సుంకాలు 50 నుంచి 15 శాతానికి తగ్గబోతున్నాయా?

అమెరికాతో చర్చలు తుది దశకు చేరుకున్నాయంటున్న అధికారులు

Update: 2025-10-22 11:31 GMT
ప్రధాని నరేంద్రమోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్

అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోలేదన్న కడుపు మంటతో ఉన్న ట్రంప్ భారతీయ వస్తువులపై 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. తరువాత రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయవద్దని చెప్పినప్పటికీ వాటిని న్యూఢిల్లీ బేఖాతరు చేసి దిగుమతి చేసుకుంటున్నందుకు గాను మరో 25 శాతం సుంకాలు విధించారు.

ఇలా మొత్తంగా భారతీయ వస్తువులపై అమెరికా విధించిన సుంకాలు 50 శాతానికి చేరాయి. ఇది ప్రపంచంలోనే అత్యధిక మొత్తం సుంకాలు. అయితే ప్రస్తుతం అందుతున్న నివేదిక ప్రకారం.. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కనుక ఖరారు అయితే భారతీయ వస్తువులపై టారిఫ్ లు 15 నుంచి 16 శాతానికి తగ్గుతాయని జాతీయ మీడియా కథనం ప్రసారం చేసింది.

అమెరికా- భారత్ మధ్య జరుగుతున్న ఒప్పందం తుది దశకు చేరుకుందని, ఇందులో ప్రధానంగా ఇంధనం, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించారని సమాచారం.

ఇంధనం.. వ్యవసాయం..
అమెరికాతో జరుగుతున్న చర్చలలో ప్రధానంగా ఇంధనం, వ్యవసాయ రంగాలే ఉన్నాయి. ఇందులో రష్యా నుంచి వస్తున్న ముడి చమురును క్రమంగా తగ్గించడం, ఆ మేరకు అమెరికా నుంచి కోనుగోలు చేయడం ఉన్నాయి.
ప్రస్తుతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు వాటా దేశీయ దిగుమతులలో 34 శాతంగా ఉంది. ఈ నెల చివరలలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ముందే ఈ ఒప్పందాన్ని ముగించాలని ఇరుపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పేరు తెలపడానికి ఇష్టపడని ఓ సీనియర్ అధికారులను ఉటంకిస్తూ మింట్ కథనం ప్రచురించింది. వ్యవసాయం, ఇంధన రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి నిబంధనలు ఉండబోతున్నాయి.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్..
ఈ ఒప్పందంలో భాగంగా జన్యుపరంగా మార్పు చేసిన మొక్కజొన్న, సోయామీల్ తో సహ కొన్ని ఉత్పత్తులకు భారత్ తన మార్కెట్ తలుపులు తెరుస్తుందని ఆ వర్గాలు మింట్ కు తెలిపాయి.
భారత్ లోని వ్యవసాయదారుల ప్రయోజనాలను కాపాడటానికి, అమెరికా ఎదుర్కొంటున్న ఆందోళనలను పరిష్కరించడానికి ఈ ఒప్పందం సహాయపడుతుంది. అదే సమయంలో పౌల్ట్రీ, ఇథనాల్ రంగాలలో భారత్ లో పెరుగుతున్న దేశీయ డిమాండ్ ద్వారా మార్కెట్ పెరిగే అవకాశం కనిపిస్తుంది.
ఇంతకాలం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు చైనా అతిపెద్ద మార్కెట్. కానీ రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ మొదలయ్యాక బీజింగ్, వాషింగ్టన్ నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులను నిలిపివేసింది. దీనితో అమెరికా కొత్త మార్కెట్ల కోసం ఎదురు చూస్తోంది.
తక్కువ సుంకాలు..
రెండు దేశాల మధ్య వాణిజ్య స్థిరీకరణ జరిగిన తరువాత సుంకాలు, మార్కెట్ యాక్సిస్ లకు సంబంధించిన సమీక్ష ఉండవచ్చని పేర్కొంది. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన సుంకాల స్థాయిని 50 శాతం నుంచి 15- 16 శాతానికి తగ్గిస్తుందని భావిస్తున్నారు. సుంకాలు తగ్గితే భారతీయ ఎగుమతులలో ముఖ్యంగా వస్త్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు, ఔషధాలు అమెరికా మార్కెట్లలో ఇతర వస్తువులతో పోటీ పడగలవు.
ట్రంప్- మోదీ ఫోన్ సంభాషణ
ఈ వారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఆ తరువాత చర్చలలో పురోగతి కనిపించింది. ఈ సంభాషణ ఎక్కువగా వాణిజ్యం, ఇంధన సహకారంపై దృష్టి సారించినట్లు ట్రంప్ విలేకరులతో అన్నారు.
‘‘మా చర్చలలో ఇంధనం కూడా ఒక భాగం. భారత్, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పరిమితం చేస్తుందని ప్రధాని మోదీ నాకు హమీ ఇచ్చారు’’ అని ట్రంప్ అన్నారు.
ట్రంప్, మోదీకి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ సంభాషణను ధృవీకరించారు. ‘‘అధ్యక్షుడు ట్రంప్ మీ ఫోన్ కాల్, దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. ఈ దీపాల పండగ నాడు రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ఆశతో ప్రకాశింపజేయడం కొనసాగించాలి, అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి’’ అని మోదీ రాసుకొచ్చారు.


Tags:    

Similar News