మన జీవితాల్ని శాసించే శక్తులను చూపించిన నాటకం ‘పడమటిగాలి’
30 యేళ్లయినా ప్రాముఖ్యం తగ్గని నాటకం ‘పడమటి గాలి’
2024 డిసెంబర్ 10 మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు పాటిబండ్ల ఆనందరావు రచన 'పడమటి గాలి' నాటకఓ గుంటూరు, అన్నమయ్య కళా కేంద్రంలో ప్రదర్శిoచారు. నాటక పదర్శనకు ముందు 6:00 గంటలకు జనసాహితి సభ్యుడు సిహెచ్ నాగిరెడ్డి అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. పడమటి గాలి నాటకంలో ‘మాయోడు’ పాత్ర వేయనున్న గుమ్మళ్ళ బలరామయ్య (రిటైర్డ్ ఐఏఎస్) దివి కుమార్ ను సభికులకు పరిచయం చేశారు.
'పడమటి గాలి' పై దివి కుమార్ విశ్లేషణాత్మక వ్యాస సంపుటిని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఆవిష్కరించారు. పుస్తకo తొలి ప్రతిని ప్రజా సాహిత్య అభిమాని, తంతి తపాలా కార్మిక ఉద్యమ సీనియర్ కార్యకర్త అయిన కామ్రేడ్ తాతినేని వెంకట్రామయ్య గారు అందుకున్నారు.
నాటక పరిశోధకులు, కందిమళ్ళ సాంబశివరావు దివి కుమార్ పుస్తకంపై ప్రసంగించారు. పుస్తకంలోని ముఖ్య విశేషాలు కొన్ని దివి కుమార్ సభికుల దృష్టికి తెచ్చారు.
పడమటి గాలి నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు నాటకం గురించి, దానిపై వ్యాసాల గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమం అంతా ‘జన సాహితి’గుంటూరు జిల్లా శాఖ నిర్వహణలో జరిగింది.
ఈ నాటకం గురించి మరికొన్ని ముఖ్య విశేషాలు!
పడమటి గాలి నాటకాన్ని చూడలేకపోయినా కనీసం దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి? పడమటి గాలికి ముందుమాట రాస్తూ మురళి చందూరి , (యూ.ఎస్.ఏ. USA) ఇలా అన్నారు. "పాశ్చాత్యీకరణ, పరాయీకరణ ఝoఝలో ఇరుక్కొని వేళ్ళతో పెకల్చబడి, విసిరేయబడుతున్న పల్లె జీవితాలను పరిచయం చేసే నాటకం పడమటిగాలి...."
దీనికి ఇంకొక చిన్న చేర్పు కూడా అవసరం. గ్రామీణ జీవన విధ్వంసాన్ని తీవ్రతరం చేస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అమలుకు, రాష్ట్ర- కేంద్ర స్థాయిలలోని దళారీ రాజకీయమూ, వారికి స్థానిక ఆలంబనగా భూస్వామ్య పెత్తందారీ శక్తులు కలగలసి ఉన్నాయనేది కూడా పడమటి గాలి నాటకం కళ్ళకు కట్టే విధంగా దృశ్యమానం చేస్తుంది .
ఒక ప్రేక్షకుని అభిప్రాయం ప్రకారం "ఇది నాటకం కాదు - మన ఊళ్లో మన మనుషుల మధ్య ఉన్నాం - నాటకం కొరకు కల్పించిన ఇతివృత్తం కాదు - ఆ ఊర్లో వాళ్ళమే మనం - మన వాళ్ళ దైనందిన ప్రవర్తనే జరుగుతున్న కథ. - జరిగింది కాదు - ఒక విధంగా మనమూ పాత్రధారులమే - కాకపోతే మనకు సంభాషణలు లేవు - ఊళ్లో జరుగుతున్న దానిని గమనిస్తున్నాం - అంతే!" ఏ ఆర్థిక రాజకీయాలు మన సంస్కృతిని, జీవితాన్ని శాసిస్తున్నాయో దాన్ని మన కళ్ళకు కట్టినట్లు దృశ్యమానం చేసిన నాటకం పడమటిగాలి!
మొదటి కన్యాశుల్కం ప్రదర్శన 1892లో జరిగింది. మిత్రుడు పాటిబండ్ల ఆనందరావు రచించిన పడమటిగాలి 1999వ సంవత్సరం చివరి రోజులలో మొదటగా ప్రదర్శించారు . రంగస్థలంపై 4:30 గంటల నిడివితో మనకు రంగస్థలంపై కనిపించే 30 పాత్రలు, వెనక ఉండి నాటకం నడిపించడానికి మరొక 30 మందితో భారీ బడ్జెట్ తో తెలుగు నాట దాదాపు అన్ని జిల్లాలలో కలిపి 150 దాకా ప్రదర్శనలు జరిగాయి. ఆ నాటకంపై రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి ఆహ్వానితులైన మేధావులతో ఒంగోలు పట్టణoలో జరిగిన సదస్సులో దివి కుమార్ కూడా పాల్గొన్నారు . కొన్ని విశ్వవిద్యాలయాలలో ఈ నాటకంపై పరిశోధనలు కూడా జరిగాయి.
ఆ నాటకంలో నటించిన ఒక ఐఏఎస్ అధికారి గుమ్మళ్ల బలరామయ్య గారు దానిపై ఒక పుస్తకమంత పరిశీలన రాశారు. తెలుగు సాహిత్య విమర్శకులు ఆ నాటకాన్ని పట్టించుకోలేదు అని చాలా తీవ్రంగా అభిశంసoచారు . అయితే ఆ నాటకంపై ప్రజాసాహితిలో ఎనిమిది వ్యాసాలు వచ్చాయని ఆయనకు తెలియపరచిన తర్వాత తన అభియోగాన్ని ఉపసంహరించుకున్నారు, లేదా ప్రజాసాహితి పత్రికకు పై విమర్శ నుండి మినహాయింపుని ఇచ్చారు. ఆ నాటకంపై దివి కుమార్ రాసిన వ్యాసాల వరుస ఇదీ!
1. పడమటి గాలిగా మారిన 30 ఏళ్ల పైరు పచ్చ విప్లవం..
2. సంస్కృతి - ఆర్థికం - పడమటిగాలి
3. ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణ- చలనం
4. ముడుచుకు పోయిన స్త్రీ పాత్రలు
5. విధ్వంసాన్ని అద్భుతంగా చిత్రంచి పరిష్కారాన్ని బహిష్కరించిన నాటకం
6. మాయోడు - గిరీశం
7. 'పడమటి గాలి' లో దళిత సమస్య
8. 'పడమటి గాలి' ని తిరగరాయాలి! ఎందుకు? ఎలా?
9 పడమటి గాలిలో భాష - యాస
మన దేశ సామాజిక వ్యవస్థను అర్థం చేసుకుని నిర్వచించుకోవడంలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, జీవిత వాస్తవికతకు కట్టుబడి రచించిన పడమటి గాలిలోని సామాజిక అంశాల లోతుపాతులను విశ్లేషించిన ఈ సమీక్షల పరంపరను పడమటి గాలి పై దివి కుమార్ సంపుటిగా విడుదలయింది . ఈ పుస్తకానికి ప్రముఖ సాహిత్య విమర్శకులు, జన సాహితి పూర్వ అధ్యక్షులు అయిన డాక్టర్ బి సూర్య సాగర్, పడమటి గాలి నాటకంలో వివిధ పాత్రలు పోషించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గుమ్మళ్ళ బలరామయ్య గారు ముందుమాటలు రాశారు. 2013 వ సంవత్సరంలో ప్రముఖ సాహితీ విమర్శకులు కడియాల రామ్మోహన రాయ్ నాటక రంగంపై తన యూజీసీ ప్రాజెక్ట్ పరిశోధనలో భాగంగా దివి కుమార్ తో చేసిన ఇంటర్వ్యూ కూడా ఈ పుస్తకంలో భాగంగా ఉంటుంది.
96 పేజీలు, ₹100/-
ప్రతులకు: మైత్రి బుక్ హౌస్
జలీల్ వీధి, కార్ల్ మార్క్స్ రోడ్ విజయవాడ 520002
Ph.90304 36156
హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ స్టాల్ నెంబర్ 131 లో లభించును!