ఆంధ్ర ‘యాపిళ్లు’ తినడానికి రెడీకండి..!

2016లో మొదలైన కృషి ఫలిస్తోంది. మూడేళ్లలో పంట కోతకొచ్చింది.

Update: 2025-09-24 04:30 GMT

 యాపిల్‌ తోటలు ఎక్కడ పెరుగును? చల్లని కొండల నడుమ సిమ్లాలో అని అందరికీ తెలిసిందే... ఎక్కడో హిమాలయాల్లో పండే యాపిల్‌ నేడు మన్యంలో కూడా పండుతోంది.

తూరుపు కొండల అంచున పూసిన ఆపిల్‌ పువ్వులను చూడాలంటే ఈ

వింటర్‌ సీజన్‌లో ఆంధ్రా కశ్మీర్‌ గా పిలుస్తున్న లంబసింగి వైపు వెళ్లాల్సిందే...

యాపిల్‌ పంటను వ్యాణిజ్యపంటగా పెంచి, గిరిజన రైతులకు సుస్ధిర ఆదాయం తేవడానికి శాస్త్రవేత్తలు, అధికారులు,ఎన్జీఓలు కలిసి చేసిన కృషి మెల్లగా ఫలిస్తోంది.

ఇప్పుడీ వైవిధ్యానికి కారణం సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ)చేసిన ప్రయోగమే.

యాపిల్‌ మొక్కల మధ్య రైతులు.

మన్యం అనుకూలం 

విశాఖ ఏజెన్సీలోని ఉన్న లంబసింగి, చింతపల్లి, అరకు ప్రాంతాలు ఉత్తర భారతదేశంలోని సిమ్లా, కులు, మనాలి ప్రాంతాల్లోని వాతావరణాన్ని పోలివుంటాయి. సముద్రమట్టానికి 3280 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు కొన్ని సార్లు జీరో, మైనస్‌ డిగ్రీలు కూడా నమోదవుతుంటాయి. దీంతో, విశాఖ ఏజెన్సీ ప్రాంతం ఆపిల్‌ సాగుకు అనుకూలంగా వుంటుందని హైదరాబాద్‌ సీసీఎంబీ సైంటిస్టులు భావించారు.

ఈ ప్రాంత వాతావరణంపై అధ్యయనం చేసి, పరిస్థితులు అనుకూలంగా కనిపించడంతో, పాడేరు ఐటీడీఏ అధికారుల ద్వారా నేరుగా ఈ ప్రాంతాల్లో యాపిల్‌ పంటను మొదలు పెట్టారు. ‘గిరిజన వికాస’ ఎన్జీఓ పర్యవేక్షణలో యాపిల్‌ మొక్కలను గూడెం కొత్తవీధి మండలం, కట్టుపల్లి, మాడెం గ్రామానికి చెందిన రైతులతో పాటు, లంబసింగి, గెత్తంపాకలు గ్రామాల్లో సాగు చేయించాలని ప్రణాళికలు తయారు చేశారు.

రైతుల తో ‘గిరిజన వికాస’ ఎన్జీఓ ప్రతినిధులు

ఆదివాసీలకు ‘ వికాసం’ 

‘‘ అందరూ సాగు చేసే పంటలనే మీరు పండిస్తే ఏం గుర్తింపు ఉంటుంది.. ఎవరూ పండిరచలేనివి పండిస్తేనే కదా సంతృప్తి. కొంచెం కష్టపడితే యాపిల్‌ ఎవరైనా పండిరచొచ్చు. ఆరోగ్యంతోపాటు, ఆదాయం...’’ అని యాపిల్‌ సాగులో శిక్షణ ఇచ్చి రైతుల్లో కదలిక తెచ్చింది గిరిజన వికాస స్వచ్ఛంద సంస్ధ.

వారి కష్టం ఊరికే పోలేదు. మొక్కలు బతికాయి. 3 ఏళ్ల నుండి యాపిల్‌ కాత రావడం మొదలైంది.

‘‘ 2016లో సిమ్లా నుండి మైఖేల్‌, సెలక్షన్‌ అనే రకాల మొక్కలు రప్పించి, కట్టుపల్లి, మాడెం గ్రామాల్లో రెండు వందల మంది రైతులకు ఒక్కొక్కరికి వంద మొక్కలు చొప్పున ఇచ్చి సాగు చేయించాం. రెండేళ్లలో కాతకు వచ్చాయి. కాయలు ఆకుపచ్చని రంగు నుండి ఎరుపుకు రావడానికి కొంత టైమ్‌ పడుతుంది. సిమ్లా యాపిల్‌ అంత రుచి కాకపోయినా బెటర్‌ గానే ఉన్నాయి.’’ అంటారు గిరిజనవికాస స్వచ్ఛంద సంస్ధ సిఇఓ నెల్లూరి సత్యనారాయణ. దశాబ్దం క్రితం ఈయన నాబార్డు ‘మాతోట’ పథకం ద్వారా వందలాది గిరిజన కుటుంబాలతో మామిడి,సపోట,ఉసిరి పంటలు పండిస్తున్నారు. ఇపుడు యాపిల్‌ సాగుతో వారికి మరికొంత ఆదాయం వచ్చేలా చేస్తున్నారు.

గూడెం కొత్తవీధి మండలం, కట్టుపల్లి గ్రామంలో యాపిల్‌ పంటల మధ్య రైతులు

సహజ ఎరువులే...

ఇతర రాష్ట్రాలలో రసాయన ఎరువుల వాడకం ఎక్కువ. ఆపిల్‌ చెట్లకు కాల్షియం అమ్మోనియం నైట్రేట్‌ వేసేవారు. దీని వల్ల భూమిలోని సేంద్రియ పదార్థం క్షీణిస్తుందని, మన్యం రైతులకు ఏపి రైతు సాధికారత సంస్ద, ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ ఇచ్చింది. ‘‘ పంచగవ్య, జీవామృతం మిశ్రమాన్ని ఆపిల్‌ చెట్లకు వేయడం, జీవామృతాన్ని పిచికారీ చేయడంతో కాయలు గుండ్రంగా పెద్దగా పెరుగుతున్నాయి. తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని, ప్రకృతి సాగుతో ఖర్చు తగ్గింది. ’’ అని, మాడెం గ్రామానికి పూసర్ల దేవసహాయం, రొబ్బలింగమ్మ,అంటారు.

ఊటనీటితో అద్భుత పంట 

మన్యంలో పంటలన్నీ వర్షాధారమే, ఏడాదికి ఆరునెలలు చిరుజల్లులు పడుతుంటాయి. మిగతా కాలంలో కొండల్లో పుట్టిన ఊటనీరే ఇక్కడి జలవనరు. తాగడానికి,పంటలకు వాటినే వాడుతారు. ఏడాదంతా ఆ స్యచ్ఛమైన జలధార అందుబాటులో ఉంటడంతో దానిని తోటలకు మళ్లించి, డ్రిప్‌ ద్వారా చుక్కల సాగు చేస్తున్నారు. కొండనీటి వల్ల పండ్లు రుచిగా ఉంటున్నాయని స్ధానికులంటున్నారు.

యాపిల్‌ ఏడాదికి రెండు కాపులు. మొదటి కాపు డిశెంబర్‌లో,రెండవ కాపు మే నెలలో మొదలయి 3నెలలు పాటు కాయలు వస్తాయి. చెట్టునుండి కోసాక నాలుగు రోజుల వరకు నిలువ ఉంటాయి.

మన్యంలో కాసిన యాపిల్‌,

తూరుపు కనుమల్లో 15 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఏప్రిల్‌ నెల నుండి చినుకులు పడుతుంటాయి. ఈ చిరుచినుకులే యాపిల్‌, కాఫీ పంటలకు మేలు చేస్తున్నాయి. ఇక్కడ ఏటా 5డిగ్రీల నుంచి 10డిగ్రీల ఉష్ణోగ్రతలు 260 నుంచి 300 గంటలు నమోదయ్యాయి. ఇలా ఏడాదిలో కనీసం 150 గంటల నుంచి 200 గంటల వరకు ఉన్నా ఆపిల్‌ పంట సాగు చేసుకోవచ్చు అంటున్నారు వ్యవసాయ నిపుణులు.

పండు పదిరూపాయలే ...

ఒక్కో గిరిజన రైతుకు కొండల మీద కనీసం 3 ఎకరాలుంటుంది. కాఫీ,మిరియాలు,పసుపు పండిస్తారు. వాటితో పాటు పావు ఎకరాలో వంద యాపిల్‌ మొక్కలు పెంచుతున్నారు.

‘‘ ఈ సారి చెట్టుకు 150 కాయలు వరకు కాసాయి. ఒక్కోకాయ బరువు 70 నుండి 100గ్రాముల వరకు ఉంది. మేమంతా కలిసి మాతోట రైతు ఉత్పత్తిదారుల సంఘం గా ఏర్పడి పండ్లను అమ్ముతున్నాం.’’అంటారు సింబోయిన సింహాచలం అనే రైతు. ఆ ప్రాంతానికి నిత్యం వచ్చే టూరిస్టులకు పదిరూపాయలకే ఒకపండు చేతిలో పెడతారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో...

మన్యంలో కాఫీ మాదిరిగా యాపిల్‌ సాగు కూడా విస్తరిస్తోంది. సిమ్లా ఆపిల్‌, కాశ్మీర్‌ ఆపిల్‌, లాగా మన్యం యాపిల్‌ అనే బ్రాండ్‌ కూడా మార్కెట్లో సందడిచేసే రోజులు మరెంతో దూరంలో లేవు. చింతపల్లి, లంబసింగిలతో పాటు, తెలంగాణ లోని వికారాబాద్‌ దగ్గర అనంతగిరి కొండలు, అసిఫాబాద్‌ జిల్లా, కెరమెరి ప్రాంతంలో ఆపిల్‌ సాగుకు అనువైన వాతావరణం ఉన్నట్లు సీసీఎంబీ సైంటిస్టులు గుర్తించారు. ఉత్తర భారతదేశంలోలా ఏడాదిపొడవునా యాపిల్‌ పండిరచుకునే ఛాన్స్‌ మన తెలుగు రాష్ట్రాల్లో ఉందని వ్యవసాయ నిపుణులంటున్నారు.

ఎలా వెళ్లాలి? 

తూరుపు కనుమల్లో నర్సీపట్నం నుండి లంబసింగి వరకు ఈ వేసవిలో కూడా, 15 నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది, ఆరు నెలలు పాటు మబ్బుల ఆకాశం, చిరుజల్లులు కురుస్తుంటాయఎచి కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆంధ్రా కశ్మీర్‌ అంటారు. హైదరాబాద్‌ నుండి 600కిలో మీటర్లు, విజయవాడ నుండి 320కిలో మీటర్లు, విశాఖపట్నం నుండి 90కిలో మీటర్లు దూరం ఉంటుంది. విశాఖ నుండి నర్సీపట్నం చేరుకుంటే అక్కడ వసతి సౌకర్యాలుంటాయి. అక్కడి నుండి చింతపల్లి, లంబసింగి, గూడెం కొత్తవీధి 40కిలో మీటర్ల లోపు ఉంటాయి. యాపిల్‌, కాఫీ, మిరియాలు, స్ట్రాబెర్రీ పంటలను అక్కడే చూడవచ్చు.

రైతులకు మనవి 

ఈ యాపిల్‌ పంట ప్రయోగ దశలో ఉంది. దిగుబడి వస్తుంది కానీ, వ్యాపార పరంగా అమ్మకాలకు ఇంకా అనుకూలం కాదు. మార్కెట్‌లో కనిపించే కశ్మీర్‌ యాపిల్స్‌ లా అందంగా రంగు రుచి ఇంకా రావడానికి కొంత టైమ్‌ పడుతుందని రైతులు అంటున్నారు. ఇతర ప్రాంతాల రైతులకు ఈ పంట అనుకూలం కాదు.

Tags:    

Similar News