భారతే లక్ష్యంగా అణ్వాయుధాలను పాక్ ఆధునీకరిస్తోంది: అమెరికా
చైనా ను భారత్ తన ప్రధాన శత్రువుగా చూస్తుందన్న నివేదిక;
By : Praveen Chepyala
Update: 2025-05-25 14:23 GMT
ఉగ్రవాద దేశం పాకిస్తాన్, భారత్ ను తన ఉనికికి ముప్పుగా భావిస్తుందా.. అందుకోసం తన అణ్వయుధాలను ఆధునీకరిస్తుందా.. అందుకు టక్కరి చైనా సాయం చేస్తుందా అంటే అవుననే అంటోంది అమెరికా.
యూఎస్ఏ రక్షణ నిఘా సంస్థ ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం పాకిస్తాన్, భారత్ ను తన అస్థిత్వ ముప్పుగా చూస్తోంది. చైనా నుంచి భారీగా అందుతున్న సైనిక, ఆర్థిక సాయంతో తన అణ్వాయుధ సామగ్రిని భారీగా ఆధునీకరిస్తోందని నివేదించింది.
‘‘పాకిస్తాన్, భారత్ ను ఉనికికి ముప్పుగా భావిస్తోంది. భారత సాంప్రదాయ సైనిక శక్తిని ఎదుర్కోవడానికి యుద్దభూమిలో పై చేయి సాధించడానికి తన అణ్వాయుధాలను అభివృద్ది చేయడంతో సహ సైనిక ఆధునీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తుంది’’ అని నివేదిక పేర్కొంది.
ఈ నెలలో రెండు అణ్వాయుధ దేశాల మధ్య సాయుధ ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ భారత్ మాత్రం చైనానే తన ప్రధాన శత్రువుగా చూస్తోంది. పాకిస్తాన్ ను కేవలం సహాయక భద్రతా సమస్యగా మాత్రమే చూస్తోందని నివేదిక తెలిపింది.
చైనా ప్రాబల్యం ఎదుర్కోవడం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ ప్రాధాన్యతలో ప్రపంచ నాయకత్వాన్ని ప్రదర్శించడం, చైనాను ఎదుర్కోవడం, న్యూఢిల్లీ సైనిక శక్తిని పెంచడంపై దృష్టి సారించారని నివేదిక అంచనా వేసింది.
చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, ప్రపంచ నాయకత్వ పాత్రను పెంచుకోవడానికి భారత్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలను ప్రాధాన్యత ఇస్తోందని అమెరికా నివేదిక చెబుతోంది.
అలాగే భారత్- చైనా సరిహద్దు వివాదాన్ని నివేదిక ప్రస్తావించింది. సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారం కాకపోవడాన్ని కూడా ప్రస్తావించింది. కానీ 2020 తో పోలిస్తే కొంత ఉద్రిక్తత తగ్గిందని పేర్కొంది.
రక్షణ రంగంపై ప్రత్యేక దృష్టి
భారత్ తన దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతం చేసుకోవడానికి, సరఫరా గొలుసు సమస్యలను తగ్గించడానికి, సైన్యాన్ని ఆధునీకరించడానికి ఈ సంవత్సరం తన మేడ్ ఇన్ ఇండియా ను దాదాపు కొనసాగిస్తోందని పేర్కొంది.
గత ఏడాదిలో సైన్యాన్ని ఆధునీకరించడం కొనసాగించింది. అణు సామర్థ్యం గల అగ్ని -1 ప్రైమ్, ఖండాతర బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-5 రీ ఎంట్రీ వాహానం పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. అదే సమయంలో దాని అణుశక్తిని బలోపేతం చేయడానికి, ప్రత్యర్థులకు గుబులు పుట్టించడానికి తన సెకండ్ స్టైక్ కెపాబులిటినీ పెంచుకోవడంలో భాగంగా రెండో అణు జలాంతర్గామిని కూడా ప్రారంభించిందని పేర్కొంది.
భారత్- రష్యా సంబంధాలు..
భారత్- రష్యా సంబంధాలపై కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ సంవత్సరం కూడా తన స్నేహాన్ని అవి కొనసాగిస్తాయని అమెరికా నివేదిక పేర్కొంది. ఎందుకంటే రష్యాతో దాని సంబంధాలను తన ఆర్థిక, రక్షణ లక్ష్యాలను సాధించడానికి ముఖ్యమైనదిగా భావిస్తోంది. రష్యా- చైనా సంబంధాలను మరింత పెంచుకుంటున్న నేపథ్యంలో ఈ సంబంధాలను ప్రత్యేకంగా చూస్తోంది.
పాక్ సైన్యం ప్రాధాన్యతలు..
పాకిస్తాన్ సైన్యం ప్రధాన ప్రాధాన్యతలుగా తన సరిహద్దు సమస్యలతో పాటు తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్, బలూచ్ జాతీయవాద ఉగ్రవాద దాడులు పెరగడం, ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు, అణ్వాయుధ ఆధునీకరణ ఉంటుందని అమెరికా పేర్కొంది.
గత సంవత్సరంలో పాకిస్తాన్ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించినప్పటికీ 2024 లో ఉగ్రవాదుల పాకిస్తాన్ లో 2,500 మంది ప్రజలను హత్య చేశారు.
‘‘ పాకిస్తాన్ తన అణ్వాయుధశాలలను ఆధునీకరిస్తోంది. దాని అణు పదార్థాల భద్రత, అణు నియంత్రణ కొనసాగిస్తోంది. పాకిస్తాన్ దాదాపు విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి వచ్చే వాటినే కొనుగోలు చేస్తోంది’’ అని నివేదిక వివరించింది.
పాకిస్తాన్ దళాలు, చైనా పీఎల్ఏ తో విస్తృతంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చే విదేశీ వస్తువులు, సాంకేతికత చైనా నుంచి వస్తుండవచ్చని పేర్కొంది. అలాగే హాంకాంగ్, సింగపూర్, టర్కీ, యూఏఈ వంటి కొన్ని దేశాలు కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది.
అయితే పాకిస్తాన్ గుండా వెళ్తున్న సీపెక్ పై ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని, 2024 లో చైనా కార్మికులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేయడంతో రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసిందని తెలిపింది. ఈ దాడుల్లో ఏడుగురు చైనీయులు మరణించారని పేర్కొంది.