలో నేను అనుభవించాను. మార్గరేట్ గారు నా కొలీగ్ గా వచ్చిన తర్వాత స్కూల్లో ఉన్నంత సేపు ఆ పిల్లల చదువులతోపాటు ఆట, మాట, పాట మా ప్రపంచం అయ్యాయి. స్కూల్ పిల్లల కబుర్లు రైలు, బస్సు ప్రయాణాల్లో కూడా చోటు చేసుకున్నాయి.

బడిలో మొత్తం 30 మంది లోపల విద్యార్థులున్నారు. ఆ స్కూల్ కి వెళ్ళిన రెండో టీచర్ని ,మొదటి పర్మినేట్ టీచర్ని నేను. 30మంది విద్యార్థులలో 30 రకాల కళలున్నాయి. ఒకరు కవితలు రాస్తే మరొకరు కథలు చెప్పేవాళ్ళు. ఇంకొకళ్ళు జోకులు వేస్తే, మరొకరు బొమ్మల గీస్తే, ఇంకొకళ్ళు బొమ్మలే తయారు చేసేవాళ్ళు. ఒకరు బాగా చదివితే మరొకరు పాఠం బాగా చెప్పేవాళ్ళు. మరొకరు చెప్పిన పాఠాల్లో ప్రయోగాలు చేసేవాళ్లు. ప్రయోగాలు అంటే అన్నదమ్ములైన సుధీర్ వెంకటేషులు గురించి చెప్పాల్సిందే.

పిల్లల్లో బాగా మూఢనమ్మకాలు ఉండేవి. అవి పెద్దలను బట్టి వస్తాయి. గుండ్రంగా కూర్చుని అన్నం తింటునప్పుడు ఇవన్నీ బయటికి వచ్చేవి. ఒకరోజు పాములు కసి పెడతాయని, గుర్తుపెట్టుకుని కసిపెట్టిన వాళ్ళని ఎక్కడున్నా వచ్చి కరుస్తాయనే చర్చ వచ్చింది.అలాంటిదేమి ఉండదని వాటికి అపాయం వస్తేనే కరుస్తాయని చెప్పాను. మరి కొద్ది రోజుల్లోనే ఐదు వాళ్లకి సైన్స్ లో గుండె, కప్ప, పాము మొదలైన పాటలు వచ్చాయి.

ముందు జరిగిన చర్చను దృష్టిలో పెట్టుకొని పాముకు గుర్తుపెట్టుకునే అంత శక్తి లేదని పాముకు చెవులే లేవని, కాని భూమి ప్రకంపనలు దాని శరీరానికి తెలుస్తాయని చెప్పేను. మన నుండి దానికి ప్రమాదం వస్తుందనుకున్నప్పుడే కాటేస్తాయని, మనము కొద్దిగా దూరంగా ఉండి కదలక పోతే వాటికి అసలు తెలియదని.పామును ఓ గాజు సీసాలో పెట్టి చుట్టూ ఎంత అరుసుకున్నా పాముకి వినపడదని చేసిన ప్రయోగాలు బొమ్మలతో సహా చూపించాను. పాములువాళ్ళు వచ్చినప్పుడు గమనించండి. బుట్టలో పడుకున్న పాము బుట్ట మూత తీసి బూర ఊదీనా కదలదని, ఆ బూర తో పామును తట్టి బూరెను ఊదుతూ పాములతను మెడ తల ఊపుతూ ఉంటే పాము ఆ కదిలికలకు పడగవిప్పి కదులుతుందని, చెవులు ద్వారా ఆ బూర శబ్దం వినిపించి కదలదని చెప్పాను.

ఇది జరిగిన మూడో రోజు (యాదృచ్ఛికమే అనుకోవాలి)ఎవరో పామును చంపి వెంకటేష్ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో రోడ్డు కవతల పడేశారు. అన్నదమ్ములిద్దరూ ఆ చచ్చిన పామును పట్టుకుని చేవులున్నాయా! లేవా అని పరిశీలిస్తున్నారు. దారిన పోతున్నా ఓ పెద్దాయన అది పామురా, కరిస్తే చస్తారా అని కేకలేయడంతో, పాము చచ్చింది, పాముకు చెవులు ఉన్నాయా? లేవా? చూస్తున్నామన్నారు. పాము చెవులతో మీకేం పని, మీ నాన్నతో చెబుతాను ఉండండి అని కర్ర తీసుకుని ఇద్దర్ని అవతలకి తరిమేశాడు. మా మేడం గారు పాముకు చెవులు లేవన్నారు అందుకని చూస్తున్నాం అన్నారు.


వాళ్ళ నాన్న (మా స్కూల్ కమిటీ చైర్మన్ కూడా తనే) స్కూల్ కు వచ్చి, ఇలా జరిగిందండి, ఆ పామును కూడా వీళ్లే చంపి ఉంటారని నా అనుమానం అండి, వెంకటేష్ మీదే అనుమానం అండి అన్నాడు. నాకు కూడా అనుమానం ఉంది. అడిగితే మేo చంపలేదు మేడం అన్నారు. నన్ను ఏమన్నా అంటాడేమోనని భయమేసింది. ఏమీ అనకపోగా ఆ విషయాన్ని పాజిటివ్ గా తీసుకున్నందుకు సంతోషించాను.


అప్పటినుండి ఏదన్న విషయాన్ని చెబితే మీరు సొంతంగా పరిశీలించొద్దు అని చెప్పడం మొదలుపెట్టాను. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారికి చెపితే భలే నవ్వేడు. దుర్గ, సుబ్బారావమ్మా , ఒంటరి తల్లుల పిల్లలున్న స్కూలు ప్రకాశం జిల్లా, చిన్నగంజాం మండలం, పూలవారిపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఈ బడి 1999లో ప్రారంభించారు. అప్పటివరకు ఈ పిల్లలందరూ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్నగంజాం స్కూల్ కి వెళ్లి చదువుకునేవాళ్ళు. ఊరి వారందరు ప్రధానంగా వ్యవసాయము, వ్యవసాయ కూలీలు, ఉప్పు పంట, ఉప్పు వ్యాపారం చేసేవాళ్లు. ఈ ఫోటోలో ఉన్న పిల్లలందరూ ఒకటి నుండి 5వ తరగతి వరకు ఉన్నారు. ఆ ఫోటో స్కూల్ ప్రారంభోత్సవం రోజు తీసినది. ఈ ఫోటోలో సుబ్బారావమ్మ, అనూష, లక్ష్మీనరసమ్మ ఉన్నారు. అందరం కూర్చుని అన్నం తింటున్నప్పుడు, ఆకుల్లో మేలైన ఆకు, ఆంధ్ర మాత (గోంగూర), సన్నగా ఉంటాను పాములా ఉంటాను, తీగలకు వేలాడుతుంటాను. (పొట్లకాయ ) సన్నగా ఉంటాను మొద్దులకు వేలాడుతుంటాను (మునగకాయ). పక్షి కూరే కాని దాన్ని చంపలేదు (కోడిగుడ్డు) ఇలా పజిల్స్ వేసుకుంటూ, కనుక్కుంటూ గంట సేపు అన్నం తినేవాళ్ళం. ఎవరన్నా ఇంకా తింటున్నారా? టైం అయింది అంటే, లేటుగా మొదలుపెట్టామనే సమాధానాన్ని ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం. భూమిపైన మొక్కకు పూలుపూస్తాను. కానీ భూమి లోపల ఆహారాన్ని దాచుకుంటాను, కాని దుంపన, కాదు. నేనొక విచిత్రమైన దాన్ని. నా కూర అది కనుక్కోండి అన్నాను.


నాటి స్కూల్ ఇదే...


పాపం, పిల్లలందరూ క్లూ ఇవ్వండి, క్లు ఇవ్వండి అని అడిగితే, నేను ఒక ప్రసిద్ధమైన దాన్ని, నేనంటే అందరికీ ఇష్టం, నేను లేనిది ఎవరికి జరగదు, కూరల్లో పిండివంటల్లో నేను ఉంటాను ఇలా, కావాలనే వాళ్ళ స్థాయికి మించి రకరకాల క్లూ లిచ్చాను. టైం లిమిటేషన్ లో కనుక్కోలేకపోయారు. ఆలోచించి, పెద్ద వాళ్ళని అడిగి రేపు చెప్పండి అన్నాను. మరుసటి రోజు అన్నానికి కూర్చున్నప్పుడు, నా పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి, ఎకరాలు ఎకరాల్లో పండిస్తారని రకరకాల క్లూలు ఇవ్వటంతో వేరుసెనగ కాయలని కనుక్కున్న వారి ఆనందాన్ని వారి కళ్ళల్లోనే చూడగలం. మాటల్లో రాతల్లో చెప్పలేం.

ఇలాంటి సమయాల్లోనే లక్ష్మి ఓ రోజు గుడ్డు కూర తెచ్చింది. సుధీర్, లక్ష్మి నాకు ఇవ్వమ్మా అన్నాడు. వెంటనే వెంకటేశు నాకి ఇవ్వమ్మా నాకి ఇవ్వమ్మా అన్నాడు. మాకు ఎవ్వరికి అర్థం కాలేదు. లక్ష్మి ఎవ్వరికి ఇవ్వదు రా అన్నాను. కాదు మేడం, నాలుక బయటపెట్టి చేతితో నాకుతున్నట్టు యాక్ట్ చేసి నాకి ఇవ్వుమ్మ నాకి ఇవ్వుమ్మ అన్నాడు.అర్థమై, మా నవ్వులతో రూము ప్రతిధ్వనించినది.

మూడో తరగతి లో ఉండ గా వెంకటేష్ పెన్ను పోయింది. నాగరాజుకు దొరికింది. నాగరాజు స్కూల్లో కాదు రోడ్డు మీద దొరికింది ఇవ్వను అంటాడు. అప్పటివరకు స్కూల్లో పోయిన పెన్సిళ్ళు ,పెన్నలు, డబ్బులు, పుస్తకాలు నిజాయితీగా ఇవ్వాలని నేర్పాను. ఇచ్చేవాళ్ళు. నిజాయితీ పెట్టెలు, బాక్సులు అప్పటికి ఇంకా స్కూల్స్ లో అమలు జరగటం లేదు. దొరికిందని ఒప్పుకుంటున్నావు కదా ఇవ్వు నాగరాజు అన్నా, నాగరాజు రోడ్డు మీద కాబట్టే ఇవ్వను అన్నాడు. మీరుoడండి మేడం అని వెంకటేష్ వెంటనే నాగరాజు పుస్తకాలు తీసుకుని నాకు దొరికినవి అన్నాడు. ఆ స్పాన్టేనియస్ కి ఆశ్చర్యపోవటం నా వంతు అయింది. ఆనందించగలిగితే, ఆస్వాదించగలిగితే పిల్లల్లో ఇలాంటివి చాలా ఉంటాయి.

అప్పుడే వెంకటేశ్ వాళ్ళ నాన్న ల్యాండ్ లైన్ ఫోను పెట్టించాడు. వీలు దొరికితే, ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫోన్ చేసేవాడు, రోడ్డు మీద నాగరాజుని కాపలా పెట్టి. వాళ్ళ అమ్మో నాన్నో వస్తుంటే బయట ఉన్న నాగరాజు వెంకటేష్ అని పిలిసేవాడు. ఏమీ తెలియనట్టు, ఏమీ చేయనట్టు వెంకటేష్ బయటకు వచ్చేవాడు. అలా ఎందుకురా చేయడం అంటే ఫోన్ సరదా మేడం అనేవాడు. అలా ఫోను చేసినప్పుడు మా సార్ ఫోన్ ఎత్తాడు. సార్ నేను వెంకటేష్ ని అన్నాడు. నువ్వు వెంకటేశ్ వైతే నేను నాగార్జునని అన్నాడు తెలిసి. నేను వెళ్ళి ఫోను తీసుకున్న.ఎవరు ఎవరు మేడం అంటే మా సార్ అని చెప్పా. సార్ పేరు నాగార్జున కాదు కదా అన్నాడు.

నేను పూలవారిపాలెం స్కూల్ కి వెళ్ళినప్పుడు వెంకటేష్ రెండో తరగతి. ఫోర్త్ క్లాస్ నుండి,మేము స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ కోసం ఊర్లోకి వెళ్ళినప్పుడు, బయటికో , మండలానికకో వెళ్ళినప్పుడు స్కూల్ ని మెయింటైన్ చేసేవాడు. రోడ్డు పక్కనే పాఠశాల. ఎప్పుడు ఎవరో ఒకరు వస్తుండేవాళ్ళు. పైగా మా స్కూలు పిల్లలు, రికార్డ్స్ బాగా ఉండటంతో మండల అధికారులు కూడా వచ్చిన జిల్లా, రాష్ట్ర అధికారులను మా స్కూల్ కు తీసుకొచ్చేవాళ్ళు. మండల ఆఫీసులన్నీ లోపలికి ఉండగా, మా స్కూలు రోడ్డు పక్కన ఉండడంతో, మా స్కూల్ కి వచ్చి మండల్ ఆఫీస్లు ఎక్కడ అని అడిగేవారు. చూపించడానికి పిల్లల్ని పంపించేవాళ్ళం . ఎవరైనా వచ్చినప్పుడు చిన్న సైగ చేస్తే పక్క రూమ్ లో ఉన్న మేడం గారిని పిలుసుకొచ్చేవాడు. మేము వచ్చిన వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇస్తున్నప్పుడు, పిల్లలందరినీ నిశ్శబ్దంగా చూసేవాడు.

ఉదయం డ్యూటీలు వేసి ఊడిపిoచడం, ప్రేయర్, మిడ్ డే మీల్స్ కు వాటర్ తోడించడం, లైన్ లో పంపించడం, ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలందరినీ లైన్ లో తీసుకెళ్లడం, తాళాలు వేయటం అన్ని బాధ్యతగా చేసేవాడు. తరుడ్ టీచర్ అని పిలిచేవాళ్ళo. 2009లో ఆ స్కూల్ నుండి బదిలీపై వెళ్ళిపోయాను.

2019లో పొదిలి బస్టాండ్ లో మేడం బాగున్నారా? అంటూ పలకరించాడు. నేను ఎవరా అని చూస్తున్నాను. మేడం నేను "శుంటేస్" ని అన్నాడు. అరే నువ్వా! ఎంత పెద్ద వాడివి అయిపోయావు అంటూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో! చెప్పలేనంత ఆనందం. శుంటేసు ఏమిటానుకుంటున్నారు కదూ! అన్ని బాగుంటాయి. పరీక్షలు కూడా హడావుడిగా రాసేస్తాడు. 50కి 40...42 వచ్చేవి. వాడికన్నా ముందు ఒకళ్ళిద్దరూ 45, 46 వచ్చేవి. దుర్గ కూడా అంతే. పెద్దగా చదివినట్టు ఉండని మరియమ్మకు 45.... 46 వచ్చేవి. కొంచెం నిదానంగా రాయి, తెలిసినవి కూడా తప్పులు రాస్తున్నావని కోప్పడ్డాను. 42 వచ్చాయి కదా చాల్లే మేడం అన్నాడు. దుర్గ కూడా ఇలాగే అనేది. కోపమొచ్చి వెంకటేశువి కాదురా, శుంటేష్ వి అన్నాను. ఆ పేరు స్థిరపడిపోయింది.ఇద్దరం కబుర్లు చెప్పుకునేటప్పుడు ఆ పేరుతోనే పిలిచేదాన్ని. నవ్వుకునేవాడు. వీడి గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయి. ఇప్పటికీ గుర్తు వచ్చి నవ్వుకుంటుంటాను.

వెంకటేశే కాదు నాగరాజు, నాగేశ్వరీ,శివ, అజయ్, దుర్గాప్రసాద్, చిన్న వెంకటేష్, నాగాంజలి....... ఎవరికి వారే ఏదో ఒక దానిలో ప్రత్యేకతను చాటుకుంటూ నవ్వులు పువ్వులు పూయించేవాళ్ళు. ఇలాంటి మరికొన్న

కబుర్లతో మరొకసారి కలుద్దాం.



Tags:    

Similar News