భారత్ ను పూర్తిగా విశ్వసించము: పాకిస్తాన్

తాలిబన్లను న్యూఢిల్లీ ప్రొత్సహిస్తుందని ఆరోపణలు

Update: 2025-11-20 08:05 GMT
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్

భారత్ తో పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశం లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న దృష్ట్యా ఇస్లామాబాద్ పూర్తి అప్రమత్తంగా ఉందని అన్నారు.

పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో భారత్ ను విస్మరించడం, విశ్వసించడం లేదని ‘సమా’ టీవీతో మాట్లాడుతూ అన్నారు. అయితే భారత్ తో పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశం తోసిపుచ్చలేమని కూడా మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

‘‘మేము భారత్ ను విస్మరించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని విశ్వసించడం లేదు. నా విశ్లేషణ ఆధారంగా, సరిహద్దు చొరబాట్లు లేదా దాడులు సహ భారత్ నుంచి పూర్తి స్థాయి యుద్ధం లేదా ఏదైనా శత్రు వ్యూహాన్ని నేను తోసిపుచ్చలేను. మనం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి’’ అని ఆసిఫ్ మంగళవారం అన్నట్లు సమా టీవీ వార్తలు ప్రసారం చేసింది.
ఆర్మీ చీఫ్ హెచ్చరిక..
ఆపరేషన్ సిందూర్ ను భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ‘‘88 గంటల ట్రైలర్’’ గా అభివర్ణించారు. అవసరమైతే పొరుగుదేశానికి బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో గుణపాఠం నేర్పుతామని, మన సాయుధ దళాలు అందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే పాక్ రక్షణ మంత్రి ఈ మాటలు అన్నారు. నవంబర్ పదిన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 15 మంది మరణించారు. దీనివెనక ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ ఉందని, హ్యండ్లర్ గా జైష్ ఏ మహ్మద్ వ్యవహరించిందని భారత దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
రెండు వైపులా యుద్ధం..
పాకిస్తాన్ తూర్పు, పశ్చిమ (ఆఫ్ఘన్, భారత్) సరిహద్దులో రెండు వైపులా యుద్ధానికి సిద్దంగా ఉందని ఆసిఫ్ అన్నారు. ‘‘మొదటి రౌండ్ లో అల్లా మాకు సహాయం చేశాడు. రెండో రౌండ్ లోనూ ఆయన మాకు సహాయం చేస్తాడు. వారు చివరి రౌండ్ కోరుకుంటే, మాకు యుద్దం తప్ప మాకు వేరే మార్గం లేదు’’ అని ఆయన అన్నారు.
ఆప్ఘనిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉండటంతో ఆసిఫ్ తాజాగా హెచ్చరికలు చేశారు. గత నెలలో పాకిస్తాన్, తాలిబన్ల మధ్య భారీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు వైపులా భారీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. అక్టోబర్ 19న ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.
ఆప్ఘన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పాక్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా టీటీపీ కాబూల్ కేంద్రంగా పనిచేస్తోందని, పాక్ సైన్యంపై దాడులకు పాల్పడుతోందని రావల్పిండి ఆరోపణ. దీనితో పాకిస్తాన్ సరిహద్దు దాటి వైమానిక దాడులు ప్రారంభించి సామాన్య పౌరులను హతమార్చింది.
తాలిబన్లు వాదన..
పాకిస్తాన్ చేస్తున్న వాదనలను తాలిబన్లు తోసిపుచ్చారు. ఆప్ఘన్ భూభాగం నుంచి పాక్ పై దాడులు జరగడం లేదని, ఇస్లామిక్ ఎమిరేట్ ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని అన్నారు.
కాల్పుల విరమణ మధ్య భారత్, ఆప్ఘనిస్తాన్ ను ప్రభావితం చేస్తోందని ఆసిఫ్ ఆరోపించాడు. పాకిస్తాన్ రెండు దేశాల నుంచి ఒత్తిడి ఎదుర్కొనవచ్చని హెచ్చరించారు.
ఇస్లామాబాద్, కాబూల్ మధ్య భారత్ విభేదాలను పెంచుతోందని ఆసిఫ్ ఆరోపించారు. జియో న్యూస్ తో మాట్లాడుతూ..తాలిబన్ నిర్ణయాలు ఢిల్లీ స్పాన్సర్ చేయబడుతున్నాయి’’ అని ఆసిఫ్ ఆరోపించారు.


Tags:    

Similar News