‘యూనస్‌ను విదేశాలకు వెళ్లనివ్వొద్దు’
‘బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ అశాంతిని సృష్టిస్తూ పొరుగు దేశాలతో సంబంధాలను బలహీనపరుస్తున్నారు’ - రచయిత్రి తస్లీమా నస్రీన్;
బంగ్లాదేశ్ (Bangladesh) ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌పై వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ (Taslima Nasreen) తీవ్ర విమర్శలు గుప్పించారు. దారుణాలకు ఒడిగట్టిన నోబెల్ బహుమతి గ్రహీతకు జీవిత ఖైదు విధించాలని డిమాండ్ చేశారు. పార్టీలకు ఒకతాటిపైకి తేవడం సాధ్యం కాదని భావించి, యూనస్ తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు.
‘విదేశాలకు వెళ్లనివ్వొద్దు’
ఒకవేళ రాజీనామా చేస్తే.. యూనస్‌ను విదేశాలను వెళ్లనివ్వకుండా దేశంలోనే ఉంచాలని నస్రీన్ డిమాండ్ చేశారు. "మిస్టర్ యూనస్ (Dr Muhammad Yunus) రాజీనామా చేయబోతున్నారని, ఇక జీవితాంతం యూరప్ లేదా అమెరికాలో ఉంటారని నేను విన్నాను. ఆయనను ఎందుకు బయటకు వెళ్ళనివ్వాలి? అతన్ని జైలులో పెట్టాలి" అని శనివారం (మే 24) ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
యూనస్ బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన వెంటనే ఆయనపై ఉన్న ఐదు కేసులను కొట్టివేసారని, యూనస్ జనసమూహాలను రెచ్చగొట్టడం, ప్రతిపక్షాలను తుడిచిపెట్టడానికి వారిలో ద్వేషం నింపుతున్నారని కూడా ఆరోపించారు తస్లీమా.
తప్పుడు హత్య కేసుల్లో యూనస్ ఎంతోమంది అమాయకులను జైలులో పెట్టారని, కారిడార్లు, ఓడరేవులను విదేశీ సైనిక శక్తులకు అప్పగించారని, పొరుగు దేశాలతో సంబంధాలను యూనస్ నాశనం చేశాడని ధ్వజమెత్తారు. ‘‘ఇంత జరుగుతున్నా ఆయనను స్వేచ్ఛగా వదిలేయాలా? తన నేరాలకు శిక్ష అనుభవించాలి. ఆయన జీవితాంతం జైలులో గడపాలి,’’ అని నస్రీన్ అన్నారు.
హింసాత్మక ఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాను పదవీచ్యుతురాలు అయిన తర్వాత భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలహీనపడిన నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు వచ్చాయి.