హమాస్- ఇజ్రాయెల్ మధ్య సానుకూలంగా చర్చలు
బందీలుగా విడుదలకు అంగీకరించిన ఇరుపక్షాలు, చర్చలు జరుగుతుండగానే దాడులు చేసిన ఐడీఎఫ్
By : Praveen Chepyala
Update: 2025-10-07 10:40 GMT
ఇజ్రాయెల్ - ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య సోమవారం జరిగిన శాంతి చర్చలు మొదటి రోజు ‘‘సానుకూల’’ వాతావరణంలో ముగిసింది. గాజాలో రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్దాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళిక అమలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గాజా మొత్తం నిస్సైనికీకరణ జరగాలనే డిమాండ్ పై చర్చ జరిగింది. ఈ రోజు కూడా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
సోమవారం ఈజిప్టులోని ఎర్ర సముద్రంలోన రిసార్ట్ నగరమైన షర్మ్ ఎల్ షేక్ లో జరిగిన చర్చలు చాలా గంటల పాటు కొనసాగాయి. ఈ చర్చల ప్రక్రియపై ఒక ముందస్తు ఎజెండా రూపొందించింది.
ఎవరెవరూ ఉన్నారు..
ఇజ్రాయెల్ ప్రతినిధిగా రాన్ డెర్మర్ నాయకత్వం వహిస్తున్నారు. హమాస్ ఉగ్రవాద సంస్థకు ఖలీల్ అల్ హయ్యా నాయకత్వం వహిస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ తరఫున విదేశాంగ సలహదారు ఓఫిర్ ఫాక్ హజరవుతారని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
అమెరికా రాయబారీ స్టీవ్ విట్ కాఫ్, ట్రంప్ అల్లుడు జూరెడ్ కుష్నర్ కూడా చర్చలలో పాల్గొంటారని చెబుతున్నారు. హమాస్ వైపు నుంచి హాజరైన హయ్యా, జహెర్ జబారిన్ ఇద్దరూ దోహలో ఇజ్రాయెల్ చేసిన హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు.
ఇందులో ఐదుగురు మరణించారు. అరబ్ మధ్యవర్తులు హమాస్ ప్రతినిధి బృందం మధ్య సమావేశంతో చర్చలు ప్రారంభం అయ్యాయని ఈజిప్టు ప్రభుత్వ యాజమాన్యంలోని అల్ ఖహెరా న్యూస్ వార్తలు ప్రసారం చేసింది. మధ్యవర్తులు తరువాత ఇజ్రాయెల్ ప్రతినిధి బృందంతో సమావేశం అవుతారని అది వెల్లడించింది.
చర్చలకు కేంద్ర బిందువు..
ఖతార్ కు చెందిన అల్ జజీరా న్యూస్ ఛానెల్ ప్రకారం.. చర్చలు ప్రధానంగా ఖైదీలు, హమాస్ కిడ్నాప్ చేసిన యూదు ప్రజల మార్పిడిపైనే జరిగింది. కాల్పుల విరమణకు అవకాశం, గాజాలోని మానవతా సాయం ప్రవేశించడంపై దృష్టి సారించాయి. చర్చల గురించి ఓ ఈజిప్టు అధికారి మాట్లాడుతూ.. బందీల విడుదల, ఖైదీల మార్పుపై జరిగిన చర్చలు దాదాపు సఫలం అయ్యాయని చెప్పారు.
అయితే చర్చల సందర్భంగానే గాజాపై ఇజ్రాయెల్ పదేపదే బాంబుదాడులు చేయడం ఖైదీల విడుదలకు సవాల్ ఎదురవుతోందని అన్నారు. చర్చలు జరిగినప్పటికీ బాంబు దాడులు కొనసాగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు స్వయంగా చెప్పినప్పటికీ ఐడీఎఫ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 24 గంటలలో జరిగిన దాడులలో కనీసం 19 మంది మరణించారని గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ నివేదించింది.
ట్రంప్ ఆశలు..
ఇజ్రాయెల్- హమాస్ మధ్య శాంతి చిగురిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైట్ హౌజ్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. వివాదాన్ని ముగించడానికి, శాంతి చర్చలు ముందుకు తీసుకురావడానికి బందీల విడుదల, ఖైదీల విడిచిపెట్టడం ముందుకు తీసుకు వచ్చామని చెప్పారు.
రెండు వైపులా నుంచి విడుదల కానున్న బందీలు, ఖైదీల జాబితాలను బృందాలు పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి మంచి అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘కానీ మనం చాలా బాగా చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. హమాస్ చాలా ముఖ్యమైన విషయాలను అంగీకరిస్తోందని నేను భావిస్తున్నాను’’ అని ట్రంప్ చెప్పాడు.
శాంతి కోసం ఒత్తిడి..
అమెరికా ప్రణాళికలోని ముఖ్యమైన అంశాలను హమాస్ అంగీకరించిందని, ఇజ్రాయెల్ కూడా తన సమ్మతిని తెలిపిందని వైట్ హౌజ్ తెలిపింది. ఈ ప్రణాళిక ప్రకారం.. 48 మంది బందీలను హమాస్ విడుదల చేయాలి. ఇందులో ఇంకా 20 మంది బతికే ఉన్నారు. దీనిప్రకారం.. మూడురోజులలో హమాస్ నిరాధీయుకరణ అవుతుంది.
ఈజిప్టులో చర్చలు త్వరగా జరుగుతాయని భావిస్తున్నారు. శిథిలాల కింద ఖననం చేయబడిన యూదుల మృతదేహాలను బయటకు తీయడానికి సమయం పడుతుందని హమాస్ తెలిపింది.
అయితే వీటిని వెలికితీయడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఇస్తామని నెతన్యాహూ హెచ్చరించారు. శాంతి కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఎల్ సీసీ ప్రశంసించారు.
దాడులను సమర్థించుకున్న ఇజ్రాయెల్..
బందీలను విడుదల చేయాలంటే ఇజ్రాయెల్ దాడులు ఆపాలని అమెరికా సూచించింది. ట్రంప్ పదే పదే పిలుపులు ఇస్తున్నప్పటికీ ఐడీఎఫ్ మాత్రం దాడులు కొనసాగిస్తునే ఉంది.
శనివారం దాడులు చేసింది మాత్రం తమ రక్షణ కోసమే అని ఐడీఎఫ్ చెబుతోంది. ఈ దాడులలో 19 మంది మరణించడంతో పాటు మరో 96 మంది మంది గాయపడ్డారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి జరిగిన తరువాత పాలస్తీనాలో హమాస్ ఉగ్రవాదులతో సహ 67,160 మంది మరణించారు. మరో 1,70, 000 మంది గాయపడ్డారు.
అక్టోబర్ 7న జరిగిన దాడిలో హమాస్ నేతృత్వంలోని తీవ్రవాదులు 251 మంది అపహరించి, దాదాపు 1200 మందిని కిరాతకంగా హతమార్చింది. వీరిలో అందరూ సాధారణ పౌరులే ఎక్కువగా ఉన్నారు. బందీలను పలు దఫాలుగా జరిగిన చర్చలలో హమాస్ విడిచిపెట్టింది.