గుళ్ళు గోపురాల చుట్టూ శవాలు ప్రదక్షిణ చేస్తున్నాయి
ఎన్నిసార్లుఇలా తిరిగితే పుణ్య లోకాలు లభిస్తాయి
కనిపించని దైవాన్ని
మనసారా స్మరిస్తున్నాయి
రాయిగా కొలువైన వేల్పుల సాక్షిగా న్యాయం కావాలంటూ
నదిలో పుష్కర స్నానాలు చేస్తున్నాయి అస్తిపంజరాలతో నడిచి వచ్చి
నగ్నంగా స్వామిని వేడుకుంటున్నాయి
అమ్మాయిల దేహాలే నైవేద్యంగా ప్రణమిల్లుతున్నాయి.
మానవ మృగాలవేటలో
మానప్రాణాలను కోల్పోయి న్యాయం కోసం అర్రులు చేస్తున్నాయి
నదీ తీరాలు. కన్నీళ్ల మౌనభాష్యాలు రచిస్తున్నాయి.
మట్టిపొరల్ని చీల్చుకు వచ్చిన ఎముకల
హాహాకారాల ఘోషలు చీకట్లో కలిసి
మండే తారకలై రగిలిపోతున్నాయి
చీకటి వ్యాపారానికి అవురేక్ మాల్ వస్తువులై
నిండు జీవితాల్ని నీలకంఠుడి సాక్షిగా వదిలి
గుండెలను చీల్చుకొచ్చి
రక్తాశ్రువుల బావుటాలను గుడిగోపురాలపై
ఎగురేయాలంటూ నినదిస్తున్నాయి
యిప్పుడు కావలసింది త్రిపర్ణ పతాకాలు కాదు
చూపించాల్సింది దేశభక్తి కాదు..
మగువల ఆర్తనాదాలతో లిఖించిన
ధిక్కార జెండాల జ్వాలలు
దేశమంతా రగిలించే చైతన్యపు దీపికలవ్వాలి
యిసుమంత న్యాయం విరబూసిన చాలు
కన్నీటి కథలకు కాసింత ఓదార్పు..
(ధర్మస్థల అకృత్యాలకు నిరసనగా...)
-ఆకెపోగు నాగరాజు