మరణ యాత్రలో.... యాతన ఎలా ఉంటుంది?

రోగుల కోసం వైద్య ప్రయోగం చేపట్టి మరణ యాతన డైరీ రాసిన సాహసి మెడికో

Update: 2024-12-26 06:51 GMT

పైన ఫోటో చూశారు కదా?

ఒక వైద్య విద్యార్థి జ్ఞాపకార్థం నెలకొల్పిన విగ్రహం ఇది. అతని పేరు డేనియల్ కేరియాన్ (Daniel Alcides Carrión). ప్రపంచంలో ఇలాంటి విగ్రహం ఇదొక్కటే. అతను పెరూ దేశపు మెడికో (ఆగస్టు12, 1857 – అక్టోబర్ 5, 1885). మెడిసిన్ చదువుతున్నపుడు సాహసోపేతమయిన ఒక వైద్య ప్రయోగం తన మీద చేసుకుని వైద్యవిజ్ఞానం కోసం ప్రాణాలర్పించిన విద్యార్థి అతడు. అందుకే అతన్ని స్మరించుకుంటూ పెరూ దేశపు రాజధాని లీమా లోని ఒక జంక్షన్ లో డేనియల్ విగ్రహం నిలబెట్టారు. ఈ జంక్షన్ పేరు కూడా కేరియాన్ పార్క్ (Carrión Park).

ఆయన తన మీద చేసుకున్నప్రయోగం వల్ల ఆ రోజుల్లో పెరూ దేశంలో విపరీతంగా సోకుతూ వందలాది మంది ప్రాణాలను బలితీసుకుంటున్న ఒక చర్మవ్యాధి వెరుగా పెరువానా (Verruga Peruana) , అంతు పట్టని ఒక వింతజ్వరం ఒరోయా పీవర్ (Oroya fever) గురించిన ఆసక్తి కరమయిన విషయాలెన్నో తెలిశాయి. అంతేకాదు, ఆ రెండు ఒకటే అని తేలింది.

ఒరోయా ప్రాంతంలోని రైల్వేకూలీలలో ఎక్కువగా సోకుతున్నందున ఈ జ్వరానికి ఒరొయా ఫీవర్ అనే పేరొచ్చింది.

పెరు, ఈక్వడార్, కొలంబియా అండీస్ పర్వత ప్రాంతాల ప్రజలకు ఈ చర్మవ్యాధి సోకేది. ఈ జబ్బు వస్తే శరీరం మీద, నోటిలో పెద్ద పెద్ద బుడిపెలు వచ్చేవి. ఇవి రక్తపు కాయల్లా కనిపించేవి. ఈ చర్మవ్యాధి వచ్చిన వారిలో విపరీతంగా జ్వరం వచ్చేది. కీళ్ల నొప్పులు సతాయించేవి. ఈ జబ్బు ఎందుకొస్తుందో అప్పటికింకా వెల్లడికాలేదు. దీనిని కనుగొనేందుకు ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రయోగాలు మొదలయ్యాయి. ఆ వరసలో పెరూ దేశం కూడా చేరింది. పెరూ శాస్త్రవేత్తల్లో పరిశోధనోత్సాహం కల్పించేందుకు ఒక పెద్ద బహుమానం కూడా ప్రకటించారు.

అప్పటికి డేనియల్ వయసు 26 సంవత్సరాలు. మెడిసిన్ చదువుతున్నాడు. ఈ కాంపిటీషన్ లోకి వెళ్లి బహుమానం కూడా గెల్చుకోవాలనుకున్నాడు.

ఆయన ఈ జబ్బుతో కొంత పరిచయం ఉంది. ఒక సారి వాళ్ల మామతో కలసి అండీస్ పర్వత ప్రాంతాలకు వెళ్లాడు . అక్కడ డేనియల్ ఈ భయంకరమయిన జబ్బును కళ్లారా చూశాడు. ఆ జబ్బు తో ఉన్న రోగులు పడుతున్న విపరీతమయిన బాధ చూశాడు. అది ఆయనను కలచి వేసింది. ఇపుడు తాను మెడిసిన్ ఆరో సంవత్సరంలో ఉన్నాడు. ఈ జబ్బు గురించి లోతుగా పరిశీలించాని తన డెజర్టేషన్ కోసం డేనియల్ ‘వెరూగా జబ్బు’ నే ఎంచుకున్నాడు.

వెరూగా రోగం వస్తే ఎర్రరక్తకణాలు తగ్గిపోయి ఆక్సిజన్ అందక రోగులు ఎనెమియాతో బాధపడుతూ ఉంటారు. శరీరం మీద కాయలు కాసే ముందు ఈ ఆక్సిజన్ కొరత తీవ్రంగా వస్తుంది. నిదానంగా, బాధతో చనిపోతారు.

ఇక ఒరయో ఫీవర్ విషయానికి వస్తే చాలా మంది డాక్టర్లు ఈ జబ్బు రక్తానికి సంబంధించిందని నమ్మే వాళ్లు. మరికొందరు ఈ రెండు జబ్బుల మధ్య సంబంధం ఉందని అనుమానించే వాళ్లు.

ఇలాంటపుడు ఈ జబ్బు ఎలా పుడుతుందో, అది శరీరంలో తీసుకువచ్చే మార్పులేమిటో అధ్యయనం చేయాలని డేనియల్ నిర్ణయించుకున్నాడు. ఇదెలా సాధ్యం ?

వెరూగా జబ్బు తో ఉన్న రోగి పుండులోని రసిని ఆరోగ్యవంతుడయిన మరొక మనిషికి ఎక్కించి, అతనిలో ఈ జబ్బు తెచ్చే మార్పులేమిటో చూడాలి. జబ్బు ఎలా మొదలవుతుంది. ఇంకుబేషన్ కు ఎంతకాలం తీసుకుంటుంది, ఆక్సిజన్ కొరత ఎపుడొస్తుంది, చర్మంమీద భయంకరమయిన ఈ కాయలు ఎపుడు కాస్తాయి? ఇలా అన్ని విషయాలను పరిశీలించాలనుకున్నాడు డేనియల్.

దీనికోసం ఎవరి మీదనో ప్రయోగం చేయాలి. ఇది సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల ఈ జబ్బును తనకే ఎక్కించుకుంటే చిక్కు ఉండదు. ఇదే సరైన పరిశోధన. ఈ ఆలోచన వచ్చింది. నచ్చింది.

ఈ తన నిర్ణయాన్ని ప్రొఫెసర్లకు, స్నేహితులకు చెప్పాడు. ‘నీకేమయినా పిచ్చా!’ అని వాళ్లంతా వారించారు. అది ప్రమాదం అన్నారు. అనైతిక అన్నారు. తెలివితక్కువ ప్రయోగం అన్నారు. అయినా డేనియల్ వినలేదు.

ఈ జబ్బు పెరూలో మాత్రమే కనిపించిన జబ్బు కాబట్టి, దీనికి పరిష్కారం కూడా పెరూవియనే కనిపెట్టాలనేది డేనియల్ పట్టుదల.

అంతేకాదు, ఈ జబ్బు మర్మం తేలిస్తే తనకు భారీ బహుమానం కూడా దక్కుతుంది.


1885 ఆగస్టు 27న రాజదాని లీమాలోని ఒక హాస్పిటల్ లో వెరూగ చర్మవ్యాధితో బాధపడుతున్న ఒక పిల్లవాడిని తన ప్రయోగానికి డేనియల్ ఎంచుకున్నాడు. అతని పుండు నుంచి రక్తం తీసి తనలోకి ఎక్కించుకోవాలి. వీడు ఇలాంటి పనేదో చేయబోతున్నాడని పసిగట్టి డేనియల్ క్లాస్ ప్రొఫెసర్, ముగ్గురు అసిస్టెంట్లు కూడా అక్కడికి పరిగెత్తు కుంటూ వచ్చారు. ఆయన స్వీయ ప్రయోగానికి ఏ మాత్రం వాళ్లు అంగీకరించలేదు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాని, డేనియల్ మొండిపట్టు పట్టాడు. వారి మాట వినలేదు. ముందుకే వెళ్లాలనుకున్నాడు.

పిల్లవాడి కనుబొమల మీద ఉన్న ఒక రక్తపు కాయనుంచి సూదితో రక్తం తీసుకున్నాడు. దానిని తన ఎడమ భుజానికి ఎక్కించుకోవాలనుకున్నాడు. చాలా ప్రయత్నించాడు అది సాధ్యం కావడం లేదు.

అయితే, అపుడు అక్కడ ఉన్న మిత్రుడొకరు ముందుకు వచ్చి డేనియల్ ఇనాక్యులేషన్ కు సహకరించాడు.ఇలా డేనియల్ చరిత్రలో నిలినిపోయే ప్రమాదకరమయిన జబ్బుని ఎక్కించుకుని తన మీదే ప్రయోగం ప్రారంభించాడు.

తర్వాతేం జరిగింది?

వెంటనే డేనియల్ కు ఏమీ కాలేదు. ఏమో అవుతుందని డైరీ ఓపెన్ చేసి, పెన్ను చేతబట్టుకుని రికార్డు చేసేందుకు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. తన లో ఏదో పరిణామం వస్తున్నదని మొదటిసారి సెప్టెంబర్ 21న గమనించాడు. డైరీ లో రికార్డు చేశాడు. శరరంలో అసౌకర్యంగా ఉందని, గట్టికాల్ల దగ్గిర నొప్పిమొదలయిందని ఆయన రాశాడు.

రెండురోజుల్లో వొంట్లో నలత, తీవ్రమయిన చలి జ్వరంగా వచ్చింది. రికార్డు చేశారు.వణుకుపుట్టింది. దాన్నీ రికార్డు చేశారు. పళ్లకటకటకొట్టుకుంటున్నాయి అదీ డైరీకి ఎక్కింది. వాంతి అవుతున్నది.నడుములు పట్టేశాయి. శరీరంలో ఎముకల్లో, కీళ్లలో విపరీతంగా నొప్పులు మొదలయ్యాయి. ఆకలిగా ఉంది. ఏమీ తినలేకపోతున్నాడు, దాహంగా ఉంది. అయినా ఏమీ తాగలేకపోతున్నాడు. అతి కష్టం మీద డైరీకెక్కించాడు.

సెప్టెంబర్ 26 కల్లా పరిస్థితి ఎంత దిగజారిందంటే ఆయన ఇక డైరీ కూడా రాయలేని పరిస్థితి వచ్చింది. ఆ పనిని తన క్లాస్ మేట్స్ కు అప్పగించాడు.

ఈ తీవ్రమయిన జ్వరానికి ఏదో ఆకుపసరు (herbal Poultices) పట్టించడం, ఆయనకేమీ కాకూడదని దేవుని ప్రార్థించడం మినహా నాటి డాక్టర్ల దగ్గిర వైద్యమేమీ లేదు. అయినా డేనియల్ భయపడటం లేదు. తాను తప్పక కోలుకుంటాననే ధైర్యం డేనియల్ వ్యక్తం చేస్తున్నాడు.

అయితే, వైద్యపరీక్షల్లో ఆయన శరీరంలో ప్రమాదకరమయిన స్థాయిలో రక్త హీనత మొదలయిందని తెలిసింది. శరీరంలో ఎర్రరక్త కణాలసంఖ్య మిలియన్లలో పడిపోయింది. ఈ రక్త కణాలను ఏదో తినేస్తూ ఉంది. అప్పటికింకా అది బ్యాక్టిరియా అని తెలియదు.

రక్తహీనత ఎంత తీవ్రంగా ఉందంటే గుండె కూడా మూలగం మొదలుపెట్టింది. ఈ శబ్దం గుండెనుంచి మెడ రక్తనాళాల్లోకి ప్రయాణించడం డేనియల్ వింటున్నాడు కూడా.రికార్డు చేయమంటున్నాడు. శారీరకంగా అతని పరిస్థితి విషమించినా, మానసికంగా తాను ఏదో సాధించబోతున్నట్లు ధృఢంగా నమ్ముతున్నాడు.

రోజురోజుకు పరిస్థితి విషమించడమే తప్ప మెరుగుపడటం లేదు.


తనేం చేశాడో, దాని దుష్పరిణామ ఎలా తనను చుట్టుముట్టిందో డేనియల్ ఇపుడు అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. అయినా ముందుకు పోవలసిందే.

వెరూగ చర్మవ్యాధికి, ఒరయో పీవర్ కు ఏదో సంబంధం ఉందని ఆయనకు అపుడనిపించింది.

ఈ మధ్య ఇదే పరిస్థితిలో చనిపోయిన ఒక స్నేహితుడి మరణం గుర్తుకు వచ్చింది. తానింతవరకు కేవలం చర్మవ్యాధి ప్రభావంలోనే ఉన్నానని అనుకుంటూ వచ్చాడు. వెరూగ వ్యాపించడంతో వచ్చిన రక్తహీనత, ఆ పైన చర్మం మీద మొలిచే కాయల దశలో మాత్రమేనని ఉన్నానని భావించాడు. అది తప్పని గ్రహించాడు. రికార్డు చేశాడు.

అయితే, దీంతో పాటే వచ్చిన తీవ్రమయిన జ్వరం వల్లే తన స్నేహితుడు చనిపోయాడని, ఇపుడు తాను బాధపడుతున్నది అదే జ్వరంతో నని, ఈ చర్మం కాయలకు, జ్వరానికి సంబంధం ఉందని గ్రహించాడు. దానినీ రికార్డు చేశాడు.

“Up today, I thought I was only in the invasive stage of the verruga as a consequence of my inoculation, that is, in that period of anemia that precedes the eruption. But, now I am deeply convinced that I am suffering from the fever that killed our friend, Orihuela. Therefore, this is the evident proof that Oroya fever and verruga have the same origin.”

వెరూగా చర్మవ్యాధి తీవ్రంగా ఉష్ణోగ్రతను పెంచుతుంది. భయంకరమయి వొంటినొప్పులు తెస్తుంది. ప్రాణాపాయకరంగా రక్త హీనత సృష్టిస్తుంది. అయితే, దీనికంతటికి కారణం బ్యార్టొనెల్లా బ్యాసిలీపార్మిస్ (Bartonella bacilliformis) అనే బ్యాక్టీరియా, అది శాండ్ ఫ్లైస్ (ఒక రకమయిన దోమ) వల్ల వ్యాపిస్తుంది. ఈ విషయం అప్పటికింకా తెలియదు.

ఇక డేనియల్ పరిస్థితి విషమించింది. ఆయన కొత్త రక్తం ఎక్కించాలనుకున్నారు. అది వీలుకాలేదు. అప్పటికింకా బ్లడ్ టైపింగ్ విధానాలు రాలేదు. కొత్త రక్తం ఎక్కిస్తే ప్రమాదమని భావించి బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ వాయిదా వేశారు. దానితో ఆయన కోమాలోకి వెళ్లారు . అక్టోబర్ 5న, 39 రోజుల ప్రయోగం తర్వాత చని పోయాడు. అన్ని విషయాలు రాసినా తానుచనిపోతున్న విషయాన్ని చెప్పలేకపోయాడు.

డేనియల్ క్యారియాన్ సాహసాన్ని అంతా కొనియాడారు. కొంతమంది ఈ ప్రయోగాన్ని విమర్శించారు. కొందరేమో డేనియల్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. అయితే, ఈ చర్చల మధ్య పోలీసులు డేనియల్ ఇనాక్యులేషన్ కు సహరించిన వైద్యుడి మీద హత్య కేసు పెట్టారు. అయితే, కాలేజీ ప్రొఫెసర్ సాక్ష్యం వ్యతిరేకంగా చెప్పడంతో హత్యకేసును ఉపసంహరించుకున్నారు.

ఈ ప్రయోగంతో డేనియల్ క్యారియన్ వీరుడయిపోయాడు. ఆయన మీద జానపదగాధలొచ్చాయి. పాటలొచ్చాయి.

పెరు మెడికోలు ఈ పాటల్ని పాడుతూ ఉంటారు. ఆయన స్మారకార్థం ఈ విగ్రహం ఆవిష్కరించారు.

(లారెన్స్ కె కె అల్ట్ మన్ పుస్తకం ‘Who Goes First?: The Story of Self-Experimentation in Medicine’ లో కేరియాన్ కథనం చదివాక రాయకుండా ఉండేలేక పోతున్నాను.)

Tags:    

Similar News