పాక్ ప్రధాని ముందే మోదీ పై ట్రంప్ పొగడ్తల వర్షం
ఇక ముందు కలిసే ఉంటారని షరీఫ్ ను చూస్తూ వ్యాఖ్యానించిన ట్రంప్ సందేహస్పదంగా తల ఊపిన షరీఫ్, ట్రంప్ హుంకారంతో సరిగా తలాడించిన పాక్ ప్రధాని
By : Praveen Chepyala
Update: 2025-10-14 05:02 GMT
అమెరికా అధ్యక్షుడు పాక్ ప్రధానికి షాక్ ఇచ్చారు. గాజా- ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు ఒప్పందాల సందర్భంగా ఈజిప్ట్ చేరుకున్న ట్రంప్.. షాబాజ్ షరీఫ్ ముందే భారత ప్రధాని నరేంద్ర మోదీని, భారత్ ను పొగడ్తలతో ముంచెత్తారు. భారత ప్రధాని తనకు అత్యంత ఆప్తుడని చెప్పారు.
ఇక నుంచి భారత్- పాకిస్తాన్ అత్యంత మిత్రత్వంగా మెలుగుతాయని అన్నారు. షాబాజ్ షరీఫ్ ను ఉద్దేశిస్తూ మాట్లాడిన ట్రంప్.. ‘‘ఇక ముందు కలిసి ఉంటారా అని ప్రశ్నించాడు’’ దీనికి షరీఫ్ సందేహాస్పదంగా తల ఊపగా.. ఏం కలిసి ఉండరా అంటూ ట్రంప్ హూంకరిచండంతో తలను ఈసారి సరిగా ఊపడం పాక్ ప్రధాని వంతయింది.
భారత్ గొప్పదేశం.. మోదీ మంచి స్నేహితుడు
‘‘భారత్ చాలా గొప్పదేశం, నాకు మంచి స్నేహితుడు అగ్రస్థానంలో ఉన్నాడు’’ అతను అద్భుతమైన పనిచేశాడని పరోక్షంగా మోదీ ప్రస్తావించకుండా పొగడ్తలతో ముంచెత్తాడు. ‘‘పాకిస్తాన్, భారత్ కలిసి జీవిస్తాయని అనుకుంటున్నాను’’ అని ట్రంప్ తన వెనక నిలబడి ఉన్న పాక్ ప్రధానిని చూస్తూ అన్నారు.
అంతకుముందు ట్రంప్ షరీఫ్, ఫీ(ఫె)ల్డ్ మార్షల్ అయిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ప్రశంసించారు. పాక్ ప్రధానిని కూడా సభలో ప్రసంగించమని ఆహ్వానించారు.
ట్రంప్ చేసిన కృషి కారణంగానే పశ్చిమాసియాలో శాంతి నెలకొందని షరీఫ్ కూడా ప్రశంసలు కురిపించాడు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ఎంతో కృషి చేశాడని కొనియాడారు.
తాము ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు చెప్పారు. ఇప్పుడు మరోసారి కూడా ట్రంప్ ను నోబెల్ బహుమతికి నామినేట్ చేస్తామని ప్రకటించారు.
ట్రంప్ కు నోబెల్ బహుమతి రాలేదు. అయితే తాను నోబెల్ బహుమతి కోసం ఎనిమిది యుద్దాలు ఆపలేదని చెప్పుకొచ్చారు. ట్రంప్ ఇప్పటి వరకూ ఏడు వివాదాలు పరిష్కరించానని, గాజా- ఇజ్రాయెల్ యుద్ధ విరమణతో ఆ సంఖ్య ఎనిమిది చేరినట్లు క్రెడిట్ ఇచ్చుకున్నారు.
పహల్గాం ఉగ్రవాద దాడి..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. టూరిస్టులలో కేవలం హిందువులను మాత్రమే గుర్తించి, వారిలో పురుషులను వారి భార్యల ముందే ఇస్లామిక్ జిహాదీ మూకలు కాల్చి చంపాయి. వారి భార్యలను వెళ్లి మోదీకి చెప్పుకోండని కూడా వెకిలి నవ్వులు నవ్వారు.
దీనికి ప్రతీకారంగా భారత్ మే 7 న ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. పాక్ లోని 9 ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు చేసి వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది. తరువాత పాక్ కూడా ప్రతీకార దాడులకు దిగడానికి విఫలయత్నం చేసింది. కానీ భారత్ దీనికి కూడా ఎదురుదాడికి దిగి పాక్ కు చెందిన డజన్ కు పైగా యుద్ధ విమానాలు, 11 ఎయిర్ బేస్ లు, ఓ యుద్ధ విమానాల హ్యంగర్ ను ధ్వంసం చేసింది. చివరకు మే 11న భారత్ కు, పాక్ డీజీఎంఓ ఫోన్ చేసి దాడులు ఆపండని ప్రాదేయపడటంతో భారత్ ఆపరేషన్ సిందూర్ కు ‘పాజ్’(విరామం) ఇస్తున్నట్లు ప్రకటించింది.