‘‘రష్యా- ఉక్రెయిన్ యుద్ధ విరమణపై పరిష్కారం ఉంది’’
భూభాగాల మార్పిడితోనే సీజ్ ఫైర్ ఉంటుందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్;
By : Praveen Chepyala
Update: 2025-08-12 06:18 GMT
రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారా? దానికి పుతిన్ అంగీకరిస్తారా? ఈ కొత్త ప్రతిపాదనపై ఉక్రెయిన్ ఏమంటోంది?
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్దం ముగిసి కాల్పుల విరమణ జరిగితే భారీ స్థాయిలో భూభాగాల మార్పిడి ఉంటుందని, పుతిన్ తో జరిగే సమావేశంలో ఇవి ఫలితాన్ని తీసుకొస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. పుతిన్ తో ఒప్పందం రూపొందించడం సాధ్యమే అని, తాను కొద్ది క్షణాల్లోనే దానిని నిర్ణయిస్తానని చెప్పారు.
‘‘సమావేశం ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే ఒప్పందం కుదుర్చుకోవచ్చో లేదో నాకు కచ్చితంగా తెలుస్తుంది’’ అని ట్రంప్ వైట్ హౌజ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. సమావేశం చివర కూడా ఒక అభిప్రాయానికి వస్తామని కూడా పేర్కొన్నారు.
భావోద్వేగ సమావేశం..
అమెరికాలోని అలాస్కాలో శుక్రవారం పుతిన్, ట్రంప్ సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం భావోద్వేగ సమావేశం అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మంచి అయిన కావచ్చు.. చెడు ఎదురు కావచ్చు.. ఏదైనా కావచ్చని ట్రంప్ అన్నారు. తాను మాత్రం ఒప్పందం కుదురుతుందని అనుకుంటున్నట్లు చెప్పారు.
యూరప్ లో భయం..
అయితే పుతిన్ తో జరిగే సమావేశం, కుదిరే ఒప్పందాల గురించి ఇటు ఉక్రెయిన్ కు, అటూ అమెరికా మిత్రదేశాలైన యూరప్ ట్రంప్ ఎలాంటి కీలక సమాచారం అందించలేదు.
ఒకవేళ అలాస్కాలో జరిగే సమావేశంలో ఒప్పందం కుదిరితే ఏమవుతుందని అవి ఆందోళన చెందుతున్నాయి. 2022, ఫిబ్రవరి 24న రష్యా- ఉక్రెయిన్ పై దండెత్తింది.
ఇప్పటి వరకూ కీలక భూభాగాలను అది చేజిక్కించుకుంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే వీటికి అటూ జెలెన్ స్కీ, ఇటూ పుతిన్ ఇద్దరు అంగీకరించట్లేదు.
జెలెన్ స్కీ పాల్గొంటారా?
ఈ సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు పాల్గొనే అవకాశం లేదని ట్రంప్ తేల్చేశారు. శాంతి ప్రయత్నాల్లో ఆయన భాగస్వామి కావాల్సిన అవసరం లేదన్నారు. జెలెన్ స్కీ చాలా సమావేశాలకు వెళ్లిన యుద్దాన్ని ఆపలేకపోయారని, యుద్దం జరిగినన్నీ రోజులు జెలెన్ స్కీ అధికారంలో ఉన్నారని చెప్పారు. దశాబ్దాలుగా పుతిన్ అధికారంలో ఉన్న విధానంతో జెలెన్ స్కీని పోల్చారు.
ఇద్దరితో సమావేశం..
అలస్కాలో పుతిన్ తో సమావేశం తరువాత రెండో సమావేశంలో జెలెన్ స్కీని కూడా తీసుకువస్తామని ట్రంప్ చెప్పారు. అయితే ఉక్రెయిన్ పై యూరప్ దేశాలు ఇప్పటికే ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాయి. పూర్తి సమాచారం తమకు అందించాలని కోరుతున్నాయి. అమెరికా కాదన్నా చాలా సందర్భాల్లో ఉక్రెయిన్ కు యూరోపియన్ దేశాలే అండగా నిలిచాయి.
ట్రంప్ కుప్పిగంతులు..
ట్రంప్ అధికారం చేపట్టిన ప్రారంభంలో ఉక్రెయిన్ అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించారు. దేశంలో ఎన్నికలు నిర్వహించకుండా యుద్దాన్ని అడ్డుపెట్టుకున్నాడని నియంతగా మారాడని విమర్శలు గుప్పించారు.
ట్రంప్, జేడీ వాన్స్ తో జెలెన్ స్కీ సమావేశం అయిన సందర్భంగా దేశాధినేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీనితో ఓవల్ కార్యాలయం నుంచి కీవ్ అధినేత అర్థాంతరంగా బయటకు వెళ్లారు.
అయితే కాల్పుల విరమణకు పుతిన్ కూడా సిద్దంగా లేకపోవడంతో ఆయనపై కూడా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఉక్రెయిన్ లో ఉన్న ఖనిజ వనరులను తవ్వుకోవడానికి ఒప్పందం కుదిరిన తరువాత జెలెన్ స్కీ పట్ల స్వరం మార్చారు.
పుతిన్ తనతో సమావేశం కావడానికి ఆమోదం తెలపడంతో ఆయన్ను కూడా ప్రశంసించారు. ట్రంప్ నే రష్యాకు రావాలని పట్టుపట్టకుండా బదులుగా తానే అమెరికా రావడం చాలా గౌరవప్రదంగా భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
భాభాగాల మార్పిడిపై సూచన..
‘‘నేను కాల్పుల విరమణను చూడాలనుకుంటున్నాను. రెండు పార్టీలకు ఉత్తమమైన ఒప్పందాన్ని చూడాలనుకుంటున్నాను’’ అని ట్రంప్ అన్నారు. యుద్ధం ముగించాలనుకుంటే భూమార్పిడి ఉండవచ్చని అధ్యక్షుడు అన్నారు. కాల్పుల విరమణకు చర్యలు తీసుకోకపోతే మాస్కో పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ట్రంప్ బెదిరించారు.
కానీ శుక్రవారం సమావేశం విజయవంతమైతే అమెరికా - రష్యా మధ్య వాణిజ్య సంబంధాలను సాధారణీకరించే రోజును తాను చూడగలనని సోమవారం అభిప్రాయపడ్డారు.
పుతిన్, జెలెన్ స్కీ ఇద్దరు భూభాగాల మార్పిడికి ఒప్పుకుంటారా?
తన దళాలు ఆక్రమించుకున్న భూభాగాలన్నింటిని అలాగే ఉంచుకోవాలనే డిమాండ్లలో పుతిన్ ధృఢంగా ఉంటారని, అలాగే ఉక్రెయిన్ తిరిగి నాటోలో చేరకూడదని షరతులు విధిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భూభాగం రష్యా ఆధీనంలో ఉండటానికి తాను ఒప్పుకోనని, కచ్చితంగా నాటోలో చేరతానని జెలెన్ స్కీ వాదిస్తున్నారు.
యూరోపియన్లు, ఉక్రెనియన్లను ట్రంప్- పుతిన్ సమావేశానికి ఆహ్వనించకపోవడంతో జర్మనీ సమావేశం నిర్వహించడానికి ప్రయత్నించింది. బుధవారం ట్రంప్, జెలెన్ స్కీ, నాటో చీఫ్, ఇతర యూరోపియన్ దేశాల నాయకులతో వర్చువల్ గా సమావేశం కావడానికి నిర్ణయం తీసుకుంది.
ఈ చర్యలు రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి ఉపయోగపడతాయని భద్రతకు సంబంధించి కొత్తదారులు వెతకడానికి ఉపయోగపడతాయని జర్మనీ ఛాన్స్ లర్ కార్యాలయం వెల్లడించింది.
జర్మనీ ఛాన్స్ లర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రతినిధి స్టెఫెన్ మాట్లాడుతూ..‘‘ సరిహద్దులను బలవంతంగా మార్చకూడదనే దానికి జర్మనీ కట్టుబడి ఉంది’’ అని చెప్పారు. ఉక్రెయిన్ తన విధిని స్వతంత్య్రం గా, స్వయం ప్రతిపత్తితో నిర్ణయించుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఒక వైపు రష్యా- అమెరికా మధ్య చర్చలు జరుగుతుండగానే మరో వైపు కీవ్- మాస్కో దళాలు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. మాస్కోకు 418 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయగా ఒక రష్యన్ మరణించాడు. అలాగే క్రిమియాపై దాడి చేయడానికి చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నట్లు క్రిమ్లిన్ ప్రకటించింది. 39 డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది.