నేపాల్‌ ప్రధాని ఓలీ, ముగ్గురు మంత్రుల రాజీనామా, కారణం ?

నేపాల్‌లో సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం ఆంక్షల విధించడంతో యువత ఆందోళన బాట పట్టింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో 21 మంది చనిపోయారు.;

Update: 2025-09-09 11:27 GMT
Click the Play button to listen to article

నేపాల్‌(Nepal)లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. యువత నిరసనలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. వేల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం (సెప్టెంబర్ 9) నేపాల్ ప్రధాని కేపీ శర్మ(PM KP Sharma Oli) ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీమాను ప్రెసిడెంట్ రామ్ చంద్ర పైడల్ ఆమోదించారు. ఆయనతో పాటు ముగ్గురు మంత్రులు కూడా రిజైన్ చేశారు. వారిలో వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ మంత్రి రామ్ నాథ్ అధికారి, నీటి సరఫరా మంత్రి ప్రదీప్ యాదవ్, హోం మంత్రి రమేష్ లేఖక్ ఉన్నారు.


21 మంది మృతి..

సోషల్ మీడియా(Social media platforms)పై నిషేధంతో నేపాల్ రాజధాని కఠ్మాండూలో ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తాయి. వేలసంఖ్యలో రోడ్ల మీదకు చేరుకున్న యువతకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో సుమారు 21 మంది వరకూ చనిపోయినట్లు కథనాలు వస్తున్నాయి. మరో 100 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.


ఆర్మీ బ్యారక్స్‌కు వీఐపీలు..

దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమానాలను రద్దు చేశారు. 300 మంది సైనికులను అక్కడ మోహరించారు. మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. వీఐపీలను రాజధాని కాఠ్‌మాండూలోని ఆర్మీ బ్యారక్స్‌లోకి తరలిస్తున్నారు. ఢిల్లీ నుంచి కాఠ్‌మాండూ బయల్దేరిన రెండు ఇండిగో విమానాలకు త్రిభువన్ విమానాశ్రయం నుంచి క్లియరెన్స్ లభించలేదు. దాంతో వాటిని దారి మళ్లించాల్సి వచ్చింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం టోల్‌ ఫ్రీ నంబర్లు (977-9808602881, 977-9810326134) అందుబాటులో ఉంచింది.


ఆందోళనకు కారణం ఏమిటి?

నేపాల్ ప్రభుత్వం గత వారం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది. వీటిలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్రముఖ సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. దేశంలోని చట్టాలను పాటించడానికి, స్థానికంగా కార్యాలయాలను తెరవడానికి సోషల్ మీడియా కంపెనీలకు ప్రభుత్వం కొంత సమయం ఇచ్చింది. చైనా సోషల్ మీడియా కంపెనీ టిక్‌టాక్ ఈ షరతులను పాటించింది. నిబంధనలు పాటించని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించింది. దీంతో నిరసనలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం రాజధాని కాఠ్మాండూలో మొదలైన ఆందోళనలు.. నేపాల్‌లోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రకటించిన పోలీసులు.. ఆందోళనకారులను అడ్డుకున్నారు.

నేపాల్‌ ప్రజలు పెద్దసంఖ్యలో విదేశాల్లో నివసిస్తున్నారు. మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియాపై నిషేధం తర్వాత, విదేశాలలో నివసిస్తున్న నేపాలీలు తమ కుటుంబాలను కాంటాక్ట్ అవ్వడానికి ఇబ్బందులు తలెత్తాయి.

Tags:    

Similar News