అక్కడ పల్లెల్లో కరువు ఉన్నా అక్షరాలు పండించారు...
‘నచికేత తపోవన్’ తెస్తున్ననిశబ్ద విప్లవం;
నిజామాబాద్‌లోని బస్వాపూర్‌కి చెందిన పాపిగారి శివ కుటుంబం బతుకు తెరువు కోసం
హైదరాబాద్ వచ్చింది. తల్లి ఇళ్లల్లో పనిమనిషిగా చేరింది. శివను చదివించడం ఆ తల్లికి భారంగా మారింది. 3వతరగతి వరకు చదివిన శివ బడి మానేసి గల్లీలో తిరగసాగాడు. అతడిని ‘నచికేత తపోవన్ ’ లో చేర్చుకున్నారు. ఇంటర్ లో 96.4శాతం మార్కులు సాధించాడు. ఇపుడు బీటెక్ చేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తనలాంటి పదిమందికి చదువు చెప్పించడమే తన లక్ష్యం అని గర్వంగా చెబుతున్నాడు.
భవన నిర్మాణ పనులు చేసుకొని బతికే కూలీల బిడ్డ, రాపోలు సావిత్రి. అయిదో తరగతి వరకు చదివి, ఆర్థిక స్టోమతు లేక ఒక లాండ్రిలో పనికి కుదిరింది. తల్లి ఆనారోగ్యంతో దూరమైంది. చదువు మానేసిన సావిత్రిని ‘నచికేత తపోవన్ ’ వారు స్కూల్లో చేర్చుకొని ఖర్చులన్నీ భరించి చదివించారు. అలా ఆమె బిటెక్ పూర్తిచేసి, ఇపుడు హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తు కుటుంబానికి ఆపరా అయింది. తనలాంటి పేదపిల్లలకు అండగా ఉంటానంటోంది సావిత్రి.
ఇలాంటి మేలిమి ముత్యాల్లాంటి యువత ఎలా తయారవుతోందో తెలుసుకోవాలంటే... నచికేతా తపోవన్‌కి వెళ్లాలి.
అక్కడ పుస్తకాల మోతలు ఉండవు.. ఆడుతూ పాడుతూ చదువుతారు. పిల్లలంతా సరళమైన తెలుగు,ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. ఆధునిక కంప్యూటర్ల ముందు బేసిక్స్ నేర్పుకుంటున్నారు ఆశ్రమమంతా విజ్ణానపు వెలుగు పరుచుకున్నట్టుంటుంది.
అక్కడ రైతులు కరవును జయించ లేక పోవచ్చుకానీ, వారి పిల్లలు చదువులో గెలిచారు.
పాలమూరు జిల్లా , జడ్చర్ల నుండి పది కిలో మీటర్లు వెళ్తే... ఇప్ప, టేకు చెట్ల మధ్య పెద్దబావి తండా, కొడగల్, కురువపల్లి, గోరిగడ్డ తండా,లక్ష్మీనాయక్ తండాలు కనిపిస్తాయి. ఇంట్లో తల్లిదంఢ్రులు కూలీకెళితే వారి బిడ్డలకు ఏమీ చెట్టుపుట్ట వెంట తిరిగేవారు. ఇపుడా పిల్లల దారి మారింది. చదువుల బాట పట్టారు.
ఆ గిరిజన ఆవాసాలకు సమీపంలోనే నాలుగు కుటీరాలు ఏర్పాటయి మధ్యలో చదువులమ్మ కొలువుతీరింది. అదే నచికేత తపోవన్. ఆ మట్టిగోడల ఆశ్రమంలోకి అడుగు పెడితే, కాకుల కేరింతలు, పిచ్చుకల కిచకిచలు, నెమళ్ల నడకలు కనువిందు చేస్తాయి. కంప్యూటర్ స్క్రీన్ మీద పాఠాలను పేదబిడ్డలకు బోధిస్తూ సచికేతానంద ఆత్మీయపు నవ్వుతో కనిపిస్తారు. ఆయన ఆ తండాల్లోని పిల్లలందరినీ చేరదీసి ప్రీస్కూల్ నడుపుతున్నారు.
హిమాలయాల నుండి తండాలకు...
హైదరాబాద్ కి చెందిన వసుంధర ‘నచికేత తపోవన్’ విద్యాసంస్ధలకు ఫౌండర్ ఛైర్మన్, మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండలం, కోడ్గల్ గ్రామం తో పాటు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఈ విద్యాసంస్ధలను నిర్వహిస్తున్నారు.
ఛైర్మన్ వసుంధర
ఆధ్యాత్మిక జీవనంలో మమేకమవుతూ హిమాలయాల్లో ధ్యానంలో గడుపుతున్న మహరాష్ట్రకు చెందిన స్వామి నచికేతానందతో సంప్రదించి పాలమూరు కరువు ప్రాంతలో చదువుకు దూరమవుతున్న చిన్నారులకు విద్యావెలుగులు పంచడానిక 12ఏండ్ల క్రితమే ఈ ఆశ్రమ బాధ్యతలు అప్పచెప్పారు.
‘మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాబోయే కాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే తరాన్ని సిద్ధం చేయాలంటే, జ్ఞానంతో పరుగెత్తాలంటే తాను స్వతహాగా అధ్యయనశీలి కావాలి. సరికొత్త భావాలను రేకెత్తించే నైపుణ్యాలను పిల్లలకు బోధించాలి. అలాంటి భావాలున్న స్వామి నచికేతానందకు ఈ బాధ్యత అప్పగించాం. బాల్యం నుండీ ఎన్నో ఒడిదుడుకులు, సమస్యల్లో ఉన్న కుటుంబాల నుండి వచ్చిన బిడ్డలకు మనోధైర్యాన్ని కలిగించి జీవితంలో స్ధిరపడేలా వారి నైపుణ్యాలను పెంచుతున్నాం.’ అంటారు వసుంధర.
ఇక్కడ పిల్లలకు ఆంగ్లంలో నైపుణ్యం కలిగిస్తున్న నచికేతానంద డిజిటల్ క్లాసురూమ్‌లో మాతో మాట్లాడుతూ...
స్వామి నచికేతానంద
‘‘సామాజిక విలువలతో కూడిన చదువే సమాజాభివృద్ధికి బీజం వేస్తుంది. మానవత్వాన్ని పరిమళింపజేస్తుంది. తద్వారా సామాజిక అభ్యున్నతికి కొత్తబాటలు నిర్మిస్తుంది. ఆ లక్ష్యంతోనే ఇక్కడ తరగతులు నిర్వహిస్తున్నాం.
4 సంవత్సరాల ప్రాయంలోనే పిల్లలు భాషలను నేర్చుకుంటారు. అపుడే ప్రీ స్కూల్ స్థాయిలోనే ఇంగ్లిష్ నేర్పాలి. లేకపోతే పెద్దవారయ్యే కొద్దీ కొత్త భాషలను నేర్చుకునే ప్రావీణ్యం వారికి తగ్గుతుంది. వీరు డిగ్రీ తీసుకుని బయటకొచ్చాక ప్రపంచ మార్కెట్లో ఉద్యోగాలకు పోటీ పడాలన్నా కష్టం. అది అసమానత్వానికి దారి తీస్తుంది... ఇక్కడి తండాల్లో వారు లంబాడీ భాషలోనే మాట్లాడుకుంటారు. ఇక్కడ చదివే పిల్లలు ఇంగ్లీషు మాట్లాడతారు... అమ్మ భాషకు వచ్చిన నష్టం ఏమీ లేదు. పాఠశాల చుట్టూ ఉండే వాతావరణం కూడా పిల్లల ఏకాగ్రతను పెంచుతుంది.. దానికి తగినట్టుగా క్లాసు రూమ్‌లను ప్రత్యేక డిజైన్‌లో నిర్మించాం...’’ అంటారు, వెలుగు నిండిన కళ్లతో సచికేతానంద.
ఆయనకు ఆర్కిటెక్చర్‌లో అనుభవం కూడా ఉంది. ఎర్రమట్టిని వాడి, వేపంగిలో కూడా చల్లగా ఉండే వాస్తు పద్దతిలో క్లాసు రూమ్‌లను తానే స్వయంగా డిజైన్ చేశారు.
చదువుతో పాటు పంటల సాగు!
స్కూల్ ప్రాంగణంలో మొక్కల పెంపకం
40 ఎకరాల విస్తీర్ణంలోని తపోవన్‌లో 2012లో ఈ స్కూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం 190 మంది పిల్లలు చదువుతున్నారు. చదువుతో పాటు యోగా నేర్పిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల పెంపకం నేర్పుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కర్మయోగా అనే క్లాసు ప్రతీ రోజు ఉంటుంది.
నగరంలో మరో స్కూల్...
మారు మూల తండాలలోనే కాదు, హైదరా బాద్ నగరంలోని మురికి వాడల్లో జీవిస్తున్న చిన్నారులకు కూడా,ఉచితంగా కార్పొరేట్ స్ధాయి విద్యను అందిస్తున్నది ‘నచికేత తపోవన్’ .
విద్యార్దులతో నచికేతానంద
ఈ విద్యాసంస్ధ ఫౌండర్ వసుంధర తమ విద్యావిధానం గురించి ఇలా అంటారు.
‘‘ లక్షలు వెచ్చించి కార్పొరేట్ స్కూల్స్‌లో చదివిస్తూ, ట్యూషన్లు, పాఠ్య పుస్తకాలు, ఆధునిక వసతులు కల్పిస్తే, అత్యున్నత మార్కులు సాధిస్తున్న విద్యార్దులతో, ఏ అవకాశాలు లేకుండా.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల బిడ్డలు పోటీ పడలేరుకదా..కానీ వారిలోని నైపుణ్యానికి పదును పెడితే ,పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటారని ఉద్ధేశ్యంతో ‘నచికేత తపోవన్’ ఏర్పాటయింది. విద్యార్దుల భవితకు మార్కులు ఒక్కటే కొలబద్ధ కాదు, సృజనాత్మకత, స్వీయ ఆలోచనా సామర్థ్యం, నైతికత, నిజాయితీ, మానవీయ గుణాలను పిల్లల్లో పెంపొందించడమే ప్రధాన ధ్యేయంగా మా విద్యాసంస్ధల పనితీరు ఉంటుంది.
చిన్నారుల్లో ఆధ్మాత్మికత, సామాజిక బాధ్యత, చదువు అనంతరం తమకాళ్లపై తాము నిలబడటం అనే అంశాల ప్రాతిసదికగా విద్య ఉంటుంది. స్కూల్ విద్య అయిపోగానే మా బాధ్యత తీరిందని అనుకోకుండా వారు పై చదువులకు సాయం అందిస్తున్నాం. తండాలు,స్లమ్‌ల నుండి వచ్చి,మా దగ్గర చదివి ఇపుడు ఇన్ఫోసిస్,ఎడిపి లాంటి పలు సంస్ధల్లో ఉపాధి పొందిన వారెందరో ఉన్నారు...’’ అని వివరించారు వసుంధర.
కార్పొరేట్ సంస్ధల చేయూత
అట్టడుగు వర్గాల విద్యకోసం ఈ సంస్థ చేస్తున్న కృషిని గుర్తించిన పలు కంపెనీలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. క్లాసులు సరిపోక చెట్లకింద పాఠాలు చెప్పాల్సిన పరిస్ధితి ఏర్పడినపుడు, ‘అరబిందో ఫార్మా ఫౌండేషన్ ’ ఐదు గదుల నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించింది.
తండాల్లో అన్ లైన్ క్లాసులు...
కోవిడ్ వల్ల ఏర్పడిన సమస్య వల్ల ప్రస్తుతం క్లాసులు లేనప్పటికీ, నిత్యం ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తూ పిల్లలు చదువుకు దూరం కాకుండా కాపాడుతున్నారు ఆశ్రమ నిర్వాహకులు.
‘‘ తండాల్లోని పిల్లలు రోజూ కొన్ని గంటల పాటు,తమ ఇళ్లలో స్మార్ట్ ఫోనులు దగ్గర పెట్టుకొని శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. వారి సందేహాలను అడిగి నివృత్తి చేసుకుంటున్నారు. కూలీ పనులు చేసుకొనే తల్లిదండ్రులు కూడా వారు పొదుపు చేసిన దాంట్లో కొంత స్మార్ట్ ఫోన్‌లు కోసం ఖర్చు చేస్తున్నారు. పిల్లల చదువు పట్ల వారు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే మాకు మరింత ఉత్సాహంగా చదువు నేర్పాలనిపిస్తుంది.’’ అంటారు, స్కూల్ హెచ్‌ఎం, విజయ సంజీవని.
‘తపోవన్’ కేంద్రాలు ఎక్కడున్నాయి?
భూమిలేని నిరుపేద గిరిజన విద్యార్థులకు, మురికివాడల్లో అల్పాదాయ వర్గాల పిల్లల కోసం ప్రస్తుతం రెండు కేంద్రాలు పనిచేస్తున్నాయి.
1, నచికేత తపోవన్ ఆశ్రమం. కోడ్గల్ గ్రామం, జడ్చర్ల మండలం, మహబూబ్‌నగర్ జిల్లా.
నచికేత తరగతి గదులు, మాదాపూర్
2, నచికేత తపోవన్ స్కూల్, మాదాపూర్, హైదరాబాద్. ఎల్‌కేజీ నుండి పదవ తరగతి వరకు ఉచిత బోధన. రాష్ట్ర సిలబస్‌తో పాటు కంప్యూటర్ ల్యాబ్, ధ్యానం,యోగా, ఆంగ్లం నేర్పిస్తారు.
నిరుపేదలు, మారుమూల ఆదివాసీ బిడ్డలకు నీడనిచ్చి, భవిష్యత్‌కి బాటలు వేస్తున్న మానవీయ సంకల్పం ఇది.