’’ఇండోనేషియాతో కుదిరింది.. ఇండియా దారిలో ఉంది’’
జకార్తాతో వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రకటించిన ట్రంప్..;
By : Praveen Chepyala
Update: 2025-07-16 06:58 GMT
ఇండోనేషియా- అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం ఇక నుంచి ఇండోనేషియా నుంచి వచ్చే వస్తువులపై అమెరికా 19 శాతం సుంకాలు విధిస్తుంది అయితే ఇదే సమయంలో అమెరికా వస్తువులపై ఇండోనేషియా ఎలాంటి పన్ను విధించడం లేదు. భారత్ తోనూ ఇలాంటి తరహ ఒప్పందమే అమల్లోకి రాబోతోందని ఆయన చెప్పారు.
అమెరికా- ఇండోనేషియా ఒప్పందం
‘‘మేము ఇండోనేషియాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాము. నేను వారి గొప్ప అధ్యక్షుడితో మాట్లాడాను. మాకు ఇండోనేషియాకు సారూప్యం ఉంది. మీకు తెలిసినట్లుగా ఇండోనేషియా బలంగా ఉంది. మేము ఎటువంటి సుంకాలు చెల్లించము. మాకు ఇండోనేషియాలో ప్రవేశం కల్పిస్తున్నారు. ఇది ఒప్పందంలో పెద్ద భాగం’’ అని ట్రంప్ అన్నారు.
అమెరికా తీస్తున్న ముడి చమురులో 15 బిలియన్ డాలర్ల మేర, అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులలో 4.5 బిలియన్లు, 50 బోయింగ్ జెట్ల ను కొనుగోలు చేయడానికి హమీ ఇచ్చిందని, వాటిలో చాలా వరకూ 777 విమానాలు ఉన్నాయని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్రూత్ లో పోస్ట్ చేశారు.
మొదటిసారిగా అమెరికా పశువుల పెంపకందారులు రైతులు, మత్స్యకారులు ఇండోనేషియా మార్కెట్ లోకి సంపూర్ణంగా ప్రవేశించబోతున్నారని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ ఒప్పందం గురించి ఇండోనేషియా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
భారత్ పై ట్రంప్..
అమెరికా- ఇండోనేషియా ఒప్పందం గురించి ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. వాణిజ్య ఒప్పందం కోసం కొనసాగుతున్న న్యూఢిల్లీ - వాషింగ్టన్ చర్చల గురించి వారికి సమాచారం ఇచ్చారు. భారత్ కూడా ఇదే మార్గంలో ప్రయాణించడానికి సిద్దంగా ఉందన్నారు.
‘‘మన దేశపు వస్తువులకు భారత్ లో ప్రవేశం ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. ఈ దేశాలలో దేనికీ మాకు ప్రవేశం లేదు. మన ప్రజలు లోపలికి వెళ్లలేకపోయారు. ఇప్పుడు మనం సుంకాలతో చేస్తున్న కారణంగా మనకు ప్రవేశం లభిస్తోంది’’ అని ట్రంప్ విలేకరులతో అన్నారు.
భారత మార్కెట్లోకి ప్రవేశం కల్పించే దిశగా అమెరికా గణనీయమైన పురోగతి సాధించిందని యూఎస్ అధ్యక్షుడు అన్నారు.
భారత్ నుంచి సమాచారం లేదు..
ట్రంప్ నిర్ణయించిన దాని ప్రకారం జూలై 9 లోపు ఆదేశంతో ఒప్పందం కుదుర్చుకోవాలి. కానీ ఇప్పటి వరకూ మన దేశం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం అయినందున తన డిమాండ్లను వదులుకోవడానికి నిరాకరించిందని, 80 మిలియన్లకు పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న భారత పాడి పరిశ్రమకు నష్టం కలిగించే విధంగా అమెరికా ప్రవేశాన్ని అంగీకరించడం లేదని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి.
రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం ఖరారు చేయడానికి భారత వాణిజ్య ప్రతినిధి బృందం ప్రస్తుతం వాషింగ్టన్ లో ఉంది. సుంకాలపై అమెరికాతో ఇప్పటికే చర్చలు జరుపుతున్న కొన్ని దేశాలలో భారత్ ఒకటి. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు వేగంగా జరుగుతున్నాయని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
‘‘చర్చలు చాలా వేగంగా పరస్పర సహకారంతో జరుగుతున్నాయి. తద్వారా మనం అమెరికాతో గెలుపు వాణిజ్య అనుబంధ ఒప్పందాన్ని కుదుర్చుకోగలము’’ అని గోయల్ అన్నారు. ఈ ఏడాది ఆగష్టు 1 వరకు సుంకాలను నిర్ణయించాలని అధ్యక్షుడు ట్రంప్ కొత్త గడువు విధించారు. ఆయన ఇప్పటికే 20 కి పైగా దేశాలకు టారిఫ్ లేఖలను పంపారు.
100 శాతం సుంకాల ముప్పు
తాజా ట్రంప్ రష్యాపై కొత్త ఆంక్షలు విధించబోతున్నట్లు ప్రకటించారు. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై వందశాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై కూడా భారీ స్థాయిలో చర్యలు ఉంటాయని హింట్ ఇచ్చారు.
ఈ ఆంక్షల కోసం అమెరికా సెనెట్ లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో చమురు కొనుగోలు చేస్తోంది. భారత్, చైనా, బ్రెజిల్ రష్యాతో వాణిజ్యం చేస్తే 100 శాతం సుంకాలు విధిస్తామని నాటో హెచ్చరించింది.