ఆగ్రాలో ఆటోవాలా.. తాజ్ మహల్లో ఆంధ్రావాలా..

ఓ టూరిస్టు అనుభవం ఇది. మధ్యతరగతి మనస్తత్వాన్ని అద్ఘం పట్టే కథనం ఇది. ఖర్చు తగ్గించుకోవాలని ఒకరు, వినిమయతత్వాన్ని పెంచాలని మరొకరు.. ఆ తాపత్రయం ఎలాంటిదంటే..;

Update: 2025-03-09 06:24 GMT
మిత్రుడు అక్బర్ పాషాతో కలిసి రచయిత దాసరి కేశవులు తీయించుకున్న ఫోటో

(దాసరి కేశవులు, విజయవాడ)

షాజహాన్ ముంతాజ్ మనసు దోచాడో లేదో గాని ఆగ్రాలో ఆటో వాళ్లకి చిక్కామో మనకు మైండ్ బ్లాంక్ కావాల్సిందే. అదేదో సినిమాలో చెప్పినట్టు ఎవడు కొడితే దిమ్మ తిరుగుద్దో అదన్న మాట. ప్రపంచ వారసత్వ కట్టడం తాజ్ మహల్... ఆగ్రా మీదుగా వెళ్తున్నప్పుడో, వెళ్లినపుడో, ఢిల్లీ టూర్ పెట్టుకున్నప్పుడో తాజ్ మహల్ ని చూడకుండా రాలేం. అచ్చంగా ఈ ప్రేమచిహ్నాన్ని చూడ్డం కోసమే దేశదేశాల నుంచి వచ్చే వాళ్లూ లేకపోలేదు.
మేమీమధ్య తాజ్ మహల్ చూద్దామని ఢిల్లీ నోయిడా సెక్టార్ 73 నుంచి బయలుదేరాం. మేం ముగ్గురం. యూపీ బస్సులు ఎట్టుంటాయో తెలుసుగా.. మన వాటికి ఉత్తరాది వాటికీ అస్సలు పొంతనే ఉండదు. యూపీ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్సనుకుని ఓ ప్రైవేటు బస్సెక్కాం. 250 రూపాయలు చార్జీ ఒక్కొక్కరికి.. మూడు గంటల్లో తాజ్ మహల్ దగ్గర దించకపోతే నేనేంటో, నా తడకా ఏంటో అడగండన్నాడు కండక్టర్. ఊరుగాని ఊరు, రాష్ట్రం గాని రాష్ట్రం. మాకొచ్చిన భాష సరిపోదు. ఎందుకొచ్చిన గొడవలెమ్మని అతను చెప్పిందే నమ్మి కూర్చున్నాం. సీట్లు నిండాయి. ఇక బయల్దేరతాడనుకుంటుండగా ఇంకా కేకలేస్తున్నాడు.. ఆగ్రా.. ఆగ్రా అని అరుస్తున్నాడు. బస్సు పుల్.. కిటకిటలాడుతోంది. నిల్చోడానికి కూడా జాగా లేదు.

బస్సెక్కేటపుడు ఫుల్ ఏసీ అన్నాడు. బస్సు నిండిన తర్వాత కిటికీలు బార్లా 'తెరిచి గాలి వస్తోందా, ఢిల్లీ చలి చాలా డేంజర్' అన్నాడు. చలిగాలి వస్తుంటే కిటికీలు వేసుకోండని సెలవిచ్చి కొంచెం సర్దుకోమన్నాడు. చెప్పిన మూడుకి బదులు నాలుగు గంటలకు ఆగ్రా హైవే మీద దించి ఓ ఆటో వాలాకి అప్పగించారు. ఇది నచ్చని ఇంకో ఆటోవాలా అతనితో గొడవ పడ్డారు. తీరా అది ఇండియా, పాకిస్తాన్ అనుకునే దాకా పోయింది. మిమ్మల్ని 10రూపాయలకే తాజ్ మహల్ దగ్గరకు తీసుకెళ్తా అని ఒకరంటే 5 రూపాయలకే తీసుకెళ్తానని ఇంకొకరన్నారు. ఇలా నాలుగైదు నిమిషాల మాటల యుద్ధం తర్వాత మేము నేరుగా తొలి ఆటోవాలా 'బండి' ఎక్కి.. 'వీళ్లకు యాత్రికులంటే ఎంతో ప్రేమో' అనుకున్నాం.
ఇక్కడ మొదలైంది అసలు కథ..
ఆటో రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత డ్రైవరు రోడ్డుకు ఓ పక్కన ఆపాడు. ఒంటేలు పనేమో అనుకున్నాం. ఇంజన్ ఆఫ్ చేసి మావైపు తిరిగి, అసలు పురాణం అప్పుడు మొదలుపెట్టాడు. దేఖో భయ్యా.. (ఆ తర్వాత చెప్పింది నాకు అర్థం కాలేదు, మా పాషా చెప్పిన దాని ప్రకారం 'ఆగ్రాలో చూడాల్సిన ప్లేసులు మూడున్నాయి. వాటన్నింటిని నేను చూపిస్తా. ముందు తాజ్ మహల్, తర్వాత ఫతేపూర్ సిక్రి, తర్వాత ఆగ్రా కోట, చివర్లో మీనా బజారుకి తీసుకువెళతా. మీకు ఇష్టం వచ్చినవి కొనుక్కోవచ్చు. మధ్యలో నచ్చినవి తినొచ్చు. సాయంత్రం మీరడగిన చోట దించుతా. మొత్తం కలిపి 3 వందలు ఇవ్వండి' అన్నది సారాంశం. మా బలహీనత బయటపడింది. ఇన్ని తిప్పి 3 వందలిమ్మనడమేమిటని మేమనుకోవాల్నా? అలా అనుకోలా! అదేదో చిరంజీవి సినిమాలో ఏవీ సుబ్రమణ్యం మాదిరి.. ఊరికే వస్తే ఎందాకైనా దేకవచ్చలెమ్మన్నట్టుగా ఉంది మా ధోరణి. అలా ముగ్గులోకి దించేశాడు మా ఆటోవాలా.
అప్పటి దాకా తాజ్ మహల్ చూసి వెనక్కి వెళదామని మొరాయించిన వాళ్లం మూడొందలనే సరికి కాస్త మెత్తబడ్డాం. పోన్లే.. ముగ్గురం ఉన్నాం.. తలా ఒక వందే కదా.. అని మనసులో భలే సలీసు బేరమని మా అంతట మేము మురిసిపోతూ.. సర్లే, పోనియ్యమన్నాం. అలా ఆగ్రా సందుగొందులు గుండా ఆగ్రా ఈస్ట్ గేట్ వైపు తీసుకువచ్చాడు. ఇటెందుకు, నేరుగా మెయిన్ గేటు వైపు తీసుకుపోకపోయావా? అన్నాడు పాషా. ఇటయితే దగ్గరంటూ మమ్మల్ని ఈస్ట్ గేటు కు ఓ రెండు ఫర్నాంగుల దూరంలోని ఓ షాపు వద్దకు తీసుకెళ్లి ఆటో ఆపాడు.
పాయఖానగా మారిన ఓ చారిత్రక స్థూపం దగ్గర బండాపి.. టికెట్లు బుక్ చేశారా? (తాజ్ మహల్ చూడడానికి ఆన్ లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి. ప్రవేశానికి రూ.50, సమాది ఆ చుట్టుపక్కల పరిసరాలు చూడడానికి 2 వందల రూపాయలు) అన్నాడు డ్రైవర్. చేశాం అన్నాం. ఏవీ చూపించడం అన్నాడు. పాషా ఎంత వెతికినా ఆ రిసిప్టు కనిపించలేదు. అంతే.. ఆ వెంటనే ఆ ఆటోవాలా.. ఇదిగో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు, టికెట్ ఖరీదుతో పాటు బుక్ చేసినందుకు రూ.10 ఫీజు వసూలు చేస్తారన్నాడు. పాషా రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలోగా అతనే తలా ఒక చిన్న వాటర్ బాటిల్ చేతిలో పెట్టి ఛాయ్ తాగుతారా అని అడిగాడు. మా కేశవులు గారు తలూపారు, ఎంతకీ ఛాయ్ రాలేదు. ఆయనే బయటికెళ్లి తాగుదామనుకుంటుండగా.. వాటర్ బాటిళ్లకి 50 రూపాయలు ఇవ్వండని చెప్పారు.
అలా ఓ 20,25 నిమిషాలు గడిచాక.. తాజ్ మహల్ లోపల ఫోటోలు దిగరా.. ఈ షాపు యజమాని బ్రదరే ఉంటాడు, మీ నెంబర్ ఇవ్వండి, ఆయనకి పంపిస్తా, ఆయనే వచ్చి మీ ఫోటోలు తీస్తారు, ఒక్కో ఫోటోకి రూ.50 తీసుకుంటాం అన్నాడు ఆ షాపు యజమాని. మానవ బలహీనత మన రిలయన్స్ కే కాదు మన గల్లీ షాపోడికి కూడా బాగానే తెల్సిందే అనుకుంటూ, సర్లే.. మన ముఖాలు మనమూ చూసుకుని ఆనంద పడాలి కదా అనుకుంటూ తలూపాం. ఆ విధంగా మేమక్కడి నుంచి కదిలి ఈస్ట్ గేట్ వైపు బయలు దేరాం మా ఆటోను అక్కడ వదిలిపెట్టి..
తాజ్ మహల్ సందర్శన ఇలా షరూ..
ఈస్ట్ గేట్ నుంచి లోపలకి పోబోతుంటే మీరక్కడ మీ చెప్పులు, బూట్లతో తిరగడం కుదరదు, కాళ్లకి ఇదిగో ఈ గ్లౌజులు వేసుకోవాలని చెప్పి ఓ బ్లూకలర్ కవర్ మా చేతిలో పెట్టి ఒక్కొకటి పది చొప్పున 30 రూపాయలు వసూలు చేశాడు ఇంకొకడు. అలా మొత్తం మీద సెక్యూరిటీ చెక్ దాటి తాజ్ అందాలను ఆస్వాదిస్తుండగా పాషా జేబులో ఫోన్ మోగింది. హలో మా వాడు వచ్చాడా, పోటో తీశాడా, బయట తప్పకుండా ఫోటో దిగండి, మంచి లొకేషన్ అన్నాడు అవతలి నుంచి. పాషా తనకు వచ్చిన ఆంధ్రా ఉర్దూలో అచ్చా, టీక్ హై, జరూర్, షుక్రియా అంటూ ఫోన్ పెట్టేశాడు. సదరు బ్రదర్ వచ్చాడు. మమ్మల్ని ఓ చోట నిల్చోబెట్టి.. ఏకేక్ ఫోటో లేలో.. యే బహుత్ అచ్చా లోకేషన్ హై అంటూ తలొకటి తీసి లోపలికి తీసుకెళ్లాడు. మేము దూరం నుంచే.. షాజహాన్ చాలా గొప్పోడబ్బా, పెళ్లామంటే ఎంత ప్రేమ లేకపోతే ఇలాంటిది కట్టి ఉండాడంటూ మేము కూడా ఆ మొగల్ కి ఓ వీరతాడేసి మా ఫోన్లలో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డాం. ఈలోగా ముగ్గురం మూడు దార్లయి ఓ చోట కలిసేటప్పటికే తాజ్ మహల్ గోపురంపై మేము చేయి పెట్టినట్టుండే ఫోటో తీసే ప్లేస్ కిటకిటలాడిపోయింది. దానికి బదులుగా ఓ బెంచీ చూపించి మీ ముగ్గురు ఇక్కడ కూర్చోండి అని ఓ గ్రూప్ ఫోటో, విడివిడిగా తలా ఒక ఫోటో తీశాడు మా ఫోటో గ్రాఫర్. ఒక్క 50 రూపాయలతో సరిపెడదామనుకుంటే ఇప్పటికే మూడు అయ్యాయి. ఇంకొకటి కూడా తప్పేలా లేదు. అంటే ఒక్కోక్కరం ఫోటోల కోసమే తలా 300 ఖర్చు చేయాల్సి వచ్చేలా ఉంది. అయినా పర్లేదులే, ఆటోని బాగా తక్కువకు మాట్లాడుకున్నాం కదా అటుదిటు బరాబర్ అవుతుందనుకుంటూ ఇంకో చోట ఫోటోలు దిగి ఇక మాతో రావొద్దు, మీ పని మీరు చూస్కోండని కచ్చితంగా చెప్పేశాం.
ఆ తర్వాత పాలరాతితో కట్టిన ముంతాజ్ మహల్ సమాధిని చూసి యమునా నది మురికిని ఆస్వాదించి వెనుదిరిగాం. చేతుల్లో సెల్ ఫోన్లు ఊరికే ఉండవుగా.. పిచ్చిపిచ్చిగా ఫోటోలు దిగి ఇందాక కొన్న 10రూపాయల బ్లూ కవర్ కాళ్లకు తొడుక్కుని సమాధిని చూసి బయటికి వచ్చాం. వచ్చిన తోవను మర్చిపోకుండా ఉన్నందుకు మాలో మేము మురిసిపోతూ.. ఆటోవాలా ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేశాం. ఆయన మరో నెంబర్ ఇచ్చారు. అతనికి ఫోన్ చేస్తే.. అలా నడుచుకుంటూ ముందుకు వస్తే నేను కనిపిస్తానన్నాడు, అదేంటీ మేమున్న చోటికి వచ్చి ఎక్కించుకుపోతానన్నాడు మొదటి డ్రైవర్ అంటే ఆయన లేళ్లే, నేనున్నాగా, అలా నడుచుకుంటూ ముందుకు రమ్మన్నాడు. మేము పోయేటప్పటికి టక్కుగిక్కుచేసి టిప్ టాప్ గా ఉన్న ఓ మనిషి కనపడ్డాడు. మీరేనా ఇందాక ఫోన్ చేసిందంటే అవునన్నాం, సర్లే, ఫోటోలు తీస్కోండి ముందు అని చెప్పాడు. అవి వచ్చే పాటికి మరో పావుగంటో అరగంటో పట్టింది. అక్కడే ఓ వాటర్ బాటిల్ కొనుక్కుని నీళ్లు తాగి ఈ రెండో ఆటోలో బయటపడ్డాం. ఈ రెండో ఆటోవాలా ఇంకా మంచి మాటకారి. ఏమైనా తింటారా అన్నాడు, ఆ..ఆ.. అన్నాం. మళ్లీ సందు గొందుల గుండా కాసేపు మెయిన్ రోడ్డు మీదా పోనిచ్చి మళ్లీ వేరే సందులోకి తీసుకెళ్లి ఇది చాలా మంచి హోటల్ అన్నాడు. అబ్బో ఇంత పెద్ద హోటల్లో మేము తినలేం గాని ఏదైనా రోడ్డు పక్క టీ కొట్టుంటే ఆపమన్నాం. మేము మళ్లీ ఆటో ఎక్కబోతుంటే ఆ హోటల్ యజమాని వచ్చి ఈ ఆటోవాలను పలకరించి.. ఏమైందీ, ఎందుకి వెనక్కిపోతున్నారనడం, ఆయనేదో చెప్పడం పూర్తయింది. అదేదో మాకూ అర్థమైంది.
ఆటోవాలాకి మా తీరూ అర్థమైంది. ఇదేదో గిట్టుబాటు కాని వ్యవహారమేననుకున్నట్టున్నారు. బలవంతంగా వాహనాన్ని వెనక్కి తిప్పి ఇప్పుడెక్కడి పోవాలని కాస్తంత కటువుగానే అడిగాడు. ఆగ్రా ఎర్రకోటకు పోనిమ్మన్నాం. అప్పటికే సాయంత్రం 4 గంటలైంది. కనీసం 6 గంటలకైనా ఢిల్లీ బస్సెక్కకపోతే మేముండే చోట తిండి ఉండదు. ఆటో ఆగ్రా ఎర్రకోటకు దగ్గర్లో ఆగింది.
ఆగ్రాలో చూడాల్సిన ప్రదేశాలలో ఆగ్రా ఎర్రకోట ఒకటి. చక్రవర్తి అక్బర్ నిర్మించిన ఈ కోటలో అనేక మొఘల్ తరహా కట్టడాలున్నాయి. ఈ చారిత్రక కట్టడంలో మసీదులు, రాజభవనాలు, అందమైన తోటలు ఉన్నాయి. మొఘల్ చక్రవర్తులు ఈ ప్రదేశాన్ని కొన్నేళ్లపాటు తమ నివాసంగా ఎంచుకున్నారు. చరిత్ర ఔత్సాహికులు, వాస్తుశిల్ప అభిమానులు అన్వేషణకు ఆగ్రా ఎర్రకోటను సందర్శిస్తుంటారు. ఒక్కొక్కరికి 40 రూపాయలు పెట్టి టిక్కెట్ కొని చూసి బయటకు వచ్చేటప్పటికి 6 దాటింది. ఇంకా చూడాల్సిన వాటిల్లో ఫతేపూర్ సిక్రీ, జామా మసీదు ఉన్నాయి. ఆగ్రాలో సందర్శించాల్సిన ప్రదేశాలలో ఫతేపూర్ సిక్రీ ఒకటి. చక్రవర్తి అక్బర్ ఈ పట్టణాన్ని 16వ శతాబ్దంలో నిర్మించాడు. అద్భుతమైన రాజ ప్రసాదాలు, నిర్మాణ శైలి ఫతేపూర్ సిక్రీ సొంతం. బులంద్ దర్వాజా అనే భారీ ద్వారం అక్కడే ఉంది.
ఆటోవాలా అడ్డం తిరిగాడు. ఫతేపూర్ సిక్రీ పోయిరావాలంటే చాలా టైం పడుతుందన్నాడు. సర్లే, వదిలేయ్.. అదేదో మీనా బజారు చూపిస్తానన్నావు కదా అది చూపించి బస్టాండులో వదిలేయమన్నాం.. దానికీ మెలికపెట్టాడు ఆటోవాలా. ఆగ్రా బస్టాండ్ నుంచి ఢిల్లీకి ఉత్తరప్రదేశ్ ఆర్టీసీ బస్సులుండవన్నాడు, అన్ని ప్రైవేటు బస్సులే ఉంటాయన్నాడ. మీరు అక్కడ ఇబ్బంది పడతారని కంగారు పెట్టి ఓ ప్రైవేటు ట్రావెల్స్ వద్ద ఆపి మీరు అక్కడ టిక్కెట్ కొనుక్కుంటారా, లేదా అనే దాకా వెళ్లాడు.
పొద్దున మేము వచ్చిన ప్రైవేటు బస్సులో టిక్కెట్ ఒక్కొక్కరికి రూ.250. ఇప్పుడది రూ.400 అంటున్నాడు. చూస్తాచూస్తా ఒక్కొక్కరికి రూ.150 పొగొట్టుకోవడం ఎందుకని మేమూ కాసేపు మొరాయించాం.
ఆటోవాలా స్థానికుడు, ఏరియా తెలిసిన తెలిసిన వాడు, చీకటి చిక్కపడింది. పొద్దుట్నుంచీ తిరిగి ఉండడం వల్లేమో మాకూ విసుగొస్తోంది. ఆటోవాలాతో గట్టిగానే వాదులాటకు దిగాం. మేము చెప్పింది చేయమన్నాం, చేస్తా గాని ఆ తర్వాత రోడ్డు మీద మీకు అగచాట్లు తప్పవని బెదరేశాడు. అయితే అయిందిలే ముందు అక్కడకు పోనివ్వమన్నాం, అప్పుడు అసలు మనిషి ఆటోవాలా లోపలి నుంచి బయటకు వచ్చాడు, అక్కడకు పోవాలంటే మరో రెండు వందలు ఇవ్వాలన్నాడు, కుదరదన్నాం, అది బైపాస్ అన్నాడు, ఇంకేదో చెప్పాడు.., మాకు కోపం వస్తోంది, సర్లే ముందు టీ తాగుదాం పదా అన్నాం, మమ్మల్ని ఓ టీకొట్టు దగ్గర ఆపి మీరు తాగండి, నేను తాగను అన్నాడు.
మేము టీ తాగుతుండగా ప్రైవేటు ట్రావెల్స్ నుంచి ఫోన్ వచ్చింది, టిక్కెట్లు కావాలా వద్దా, టికెట్లు అయిపోవచ్చాయి, ఈ బస్సు పోతే మళ్లీ ఉండదన్నది దాని సారాంశం.
అప్పుడు మేమూ మెత్తబడ్డాం, టీ తాగిన తర్వాత పోయి టిక్కెట్లు కొన్నాం.. ఇంకా బస్సు రావడానికి టైం ఉంది కనుక మమ్మల్ని మీనా బజారుకు తీసుకువెళ్లమన్నాం.. ఇష్టం లేని వ్యవహారం కదా.. సరే ఎక్కండి అంటూ ఆ ట్రావెల్స్ పక్కనే ఉన్న మీనా బజార్ అనే ఓ షాపు దగ్గరకు తీసుకువెళ్లి ఇదే అది దిగండి అన్నాడు. అది చూస్తే మన చార్మినార్ లో బ్యాంగిల్స్ షాపుకి ఎక్కువగా నిమ్స్ ఆస్పత్రి ఎదురుగా ఉండే చైనా బజార్ కి తక్కువగా ఉంది. ఇక్కడ మేము చూసేదేముందీ ట్రావెల్స్ దగ్గరికే వెళ్లమన్నాం..
అక్కడ దించేసి అతను వెళ్లిపోతూ ట్రావెల్స్ వాళ్లని కలిశాడు. వాళ్ల మధ్య లావాదేవీలు జరిగిపోయాయి. అనుకున్న దానికి గంట ఆలస్యంగా మినీ బస్సు బయల్దేరింది. బస్సు కదిలి మెయిన్ రోడ్డు ఎక్కిన తర్వాత ఏసీ అన్నావు, ఎక్స్ ప్రెస్ అన్నావు కదా ఇదేమిటీ ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నావని మా తోటి ప్రయాణీకుడు అడిగాడు.. దానికి ఆ కండక్టర్ నుంచి వచ్చిన సమాధానం.. మీరిచ్చే 150 రూపాయలకి ఇన్ని ఉంటాయా, ఎలా గిట్టుబాటవుతుందన్నాడు. అందరం బిత్తరపోయి చూశాం.. అదేంటీ రూ.400 ఇచ్చాంగా అన్నాం.. అందులో రూ.200 ఆటోవాలాకి, 50 ట్రావెల్స్ వాడికి, మాకిచ్చేది రూ.150 కదే. టిక్కెట్లన్నీ ఒకే చోట దొరుకుతాయని, మినిమం గ్యారంటీ ఉంటుందని అక్కడ ఎక్కించుకుంటాం, దార్లో ప్యాసింజర్లు ఎక్కితేనే మాకు గిట్టుబాటు అంటూ గుట్టు విప్పారు. మనది మధ్యతరగతి మనస్తత్వం. రూపాయి పెట్టి రూపాయిన్నర లాభం పొందాలని మనం అనుకున్నట్టే అవతలివాడూ అనుకుంటాడని అనుకోకపోవడంలోనే అసలు కిటుకు ఉంది. ఎట్టకేలకు రాత్రి 12 గంటల ప్రాంతంలో ఢిల్లీ నోయిడా సెక్టార్ 17కి చేరాం.
అతిథి సేవలకు ఆ మాత్రం గిట్టుబాటు కావొద్దా అని ఆటోవాలా అనుకుంటే సమాధానం లేదు గాని నాలుగు డబ్బులు మనవి కాదనుకుంటే మాత్రం మంచి సౌకర్యమే. పైసామే పరమాత్మా హై అని ఊరికే ఉంటారా మరి
Tags:    

Similar News