పాక్, తాలిబన్ల మధ్య కుదరని ఏకాభిప్రాయం
మూడోసారి విఫలమైన చర్చలు, పరస్పరం తీవ్ర హెచ్చరికలు చేసుకున్న ఇరు దేశాల ప్రతినిధులు
By : Praveen Chepyala
Update: 2025-11-09 11:46 GMT
పొరుగు దేశాలైన పాకిస్తాన్- ఆప్ఘనిస్తాన్ మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న శాంతి చర్చలు విఫలం అయ్యాయి. పాకిస్తాన్ తెహ్రీకే తాలిబన్(టీటీపీ) ఉగ్రవాదులు, పాక్ సైన్యం లక్ష్యంగా దాడులు చేస్తున్నారని రావల్పిండి చాలాకాలంగా ఆరోపిస్తోంది.
ఈ అంశంపై రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఆ తరువాత రెండు దేశాలు ఖతార్ వేదికగా శాంతిచర్చలు జరుపుతున్నాయి. తాజాగా జరిగిన మూడో రౌండ్ చర్చలు విఫలం అయ్యాయి.
ఆ తరువాత రెండు దేశాల ప్రతినిధుల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. సరిహద్దు దాటితే తీవ్ర స్థాయిలో దాడులు ఉంటాయని ఇరుపక్షాలు హెచ్చరికలు జారీ చేసుకున్నాయి.
మూడో రౌండ్ చర్చలు గురువారం ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల పాటు ఈ చర్చలు కొనసాగాయి. ఆప్ఘన్ నేలను పాక్ పై దాడి చేయడానికి ఉపయోగించకూడదని పాక్ డిమాండ్ చేసింది. టీటీపీ ఉగ్రవాదులపై చర్య తీసుకోవడానికి కాబూల్ నుంచి రాతపూర్వక హమీని తీసుకోవడంలో పాక్ వేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
పాక్ హెచ్చరిక.. తాలిబన్ ప్రతిస్పందన..
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. శాంతి చర్చలు తీవ్ర ప్రతిష్టంభనను ఎదుర్కొంటున్నాయని, ఆఫ్ఘన్ ఇలాగే రెచ్చగొడితే తమ దేశం బలమైన ప్రతిస్పందన తెలియజేస్తుందని హెచ్చరించారు.
ఈ వార్నింగ్ పై ఆప్ఘన్ గిరిజన వ్యవహరాల మంత్రి నూరుల్లా నూరి స్పందించారు. ‘‘మీ దేశం సాంకేతికతపై అతిగా నమ్మకం పెట్టుకోవద్దు, యుద్దం చెలరేగితే ఆప్ఘనిస్తాన్ పెద్దలు, యువకులు ఇద్దరు పోరాటానికి దిగుతారు’’ అని నూరీ హెచ్చరించారు.
పూర్తిగా ప్రతిష్టంభన..
రెండు దేశాల మధ్య జరిగిన చర్చలు పూర్తిగా నిరవధిక దశలోకి ప్రవేశించాయని ఖవాజా ఆసిఫ్ అన్నారు. రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలను మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించిన తుర్కియే, ఖతార్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
‘‘మా వైఖరికి మద్దతు ఇచ్చారు. ఆఫ్ఘన్ ప్రతినిధి బృందం కూడా మాతో ఏకీభవించాయి. అయితే రాతపూర్వకంగా ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్దంగా లేరు’’ అని ఆసిఫ్ అన్నారు.
పాకిస్తాన్ కేవలం అధికారిక వ్రాతపూర్వక ఒప్పందాన్ని మాత్రమే అంగీకరిస్తుందని అన్నారు. కేవలం మౌఖిక హమీలను అంగీకరించాలని కోరుకుంటున్నారని, కానీ అంతర్జాతీయ స్థాయిలో ఇవి సాధ్యంకాదన్నారు. మధ్యవర్తులు ఎంతో ప్రయత్నాలు చేసినప్పటికీ చివరకు ఏవి నేరవేరలేదన్నారు.
‘‘వారికి(తాలిబన్ బృందం) ఆశావాదం ఉంటే మేము ఖాళీ చేతులో తిరిగి వచ్చే వాళ్లము కాదు. వారు కూడా కాబూల్ పై ఆశను వదులుకున్నారని చూపిస్తుంది’’ అని ఆయన అన్నారు.
‘‘మా ఏకైక డిమాండ్ ఏమిటంటే, ఆఫ్ఘనిస్తాన్ తన మట్టిని పాక్ పై దాడులకు ఉపయోగించకుండా చూసుకోవాలి’’ అని ఆసిఫ్ అన్నారు. పాక్ పై ఎలాంటి దురాక్రమణ లేకుంటే కాల్పుల విరమణ ఒప్పందం చెక్కుచెదరకుండా ఉంటుందని ఆయన అన్నారు.
‘‘ఉగ్రవాద నియంత్రణకు సంబంధించి దీర్ఘకాలిక అంతర్జాతీయ, ప్రాంతీయ, ద్వైపాక్షిక హమీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఆఫ్ఘన్ తాలిబన్లపై ఉందని, అయితే ఇప్పటి వరకూ ఆ హమీల్లో విఫలమయ్యారు’’ అని సమాచార మంత్రి అత్ తుల్లా తరార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఆఫ్ఘన్ ప్రజలపై పాకిస్తాన్ కు ఎలాంటి ద్వేషం లేదు. అయితే ఆప్ఘన్ ప్రజలతో పాటు పొరుగు దేశాల ప్రయోజనాలకు హాని కలిగించే ఆప్ఘన్ తాలిబన్ పాలన చర్యలకు ఇస్లామాబాద్ మద్దతు ఇవ్వదని అన్నారు. పాకిస్తాన్ తన పౌరులు, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే ఉంటుందని మంత్రి అన్నారు.
తాలిబన్ల విమర్శలు..
పాక్ ఏదైనా దుస్సాహాసానికి పాల్పడితే ఆప్ఘన్ కూడా చాలాబలంగా ఎదురుదాడికి దిగుతుందని ఆ దేశ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ విలేకరులతో అన్నారు. టీటీపీ, పాకిస్తాన్ మధ్య వివాదం ఇటీవలది కాదు.
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తరువాత అది ప్రారంభం కాలేదు. 2002 నుంచి ఈ సమస్య ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్ సైన్యంలోని కొన్ని వర్గాలు ఆప్ఘనిస్తాన్ లో సార్వభౌమ అధికారాన్ని కోరుకోవడం లేదని ముజాహిద్ ఆరోపించారు.