-సడ్లపల్లె చిదంబరరెడ్డి
అది-- తెగిపోతున్న ఊపిరి ఉయ్యాల మీద ఊగే సమయం!!
మనో గోళంలో యేదో అలమటింపుల వెతుకులాట.
కదిలే కాలానికి అవలోకనాల కళ్ళెం వేసి
గతాల భాండాగారాల అరల నలా తెరిస్తే...
జారుడు బల్ల మీద కోలాహలాల పిల్లలు దర్జాగా సాగునట్లు
ఎడమగట్టు కొక చేయి కుడి తట్టు కొక వరద హస్తాన్నీ విస్తరించి
ఏటితల్లి సవారీ ఒడిలో వయ్యారాల నీటి చెలియ!!
అత్తింటి కాపురానికి కళ్లు చెదిరే సింగారాల కొత్త కోడలు
అలలై కలలై పరవళ్లై వచ్చునట్లు నా మాగాణం కమత ప్రాంగణానికి
అడుగు అడుగూ మడుగుల ముద్రలై కదిలి వచ్చి
మార్మిక భావాల మెత్తని దుక్కి హృదయాన్నే కౌగిలించావో!!
మన్ను తిని మట్టినీరే తాగి భూ ధూళినే ప్రాణ వాయువుగా శ్వాసిస్తూ
అందరికీ అన్నాన్ని పండించాలనే ధ్యాసల పదకొండో అవతారాన్ననుకొని
నన్నే వరించావో!! తడి తడి స్వప్నాల సహచరీ!!
నీ స్నేహ స్పర్శతో రాతి గవ్వలుకూడా అద్భుత జీవ కణాలై
ఆకుపచ్చని కళల సిరుల పైరులయ్యాయి.
కరకు పాషాణాలు సైతం పొరలు పొరలై స్పందించి
మొక్కల పెంపకాల మమకారాల కుండీ లయ్యాయి.
నీ వలపుల పలకరింపుల పులకరింపుల తరుణానికి....
నీ సాంగత్య పారవశ్య సుఖాల సమయానికి ......ఏ
పెత్తందారీ మామ కర్మాగారాల కాలుష్యాల దుర్గందాల్ని...నీ
నిర్మల నివాసాల ఆవాసంలో నికృష్టంగా కుక్కి కూరినాడో!! ఏ
సాధింపుల గంపెడు గయ్యాళీతనాల అత్త యంత్రాల మంత్రసానిగా మారి
నీ పనితనాల ఋతుశక్తిని సాంతం కంటగింపుల కుయుక్తుల్తో కుంగదీసిందో
మరే దుస్సాహస కీచక నీచులు నీ సుందర సుకుమార మేని పొరలపై
రసాయనాల విష ద్రావకాల్ని వికృత మూకలై పిచికారీ చేశారో? భరించక
అసహ్యాల ఆక్రోశాల ఆమని వై నీవు ఏ
నిర్మానుష్య నిషీధి తీరాల ఆవలికో తరలి పోయావనుకొన్నా!! అయినా
ప్రకృతి ప్రాణుల ప్రేమనూ మూగ జీవుల ఆత్మనూ మరువలేని నీవు
పగలంతా పనిలో శ్రమగా మారిపోయిన తల్లి సాయంకాలం పసిబిడ్డ ఆకలికి
పాలధార లవ్వాలని పరుగుల వాగై వచ్చునట్లు
వంకా వాగూ చెరువూ దరువూ ఆశ్చర్యాలై పొంగి పొర్లేలా
వరాల వర్షాల హర్షమై సీమ సీమంతా జలాభరణాల జాణవై పునరాగమిస్తే
గల గల పలకరింపుల్తో జలతత్త్వాల లోతుల వనరులన్నీ
నా మట్టి దేహానికి చల్లని తీయని తీగలై అల్లుకొన్నాయ్!!
నే నిప్పుడు పిట్టల తేనె తుట్టెల సహవాసాల చెట్టుని
సత్యమంత ఖచ్చితంగా పర్యావరణ పాలనకు తలవంచే పిడికెడంత మట్టిని!!