‘‘సరిహద్దు సమస్యపై శాశ్వత పరిష్కారం’’
విభేదాలు వివాదంగా మారకూడదన్నా చైనా, భారత దేశాధినేతలు;
By : Praveen Chepyala
Update: 2025-08-31 11:42 GMT
భారత్- చైనా దేశాల మధ్య చాలాకాలంగా నలుగుతున్న సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తామని ప్రధాని మోదీ- షీ జిన్ పింగ్ ప్రతిజ్ఞ చేశారు.
ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరీకరించడానికి కృషి చేస్తామని అన్నారు. షాంఘై కో ఆపరేషన్ సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా జరిగిన విస్తృత స్థాయి చర్చలలో రెండు దేశాలు అభివృద్ది భాగస్వాములే కానీ, ప్రత్యర్థులు కాదని మోదీ, జిన్ పింగ్ అంగీకరించారు. రెండు వైపులా మధ్య విభేదాలు వివాదాలుగా మారకూడదని పేర్కొన్నారు.
ఉమ్మడి వేదిక
వాషింగ్టన్ ప్రస్తుతం చేస్తున్న టారిఫ్ వార్ వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరికరించడంలో తమ ఆర్థిక వ్యవస్థల పాత్రను ఇద్దరు నాయకులు గుర్తించారు.
భారత్, చైనా రెండు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని అనుసరిస్తాయని మా సంబంధాలను మూడో దేశం భూతద్దంలో చూడకూడదని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదం, న్యాయమైన వాణిజ్యం వంటి ద్వైపాక్షిక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలు సవాళ్లపై ఉమ్మడి వేదికను విస్తరించాల్సిన అవసరం ఉందని ఇద్దరు నాయకులు భావించారని భారతీయ రీడ్ అవుట్ తెలిపింది.
గత ఏడాది అక్టోబర్ లో ఇద్దరు నాయకులు కజాన్ లో సమావేశం అయిన తరువాత ద్వైపాక్షిక సంబంధాలలో సానుకూల, స్థిరమైన పురోగతి కనిపించిందని విదేశాంగ శాఖ రీడౌట్ లో తెలిపింది.
రెండు దేశాలు అభివృద్ది భాగస్వాములు మాత్రమే అని, ప్రత్యర్థులు కాదని, విబేధాలు వివాదాలుగా మారకూడదని వారు పునరుద్ఘాటించారు’’ అని పేర్కొంది.
శాంతియుత పరిష్కారం..
ద్వైపాక్షిక సంబంధాల నిరంతర అభివృద్దికి సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత ప్రాముఖ్యతను ప్రధానమంత్రి గుర్తించారు. గత సంవత్సరం విజయవంతంగా దళాలను ఉపసంహరించుకోవడం, అప్పటి నుంచి సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతతను కొనసాగించడం పట్ల ఇద్దరు నాయకులు సంతృప్తితో ఉన్నారని విదేశాంగ శాఖ పేర్కొంది.
‘‘మొత్తం ద్వైపాక్షిక సంబంధాల రాజకీయ దృక్ఫథం, రెండు దేశాల ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల నుంచి ముందుకు సాగే సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వారు నిబద్దతను వ్యక్తం చేశారు’’ అని ఎంఈఏ తెలిపింది.
ఈ నెల ప్రారంభంలో జరిగిన చర్చలలో ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను వారు గుర్తించారు. వారి ప్రయత్నాలకు మరింత మద్దతు ఇవ్వడానికి అంగీకరించారని పేర్కొంది.
చైనా ఎస్సీఓ అధ్యక్ష పదవికి తియాంజిన్ లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ మద్దతు తెలిపారని ఎంఈఏ తెలిపింది. 2026 లో భారత్ నిర్వహించనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు జిన్ పింగ్ ను ఆయన ఆహ్వానించారు. తనను ఆహ్వానించినందుకు మోదీకి జిన్ పింగ్ ధన్యవాదాలు తెలిపారు. భారత్ బ్రిక్స్ అధ్యక్ష పదవికి చైనా మద్దతు తెలిపిందని ఎంఈఏ తెలిపింది.