అమెరికాతో చర్చలకు ఆసక్తిగా లేము: ఇరాన్

యూరోప్ లో జరిగిన సంధి ప్రయత్నాలు విఫలం, పరస్పరం దాడులు చేసుకుంటున్న ఇరాన్- ఇజ్రాయెల్;

Update: 2025-06-21 14:02 GMT
ఇరాన్ నుంచి భారత్ చేరుకున్న విద్యార్థులు

ఇజ్రాయెల్- ఇరాన్ వివాదంలోకి అమెరికా ప్రవేశిస్తే పరిస్థితి తీవ్రంగా మారుతుందని ఇరాన్ మంత్రి హెచ్చరించారు. ఓ వైపు యుద్దం చేస్తూ తమ దేశంతో చర్చలు జరపాలని కోరడం ఏంటనీ, దీనిపై తమకు ఆసక్తి లేదని విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు.

యుద్దం రెండోవారంలోకి ప్రవేశించడంపై స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఇరు దేశాలు నాలుగు గంటల పాటు చర్చలు జరిపాయి. ఈ చర్చలకు యూరోపియన్ యూనియన్ మధ్యవర్తిత్వం జరపడానికి పూనుకుంది. అయితే ఇవి విఫలమయ్యాయి.

యూరోపియన్ యూనియన్ అధికారులు మాత్రం మరోమారు చర్చలు జరుపుతామనే ఆశాభావంతో ఉన్నారు. కానీ తదుపరి చర్చలకు తేదీ, సమయం మాత్రం ఇంకా నిర్ణయించలేదు.

ఇరాన్ మంత్రి మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్దం ఆగిపోతే, తాము ఆగిపోతామన్నారు. ‘‘దూకుడు ఆగిపోతే, దురాక్రమణదారుడు చేసిన నేరాలకు జవాబుదారీగా ఉంటే ఇరాన్ దౌత్యం గురించి ఆలోచించడానికి సిద్దంగా ఉంది’’ అని విలేకరులతో అన్నారు.
దాడులు తీవ్రం..
చర్చలు కొనసాగుతుండగానే ఇరు దేశాలు పరస్పరం భీకరదాడులకు పూనుకున్నాయి. ఇప్పటి వరకూ యుద్దంలో 430 ఇరానియన్ పౌరులు మరణించారు. మరో వైపు ఇజ్రాయెల్ లో ప్రాణ, ఆస్తి నష్టాలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ఈ రోజు ఇరాన్ లోని నైరుతి ప్రాంతంలో ఉన్న దాని సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది.
సుదీర్ఘ పోరాటం చేస్తాం: నెతన్యాహు
ఇరాన్ అణుకార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణుల ఆయుధాల వంటి ముప్పును తొలగించేందుకు తాము సుదీర్ఘకాలం పోరాటం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు.
ఐడీఎఫ్ సుదీర్ఘ పోరాటానికి సిద్దంగా ఉందని టాప్ జనరల్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. కానీ అమెరికా సాయం లేకుండా యుద్ధం చేయడం ఇజ్రాయెల్ కు వీలుకాదు.
ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకూడదు: మాక్రాన్
ఇరాన్ ఎన్నటికీ అణ్వాయుధాలు సమకూర్చుకోరాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ అన్నారు. ఆయన ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజేష్కియాన్ తో ఫోన్ మాట్లాడిన తరువాత ఈ ప్రకటన చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు పొందకూడదని, అంతర్జాతీయ సమాజానికి శాంతియుత ఉద్దేశాలు ఉన్నాయనే భరోసా ఇవ్వడం టెహ్రాన్ పై ఆధారపడి ఉందన్నారు.
‘‘ఇరాన్ ఎప్పుడూ అణ్వాయుధాలు సాధించకూడదు. దాని ఉద్దేశాలు శాంతియుతంగా ఉన్నాయని హమీ అందించడం దాని ఇష్టం. నేను దానికి డిమాండ్ చేస్తున్నాను’’ అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
‘‘యుద్దం నుంచి బయటపడటానికి, గొప్ప ప్రమాదాలను నివారించడానికి ఒక మార్గం ఉందని తాను నమ్ముతున్నానని’’ అని పోస్ట్ లో పేర్కొన్నారు. ఇరాన్ తో ఫ్రాన్స్ దాని యూరోపియన్ మిత్రులతో చర్చలను వేగవంతం చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News