జీపుల్లో శేషాచల అడవి ప్రదక్షిణం

అటవీ ప్రాంతాలకు అద్భుతమయిన పేర్లున్నాయి. ఎవరు పెట్టారో ఏమో. బూచోళ్లపేట , గొల్లోల్ల చ్చ , పోలిగాడిసెల , అల్లిదొన , రాజులచలమ , జడల పొనుగు , ధర్భదొన ... ఇలా ఎన్నో

Update: 2024-05-19 05:40 GMT


ఎంతసేపూ కాలికి పని చెప్పటమేనా అని ఈసారి అటవీశాఖ వారి సహకారంతో ఒక జీపులో ముగ్గురు అటవీ కార్మికుల్ని వెంట బెట్టుకుని అడవంతా చుట్టి రావాలని బయలుదేరినాను.

అడవి ఆనుపానాలు బాగా తెలిసిన మణి , కొండడు నాతో ఉన్నారు. తిరుపతి నుండి మామండూరు ప్రకృతి బాటమీదుగా మాప్రయాణం పొద్దునే మొదలయింది.

బ్రహ్మగుండం దగ్గర బ్రిటీషువారి కాలం నాటి ఒక కొంప, దాని ముందుగా ఒక చెరువు చూపించినారు. ఈ చెరువులో నీళ్లున్నప్పుడు అన్ని రకాల జంతువులు, పక్షులు దాహార్తి తీర్చుకుంటాయి. కొంచెం వెనక్కివస్తే పుల్లుట్ల బోర్డు కనబడింది. పాతరోజుల్లో ఎద్దలబండ్ల మీద ఈ దారిలో జనం తిరుమలకు పోయేవారట.




 

పుల్లుట్లదారి మట్టిదారి. జీపు పోవటానికి పర్వాలేదు. దారి చుట్టూ కొండలు, అడవులు, పచ్చదనం ఆహ్లాదకరంగా ఉంది. దార్లో ప్రతిచోటు గురించి చెబుతున్నారు. గిరిజనులు కదా అడివంటే ప్రాణం. అప్పుడెప్పుడో ఇక్కడంతా చాలా గూడేలుండేవని, చెంచులు, యానాదులు తమ ముత్తాతల కాలం వరకు ఉండేవారని ఎందుకనో ఎవర్నీ ఉండనీయకుండా ఎవరు చేసినారో చేసి పాపం మూట గట్టుకున్నారని ఆవేదనగా చెప్పినారు.





 ఎర్రచందనానికి పుట్టిల్లయిన ఈ అడవుల్ని స్మగ్లర్ల పాలు చేసినారని వాపోయినారు. తామే వుండి వుంటే అడవికి రక్షకులుగా ఉండేవారం కదా, ఈ విధ్వంసానికి వీలయ్యేది కాదుకదా అన్నారు. దొంగలబండల దగ్గర అటవీశాఖ అధికారులిద్దరిని స్మగ్లర్లు రాళ్లతో కొట్టిచంపిన ఉదంతాన్ని పూసగుచ్చినట్టు చెప్పినారు. ఇంకొంచెం ముందుకు పోగానే ఎదురుగా పెద్ద ఎలుగుబంటి. జీపు ఎదురుగా వస్తున్నదనే భయమేలేదే. మేమూ అంతే అభయంతో జీపుదిగి ఎదురుగా పోగానే పక్కకు తప్పుకుంది. ఎలుగుబంటి చేతికి చిక్కితే తప్పించుకోవటం మహాకష్టమట. పిల్లల ఎలుగుబంటయితే మరీను. ఈతకాయలు, పండ్లు వాటి తిండి.




ఆ ఈతకాయలు మనలాంటి వాళ్లు పెరక్క తినటం వల్ల వాటి కడుపులు కొడుతున్నట్టు మణి అంటున్నారు. అసలు అడవిలో ఏదీ కోయకూడదు , తినకూడదు. అడవి ఆ జంతువుల, పక్షుల ప్రపంచం. మనం వాటికి కానీకుండా చేసి నోళ్లు కొడుతున్నామని గిరిజనులు అంటున్నారు. జీపులో వున్నా దారి పక్కనంలో చీకుకంప , మోచేతి వరకు గోక్కుపోయింది. కరోనా పుణ్యమా అని అందరి దగ్గర sanitize వుండటం వల్ల వెంటనే దాన్ని కొట్టుకోవటంతో రక్తస్రావం నిలిచింది. భలే ఆశ్చర్యపోయినాను అంత పవర్ఫుల్ వైద్యం కళ్లారా చూసి.





 పొద్దున బయలుదేరిన వాళ్లం సాయంకాలం సీతమ్మధార దాటి ఈతమాకుల మంటపం దగ్గరికి వచ్చినాము. జీపుదిగి ఆ మంటపం దగ్గరికి పోతే బయట కుప్పలు కుప్పలుగా చెప్పులు. అన్నమయ్య మార్గం గుండా వచ్చే భక్తులు ఇక్కడ చెప్పులు వదిలేసి ఉత్తకాళ్లతో తిరుమలకు పోతారట. శ్రీగంధం చెట్ల మధ్యన కొంచెంసేపు గడిపి మబ్బయ్యే దానికి ఇంకా కొంచెం టైం ఉండటం వల్ల కొంచెం దూరం అన్నమయ్యమార్గం గుండా పోతే సత్రాలు చూడొచ్చంటే బయలుదేరినాము.




అక్కడ చాలా ప్రాచీనకట్టడం శిథిలమై చారిత్రక ఆనవాలుగా మిగిలింది. మూడడుగుల గోడలు , బలంగా ఉన్నాయి. సున్నం ఇటుకల్తో కట్టి ఉన్నారు. అక్కడక్కడా దీగూళ్లు చెక్కుచెదరకుండా ఉన్నాయి. గోడల మధ్యలో చాలా బలమైన మర్రిచెట్లు ఊడలతో విరబోసుకోని ఉన్నాయి.




 

వెనక భాగంలో ఏనుగుల తొక్కిడికి నుజ్జునుజ్జయిన గోడల్ని చూసినాను. ఎప్పుడో కంబోడియాలో చూసిన అంకోర్ వాట్ మరుగుజ్జు రూపంగా అనిపించింది. ఈ సత్రం ఏరోజుల్లో, ఏ అవసరానికి కట్టినారో ఏ వివరమూ తెలియదు. అద్భుతమయిన ఈ కట్టడపు architecture అబ్బుర పెడుతున్నది.

ఇంకొంచెం పక్కన పెద్ద కోనేరు. జంతువుల కళేబరాలు చూసినన్నీ ఉన్నాయి. అప్పుడెప్పుడో పక్కన గుడి కూడ ఉండి ఉంటుంది. అన్నమయ్య నడిచొచ్చిన ఈ దారిలో ఇదేదో ఒక ముఖ్యమయిన సత్రమూ , గుడి అయి ఉండొచ్చు. భక్తుల రాత్రిళ్ల బస కావొచ్చు. మబ్బు తరుముకు రావటంతో వేగంగా బయలుదేరినాము. సరిగ్గా శ్రీగంధం తోటకు ముందు ఉండే గుంతనీటిలో ఏనుగుల గుంపొకటి నీళ్లు తాగుతున్నాయి. ఫోటోలక్కూడా తావివ్వకుండా వేగంగా పార్వేట మంటపం మీదుగా ఆ రాత్రికి తిరుమల చేరుకున్నాము.




 రాత్రి తరిగొండ వెంగమాంబ అన్నదానంలో అన్నం తినేసి నేరుగా కుమారధార , పసుపుధార డ్యాం దగ్గరికి పోయి పడుకున్నాము. రాత్రంతా జాగారమే. నీళ్లు తాగటానికి జంతువులేమయినా వస్తాయేమోనని ఆత్రుత. ఒక్కటి రాలేదు.

పొద్దున్నే బయలుదేరి అన్నదమ్ములబండ చేరుకున్నాము. చామలకోన అత్యంత మనోహరంగా , మనోజ్ఞంగా ఉంది. ఇంతటి అద్భుత , అద్వితీయమైన మనోజ్ఞమైన సౌందర్య దృశ్యం ఇంత దగ్గర్లో ఉండటం చూసి ఆశ్చర్యపోయినాను. సన్నటి జలపాతపు సొగసులు చూస్తూ , చుట్టూ కలియ తిరిగినాను. ఇంకొంచెం ముందుకుపోయి కరక్కాయలు ఏరుకుంటూ , మోగచెట్ల సౌందర్యాన్ని చూస్తూ ఆలోయల్లోకి చూపులు సారిస్తే మాటల కందని పారవశ్యమే ఆవరించింది. చిరుతలు , ఏనుగులు , ఎలుగుబంట్లు , జింకలు , దుప్పులు , కణుతులు , రేచుకుక్కలు , కొండచిలువలు , పునుగు పిల్లులు , దేవాంగ పిల్లులు మొదలైన జంతువులకు నిలయమైన మా శేషాచలపు అడవుల్లో ఎర్రచందనం సుప్రసిద్ధం. కొన్ని రకాల ఫెర్న్ (Fern) మొక్కలయితే సృష్టి మొదలునుండి వున్నాయట. పీరీత , గిల్లితీగ ప్రత్యేకం.

ఇక్కడి పరిస్థితులకు తట్టుకోలేని వేపచెట్ల ఊసేలేదు. కార్చిచ్చు కాలంలో మాడి మసై పోయినా తిరిగి ప్రాణం పోసుకునే నల్లమద్ది , తెల్లకరక , తాంబూజ , మోగి జాతి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. శేషాచలపు జీవ వైవిధ్యం ప్రత్యేకమయింది. పచ్చని ప్రకృతి రమణీయత , మనసును దోచే రమ్యమైన జలపాతాలు , సెలయేళ్లు , కనువిందు చేసే లోయ దృశ్యాలు , ఎత్తు పల్లాల కొండలు , గుట్టలు , పక్షుల కిలకిలారావాలు , జంతువుల కేరింతలు , అదొక అద్భుత ప్రపంచం.




 బంగారుబల్లి , నక్షత్ర తాబేళ్లకూ మా శేషాచలం ప్రసిద్ధి. అక్కడ నుండి జొన్నరాతి కుప్ప , తువ్వేలు గుండు దగ్గరికి వచ్చినాము. దీన్నే Y junction అంటారు. మూడురాళ్ల కురవ అని కూడ పిలుస్తారు. ఎడమవేపున పోయి తలకోన శిఖర భాగాన వుండే తలకొన నీటిబుగ్గను చూసి చాలా ఆనందించినాము. 




 కృష్ణా , గోదావరి , కావేరి , తుంగభద్ర నదులు పుట్టిన చోటుచూసిన వాణ్ణి ఇంత దగ్గర్లో ఉండే ఈ బుగ్గను చూడటం ఇదే తొలిసారి. వెనుతిరిగి వస్తూంటే తుమ్మల బైలుకు ఇట్లా పోవచ్చునని ఏడుకొండలన్నాడు. వద్దులెమ్మని నేరుగా రుద్రగళంకు దారితీసినాము.

తలకోన శిఖర భాగం నుండే తరిగొండ వెంగమాంబ ఈదారి గుండా యుద్ధగళం తేరింది. ఆ వైనాన్ని గుర్తుచేసుకుంటూ యుద్ధగళం చేరుకున్నాము. ఇక్కడే వెంగమాంబ 300 ఏళ్ల క్రితం చాన్నాళ్లు ఉండింది. ఆమె గీచిన ఆంజనేయుని బొమ్మ మరకమరకగా ఉంది. పక్కనే సన్నటి జలపాతం. దానికి ముందుగా పెద్ద పెద్ద జామాయిరామానులు చూడచక్కగా ఉన్నాయి. బ్రిటీషోడి శిబిరము ఉంది.




 అక్కడ నుండి అరకిలోమీటరు దూరంలో నారపుబండల మీద ప్రాచీన మనిషి గీసిన రేఖాచిత్రాలున్నాయి. వీటిల్లో కోడెలు , గుర్రాలు , గిత్తలు , పక్షులు , రాక్షసబల్లులు , ఏనుగుల బొమ్మలున్నాయి. సింధు, హరప్పా నాగరికతల నాటి బొమ్మలను గుర్తుచేసినాయి. ఇట్టాంటి చిత్రగీతలు తాంత్రికలోయ, గంగులోడి కోనలోనూ చూసినాను. అక్కడనుండి అద్భుతమైన ప్రకృతి సౌందర్యాల మధ్యన మూడేళ్ల కురవ , కంగు మడుగు , సిద్ధలేరు , ఆరిమానుబండలు చూసుకుంటూ రాత్రి ఏ పదింటికో బాలపల్లి చేరుకున్నాము. ఎంతో అద్భుతమైనదీ ప్రయాణం.

 



 ఎన్నెన్ని కొత్తపేర్లు విన్నాను. బూచోళ్లపేట , గొల్లోల్ల చ్చ , పోలిగాడిసెల , అల్లిదొన , రాజులచలమ , జడల పొనుగు , ధర్భదొన , దండాపేట , చెంచువారిపేట , గాడిదదొన , వెయ్యి పుట్లచేను. , అత్తాలమేరు , దొంగలబండ , ఎద్దలమడుగు , గుంజన , మాదిమానుమండ , ఎర్రెడ్లమడుగు , బండిరుసులు , డబ్బారేకులకోన , పందికుంట ఇట్టాంటి పేర్లెన్నింటినో మణి , ఏడుకొండలు చెపుతూంటే ఆశ్చర్యపడినాను. ఇన్ని పేర్లు కలిగిన ఈ శేషాచలం అంతకుముందెన్నడో జనావాసమై ఉంటుంది కదా ! వారేమైనారు , ఎక్కడికి పోయినారు. ఎట్టా బతుకుతున్నారు , అడవే జీవనాధారంగా ఉన్న ఆ జనం బయట బతికిబట్ట కలుగుతున్నారా అనే ప్రశ్నతో తలంతా బరువెక్కి పోతున్నది.

ఇంతా తిరిగితే మనం తిరిగింది చిటికెన వేలంత కూడ లేదుసార్ , ఈ అడవి లోతుపాతులు అపారమైనటువంటివని గిరిజన మిత్రులు చెబుతుంటే ముందు ముందు వాటి అంతుచూడాలని సంకల్పం చెప్పుకుని రాత్రి ఏ ఒంటిగంటకో ఇల్లు చేరుకున్నాను. ఇదొక కొత్త అద్భుత ప్రయాణం.


Tags:    

Similar News