ప్యాకేజీ కోసం విమానయాన సంస్థను అమ్మబోతున్న పాక్
ఐఎంఎఫ్ షరతుల ప్రకారం అమ్మకం, కొనబోతున్న పాకిస్తాన్ సైన్యం ఆధీనంలోని ఫౌజీ ఫౌండేషన్
By : Praveen Chepyala
Update: 2025-12-04 08:09 GMT
అప్పుల ఊబిలో చిక్కుకుని దినదిన గండంగా బతుకుతున్నపాకిస్తాన్, రుణ ఊబి నుంచి తప్పించుకునేందుకు ‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్’(పీఐఏ) ను వేలం వేయనున్నట్లు ప్రకటించింది.
సుమార్ ఏడు బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీకి అర్హత పొందడానికి ఐఎంఎఫ్ విధించిన షరతులకు తలొగ్గడానికి ప్రభుత్వం దీనిని చివర దశగా ప్రభుత్వం ప్రకటించింది.
బిడ్డింగ్ ప్రక్రియకు ముందస్తు అర్హత సాధించిన నాలుగు కంపెనీలలో పాకిస్తాన్ సైన్యం లో భాగంగా ఉన్న ఫౌజీ ఫౌండేషన్, ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా భాగంగా ఉంది. మిగిలిన మూడు కంపెనీలు ఎయిర్ బ్లూ లిమిటెడ్, లక్కీ సిమెంట్ కన్సార్టియం, ఆరిఫ్ హబీబ్ కార్పొరేషన్ కన్సార్టియం కూడా ఉన్నాయి. రెండు దశాబ్ధాల తరువాత పాకిస్తాన్ లో తొలిసారిగా ప్రయివేటీకరణ ప్రయత్నం జరుగుతోంది.
పీఐఏ షేర్లలో 51 నుంచి 100 శాతం అమ్మకం..
ఐఎంఎఫ్ ఎక్స్ టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ(ఈఎఫ్ఎఫ్) కింద అధికారిక నిర్మాణాత్మక బెంచ్ మార్క్ 51 నుంచి 100 శాతం పీఐఏ షేర్ల ను అమ్మకం, విమానయాన సంస్థల పూర్తి నిర్వహణ అధికారికంగా బదిలీ అవుతుంది.
పాకిస్తాన్ కు తదుపరి బెయిల్ అవుట్ ప్యాకేజీ అయిన 1.2 బిలియన్లు విడుదల అవ్వాలంటే.. ఈ నెల ఎనిమిదిని ఐఎంఎఫ్ కార్యనిర్వాహక బోర్డు సమావేశం ఆమోదం తెలపాలి.
ఈ సంవత్సరం చివరిలోపు పీఐఏ బిడ్డింగ్ ప్రక్రియను పూర్తి చేసి భవిష్యత్ లో రుణం చెల్లింపుకోసం నమ్మకం కలిగించాలి. అందుకే ప్రభుత్వం తన ఖర్చును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ఈ ఏడాది ప్రయివేటీకరణ ద్వారా ప్రభుత్వం 86 బిలియన్ డాలర్లను ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుందని పాక్ మంత్రి మహమ్మాద్ అలీ గతంలో ఒకసారి చెప్పారు. పీఐఏ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో 15 శాతం ప్రభుత్వానికి, మిగిలిన 85 శాతం కంపెనీకి వెళ్తుంది.
అసిమ్ మునీర్, ఫౌజీ ఫౌండేషన్..
ఫౌజీ ఫౌండేషన్ పాకిస్తాన్ లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటి. దాదాపు ప్రతిరంగంలోనూ సైన్యం వాటా ఉంది. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఫౌజీ ఫౌండేషన్ కు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లేరు, కానీ ఆయా బోర్డులోఉన్న క్వార్టర్ మాస్టర్ జనరల్ ను నియమిస్తారు.
ఫౌజీ ఫౌండేషన్ లోని కీలక పదవులకు నియమకాలు, భద్రత సంక్షేమ ప్రాధాన్యతలపై మునీర్ పరోక్ష ప్రభావాలను చూపుతాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. విదేశీ సంస్థలు నియంత్రణ వాటాలను పొందేందుకు అనుమతి లేదు. మెజారిటీ యాజమాన్యం పాకిస్తాన్ పౌరులతోనే ఉండాలి.
పాకిస్తాన్ కు పీఐఏ కీలకం..
అనేక సంవత్సరాల నుంచి పాకిస్తాన్ తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2023 లో పాకిస్తాన్ తన రుణాలను తిరిగి చెల్లించలేని స్థితిలో ఉంది. దాని సైనిక వ్యయం భరించలేని స్థితికి చేరింది.
ఐఎంఎఫ్ సెప్టెంబర్ 2024 లో పాకిస్తాన్ కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని ఆమోదించింది. అది వెంటనే ఒక బిలియన్ డాలర్లను అందించింది. మిగిలిన ప్యాకేజీని మూడు సంవత్సరాల వ్యవధిలో ఇవ్వాలి.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ 1958 నుంచి ఇప్పటి వరకూ ఐఎంఎఫ్ దగ్గర నుంచి 20 సార్లకు రుణాలు తీసుకుంది. తద్వారా రుణదాలలో ఐదో అతిపెద్ద రుణ గ్రహీతగా చెత్త రికార్డు నమోదు చేసింది. రుణాలను తిరిగి చెల్లించడానికి రుణాలు తీసుకుంటున్నందున పీఐఏ విక్రయం దేశానికి చాలా కీలకం.
నిర్వహణ లోపం..
పాక్ జాతీయ విమానయాన సంస్థ చాలాకాలంగా అనేక నిర్వహణ సమస్యలను ఎదుర్కొంటోంది. అనేక బిలియన్ల కొద్ది నష్టాలను పీఐఏ ఎదుర్కోవడానికి ప్రధాన కారణం దానిమీద విదేశాలు క్రెడిబిలిటీ కోల్పోవడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేేదు. అక్టోబర్ 2024 లో సాంకేతిక సమస్యల కారణంగా దానికి సంబంధించిన 17 విమానాలు రద్దు చేశారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం 16 విమానాలు మాత్రమే నడిపించారు.
2020 లో పాక్ కు చెందిన పైలట్లలో దాదాపు 30 శాతం నకిలీలని ఓ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక బయటకు రాగానే 262 మంది పైలట్లను విధుల నుంచి తొలగించారు. దీనితో పాక్ ఎయిర్ లైన్ల సర్వీస్ లో భారీ అంతరాయం ఏర్పడింది.
యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ(ఈఏఎస్ఏ) జూన్ 2020 లో యూరప్ వచ్చే పాక్ విమానాలపై నిషేధం విధించింది. దీనితో పాక్ ఆదాయంలో భారీగా గండిపడింది.
యూఎస్, యూకే కూడా నిషేధం విధించడంతో సమస్య భారీగా పెరిగింది. భద్రతా వైఫల్యాలు, అత్యధిక సిబ్బంది, రాజకీయ నియామకాలు, బంధు ప్రీతి, భారీగా జీతాల పెంపు వంటి వాటి కారణంగా ఎయిర్ లైన్స్ తీవ్ర నష్టాల్లో చిక్కుకుంది.