అమరావతి గురించి మాట్లాడేపుడు లాస్ ఎంజిలీస్ ఫైర్ మర్చిపోరాదు

లాస్ ఏంజెలీస్ కార్చిచ్చులో తెలుగు రాష్ట్రాలకు గుణపాఠాలున్నాయా?;

By :  Admin
Update: 2025-01-14 02:30 GMT

-జువ్వాల బాబ్జీ

ఈ మధ్య కాలంలో తెలుగు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నగరాలను న్యూయార్క్ చేస్తామనో, లాస్ ఎంజిలీస్ చేస్తామనో, టెక్సాస్ గామారుస్తామనో, డల్లాస్ గా డెవెలప్ చేస్తామనో చెబుతున్నారు. కాని నగరాల దీనావస్థ ఇపుడు బయటపడుతూ ఉంది. దానికి తాజా ఉదాహరణ అమెరికాలోని దేవతల నగరంగా( ది సిటీ ఆఫ్ ఏంజెల్స్) ప్రఖ్యాతిగాంచిన లాస్ ఏంజిలీస్ విషాదకర సంఘటన. ఆ విషాదకర దృశ్యాలను టీవీలో చూస్తున్నప్పుడు, నాకు ప్రముఖ కవి గుర్రం జాషువా రాసిన ‘సత్య హరిచంద్ర’ నాటకం కాటికాపరి సీనులో పాడే ‘ఇచ్చోటనే’ పద్యం గుర్తుకు వచ్చింది .

లాస్ ఏంజలీస్ మంటల్లో కాలిపోయిన తన ఇంటిని చూపిస్తూ ఒక ఆమె, “ఇక్కడే నా విలాసవంతమైన భవనం ఉండేదని, ఇప్పుడు బూడిద అయిపోయిందీ,” ని చెప్పింది .బహుశా వారిలో చాలామంది ఇదే హాలీవుడ్ ప్రాంతమని, ఈ వీధిలో లేదా ఈ ఇంటిలో లేదా ఈ స్టూడియోలో సినిమా నిర్మాణాలు జరిగాయని అవన్నీ ఇప్పుడు బూడిదై నేలమట్టమయ్యాయని వారి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఉండవచ్చు. మహానగరాల నిర్మాణంలో మానవ తప్పిదాలే మరణ శాసనాలుగా మారిపోతున్నాయి. ఆ తప్పిదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ,జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి.

ఆ తప్పిదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ,జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. గ్లోబల్ వార్మింగ్ (global warming)పెరిగి, వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ్లోబల్ వార్మింగ్ అంటే, భూమి ఉపరితలం విపరీతంగా వేడెక్కుతుంది. దానినే వేరొక మాటలో చెప్పాలి అంటే క్లైమేట్ చేంజ్ (climate change). ఇది కొన్ని నెలల పాటు ఒక్కోసారి సంవత్సరాల తరబడి కొనసాగుతుంది .

దానివలన హిమనీ, నదాలు కరిగిపోవడం, సముద్ర మట్టం పెరిగిపోవడం, విపరీతమైన వేడి, అకాల వర్షాలు ,వరదలు లాంటి మార్పులు సంభవిస్తున్నాయి.

ఆ క్రమంలోనే అమెరికాలోని లాస్ ఏంజిల్స్ మహానగరంలో, గత మూడు సంవత్సరాలుగా, భూగర్భ జలాలు ఇంకిపోయి నీటి ఎద్దడి పెరిగిపోయింది. ఎవరైనా సరే, ఇండ్లకు చుట్టుప్రక్కల ఉండే చెట్లకు నీరు పెట్టుకోవాలంటే, వారానికి రెండుసార్లు ఒక్కో విడతకు కేవలం ఎనిమిది నిమిషాల చొప్పున నీరు పెట్టుకోవచ్చని నిబంధన విధించారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు వీస్తూ మొత్తం నగరాన్ని చుట్టుపక్కల ఉన్న 30 వేల ఎకరాల అటవీ విస్తీర్ణాన్ని బూడిద చేసింది . మీ అందరికీ తెలుసు ఒక శాతం పొడిగాలి" గ్లోబల్ వార్మింగ్" కు దారితీస్తుంది.

అమెరికాలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో 30 వేల ఎకరాలలో చెట్లు కాలి బూడిదయ్యాయి. ఇక్కడ "వృక్షో రక్ష రక్షితః "అన్న సామెత ఎటు పనికిరాకుండా పోయింది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది .లక్షల మంది ప్రజలు సర్వం కోల్పోయి వీధిన పడ్డారు. ఇదంతా అమెరికా పారిశ్రామిక, అటవీ, పర్యావరణ నిర్లక్ష్య విధానాలు వలన జరిగిన నష్టంగా మనం అర్థం చేసుకోవాలి.

భారతదేశంలో కూడా పర్యావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి .ఢిల్లీ మహానగరాన్ని అతలాకుతలం చేస్తున్న దట్టమైన పొగ మంచు. చెన్నై, హైదరాబాద్ నగరాలను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు చుట్టుముట్టి భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం, కలిగించిన విషయం మనందరికీ తెలుసు.పారిశ్రామిక నగరమైన విశాఖపట్టణంలో హుద్ హుద్ తుఫాను సృష్టించిన విధ్వంసం మరువకముందే, విజయవాడ నగరాన్ని ముంచిన వరదలు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కృష్ణా నదికి కరకట్ట నిర్మాణం జరిగి ఉండకపోతే, వరద విజయవాడ నగరాన్ని ముంచి చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేదని అక్కడి ప్రజల అభిప్రాయం.

దీనకి కారణం ఏమిటి?

పరిశ్రమల స్థాపన కోసం పెట్టుబడిదారులను ఆకర్షించడంలో భాగంగా ప్రభుత్వాలు తీసుకునే కొన్ని, పర్యావరణ, ప్రజా వ్యతిరేక చర్యల వలన ఎదురయ్యే సమస్యలు.

ఇటీవల జనవరి 5 2025 గుంటూరులో National Real Estate Development Council, Confederation of Real Estate Developers Association of India సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అమరావతి నగరానికి చుట్టుప్రక్కల ఉన్న గుంటూరు, విజయవాడ ప్రాంతాలను కలుపుకొని, 184 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు ప్రకటించారు. అమరావతి నిర్మాణం భారతదేశంలోనే , నగర అభివృద్ధి నమూనాకు తలమానికంగా ఉంటుందని , అన్నారు. అంతటి గొప్ప రాజధాని నగర నిర్మాణం జరిగేటప్పుడు, ప్రభుత్వపరంగా తగు జాగ్రత్తలు తీసుకుని అడుగులు వేయాలి.

పర్యావరణ ప్రతికూల పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే గుంటూరు, కృష్ణ జిల్లాల మధ్య ప్రాంతం పర్యావరణపరంగా సెన్సిటివ్ జోన్ లో ఉంది.ఇది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కోస్టల్ తీర ప్రాంతం. మడ అడవులకు ప్రసిద్ధిగాంచింది.ఈ ప్రాంతం అరుదైన జంతు జాతులు , జీవవైవిద్యం కలిగి ఉంది.

2014 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు చాలామంది వ్యతిరేకించారు. రాజధానికి అనుకూలమైనది కాదని, చిత్తడి నేలలతో ఉంటుందని వరదలు సంభవించినప్పుడు ఆ ప్రాంతం మొత్తం నీటిమయమవుతుందని, ప్రతిపక్ష హోదాలో ఉన్న వై.యస్. జగన్మోహన్ రెడ్డి విమర్శించేవారు. అలాగే కొంతమంది పర్యావరణ ప్రేమికులు కూడా విమర్శించారు .

అయినప్పటికీ ఆ ప్రాంతాన్ని ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచే విధంగా రాజధాని నిర్మాణం చేపడతానని చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారు. పై అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రక్షణ చర్యలతో కూడిన విధానాల రూపకల్పన చేసి ఆధునిక అమరావతి రాజధాని నిర్మాణం జరిపితే బాగుంటుంది.

ఎందుకంటే రోజు, రోజుకి జనాభా పెరిగిపోయి గ్రామాల నుండి పట్టణాలకు జీవనోపాధి కోసం ప్రజలు వలసలు పోతున్నారు . రేపు భవిష్యత్తులో అభివృద్ధి చెందిన అమరావతి నగరానికి ప్రజలు ఉపాధిని వెతుక్కుంటూ వచ్చే అవకాశం లేకపోలేదు . రోడ్ల నిర్మాణాలు లేక ట్రాఫిక్ జామ్ జరిగి, ప్రజలు ,ఇబ్బందులకు గురవుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయిన అమరావతి నగరానికి ప్రణాళికలు సిద్ధం చేసేటప్పుడు ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరిస్తూ , జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.

గుంటూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, మన లక్ష్యం" ఏపీ నిర్మాణం" పారిశ్రామిక ,వ్యవసాయ, పర్యాటక రంగాలలో అభివృద్ధి చెందుతామని, చంద్రబాబు నాయుడు తన ఆశ భావాన్ని ప్రకటించారు . అమరావతి నగర వైభవానికి అవసరమైన ఆధునిక ఎజెండాను ప్రభుత్వం రూపొందించినట్లు అర్థమవుతుంది.

అయితే, ఈ మహానగరం ఉపాధికి ,ఉత్పత్తికి, పట్టుగొమ్మగా మారాలి. అంతేకానీ ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతుల్లో వెనుకబడి పోకూడదు . భవిష్యత్తులో సామాన్య ప్రజలకు అవసరమైన విద్య ,ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా, అవసరమైన చర్యలు తీసుకోవాలి.

దానికోసం పాలక ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో, మేధావులతో, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో , చర్చలు జరిపి విధానపరమైన చర్యలు చేపడితే మంచిది. 2030 కల్లా ప్రపంచ జనాభాలో 70 శాతం మంది నగరాలు/ పట్టణాలలో, నివసిస్తారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. కాబట్టి ప్రభుత్వాలు పకడ్బందీ, ప్రణాళికలతో కార్యాచరణకు ఉపక్రమించడం అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టాలెక్కిస్తున్నారు. ఆయన పారిశ్రామికవేత్తలతో విరామం లేకుండా సంప్రదింపులు జరుపుతూ ,పెట్టుబడులు తేవడానికి కృషి చేస్తున్నారు.

దానికి ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సమావేశం చెప్పుకోవచ్చు. ఇంకా గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వీటన్నిటిని ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. 2047 సంవత్సరం నాటికి ప్రపంచ నంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లడం ముఖ్యమంత్రి విజన్ గా చెప్తున్నారు.రాజధాని నిర్మాణ ప్రాంతమంతా పచ్చదనంతో కళకళలాడే పరిసరాలతో ఉంటుంది. దానిని జీవనయోగ్యమైనదిగా మార్చాలి.

రాజధాని నిర్మాణమే కేంధ్ర బిందువుగా, దాని సంరక్షణకు చర్యలు తీసుకోవడం నుంచి ప్రజలే ఆలంబనంగా వారి విద్య ,ఉపాధి, వైద్యం ,ఆరోగ్యం ,ఆహార భద్రత పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలి. కేవలం రాజధాని నగరం అభివృద్ధి మీదే మనం దృష్టిని కేంద్రీకరించడం వల్ల, ఓ ప్రమాదం ఉంది .చిన్నచిన్న పట్టణాల్లోని చిన్న తరహా కళలు ,పరిశ్రమలు ఉత్పత్తులకు, ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ విధంగా మహానగరాలకు ప్రజలు వలసలు పోకుండా సొంత సొంత గ్రామాలలోనే ఉపాధి పొందుతారు.అలా రాష్ట్రంలోని ఇతర పట్టణాలను, నగర పంచాయతీలను, అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పై ఉంది .

దీనికి స్థానికంగా లభించే వనరులను సద్వినియోగం చేసుకునే విధంగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, పెట్టుబడులను ఆకర్షించాలి. పొందికైన తీరులో అమరావతి రాజధాని నిర్మాణం జరిగితే ప్రజలు హర్షిస్తారు.

ప్రపంచంలోనే సాంకేతికంగా, ఆర్థికంగా ,అభివృద్ధి చెందిన అమెరికా ప్రకృతి కోపం నుంచి తప్పించుకోలేకపోయింది ఆ దేవతల నగరం (సిటీ ఆఫ్ ఏంజెల్స్ )అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పాలకులు ముందుకు సాగాలి లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు అనుభవాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది.

రెండవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రస్తుత ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం వడివడిగా అడుగులు వేస్తుంది.

కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ,నిధులు సమీకరించుకుని అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది . ఆ దిశగా రాష్ట్ర ప్రజలు, ఆయా రాజకీయ పార్టీలు, తమ సిద్ధాంతాలను పక్కనపెట్టి కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధికి , కృషి చేస్తారని ఆశిస్తున్నాను.

(జువ్వాల బాబ్జీ, అడ్వకేట్, రాష్ట్ర కార్యదర్శి,ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్)

Tags:    

Similar News