తియాంజిన్ చేరుకున్న ప్రధాని మోదీ

చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో సమావేశం కాబోతున్న భారత ప్రధాని;

Update: 2025-08-31 04:55 GMT
చైనాలో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న కళాకారులు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ నేడు చైనాలోని తియాంజిన్ లో సమావేశం కాబోతున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మెరగుపరచడం కోసం విస్తృత స్థాయిలో చర్చలు జరపబోతున్నారు.

ఇద్దరు దేశాధినేతల మధ్య దాదాపు పది నెలల తరువాత మరో సమావేశం జరగబోతోంది. ఇంతకుముందు ఇరుదేశాధినేతల బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా రష్యాలోని కజాన్ లో సమావేశం అయ్యారు. గల్వాన్ ఘర్షణ జరిగిన ఏడు సంవత్సరాలకు ప్రధాని మోదీ తొలిసారిగా చైనాలో పర్యటిస్తున్నారు.

ఇటీవల ప్రపంచంపై ముఖ్యంగా భారత్ పై అమెరికా విధించిన సుంకాలతో ఆ దేశంతో వ్యూహాత్మక సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నట్లు కనిపిస్తున్న తరుణంలో ఈ రెండు పొరుగు దేశాధినేతల మధ్య సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ రోజు(ఆదివారం) నుంచి షాంఘై కో ఆపరేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశంలో భారత్, చైనాతో పాటు ఇతర దేశాల అధినేతలు కూడా హజరకాబోతున్నారు. ఎస్సీఓ సమావేశం ముగియడానికి ముందు మరోసారి జిన్ పింగ్ తో మోదీ సమావేశం అవుతారని సమాచారం. భారత్ బయల్దేరడానికి ముందు మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సైతం సమావేశం కాబోతున్నారు.
ఎస్సీఓ సమావేశం అధికారికంగా జిన్ పింగ్ ఇచ్చే విందుతో ప్రారంభం అవుతుంది. ఇందులో రష్యా, భారత్, చైనా, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, కిర్జిజ్ స్తాన్, ఉజ్ బెకిస్తాన్, బెలారస్ వంటి పది దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇవే కాకుండా మరికొన్ని దేశాలు పరిశీలకులుగా ఉన్నాయి.
ఇరవై దేశాల అధినేతలు ఇందులో పాల్గొనబోతున్నారు. పుతిన్ ఈ సమావేశానికి హజరవబోతున్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ఇప్పటికే తియాంజిన్ చేరుకున్నారు.
నేపాల్ అభ్యంతరాలు..
భారత్- చైనా మధ్య వాణిజ్యం లిపులేఖ్ మార్గం గుండా జరగడం పై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అభ్యంతరం వ్యక్తం చేశారు. లిపులేఖ్ తన సొంత భూభాగం అని కేపీ శర్మ ఓలి కొత్త వివాదాన్ని ఆయన మొదటి సారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత లేవనెత్తారు.
ఇప్పుడు మరోసారి అదే వాదనను ముందుకు తెచ్చారు. అయితే భారత్ ఈ వాదనలు ఖండించింది. చారిత్రక, వాస్తవ ఆధారాలను ఎవరూ మార్చలేరని ఖండించింది.
‘‘లిపులేఖ్ వివాదంలో చైనా, నేపాల్ కు సహకరిస్తుందని విశ్వసిస్తున్నాం’’ నేపాల్ ప్రధానమంత్రి సచివాలం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే చైనా దీనిపై మౌనం వహించింది. చైనా విదేశాంగ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.
సైనిక ప్రదర్శన..
ఎస్సీఓలో నాయకుల మధ్య శిఖరాగ్ర సమావేశం సోమవారం జరగుతుంది. ఇది ఇప్పటి వరకూ ఎస్సీఓ నిర్వహించిన అతిపెద్ద సమావేశం. ఇది ఇప్పటి వరకూ ఈ దేశంలో జరిగిన అతిపెద్ద దేశాధినేతల కార్యక్రమం అని చైనా విదేశాంగ సహాయమంత్రి లియు బిన్ ఇంతకుముందు చెప్పారు. శిఖరాగ్ర సమావేశంలో తన ఉపన్యాసంలో షాంఘై స్పూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో చైనా దృక్ఫథం, ప్రతిపాదనలను అధ్యక్షుడ జిన్ పింగ్ వివరిస్తారని ఆయన చెప్పారు.
జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనా ప్రజలు పోరాటం చేసి 80 సంవత్సరాలు అయిన సందర్భంగా సెప్టెంబర్ 3న బీజింగ్ లో జరగున్న చైనా సైనిక కవాతును వీక్షించడానికి చాలామంది దేశాధినేతలు అక్కడే ఉంటారని భావిస్తున్నారు.



Tags:    

Similar News