పాకిస్తాన్‌పై కొనసాగుతున్న ఆంక్షల పరంపర
తపాలా, పార్సిల్ సేవల నిలిపివేత..;
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం(Pahalgam) ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రదాడి (Terror attack) తర్వాత.. పాకిస్థాన్(Pakistan) పట్ల భారత్ కఠిన వైఖరి అవలంభిస్తోంది. కొన్ని రోజుల క్రితం భారత్ - సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. తర్వాత పాక్ జాతీయులను తిరిగి వారి దేశానికి పంపించేసింది. ఇప్పుడు ఆ దేశం నుంచి పోస్టల్, పార్సిల్ (Parcel services)సర్వీసులను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ మేరకు కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్ విభాగానికి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇక నుంచి పాకిస్తాన్‌లో ఉత్పత్తి అయినా లేక అక్కడి నుంచి ఎగుమతి అయినా ఏ రకమైన వస్తువుకు కూడా భారత్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు.
పుల్వామా దాడి తర్వాత 2019లో భారత్‌కు దిగుమతి అయ్యే పాక్ వస్తువులపై 200 శాతం సుంకం విధించినా..కొన్ని ప్రత్యేక వస్తువులు మూడో దేశం గుండా ఇండియా మార్కెట్‌లోకి ప్రవేశించేవి. తాజాగా ఈ రూట్లపైనా కూడా కేంద్రం నిషేధం విధించింది.
2024–25 మధ్యకాలంలో పాక్‌కు భారత్ USD 447.65 మిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేయగా.. దిగుమతులు కేవలం USD 0.42 మిలియన్లకు పరిమితమయ్యాయి.
భారత్‌పై పాకిస్తాన్ ఇప్పటికే సిమెంట్, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఎక్కువగా ఆధారపడుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తుంది.
నౌకాశ్రయ నిషేధం..
కేంద్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు కూడా జారీ చేసింది. పాకిస్తాన్ జెండాతో నడిచే ఏ నౌకకైనా భారత నౌకాశ్రయాల్లోకి అనుమతించరాదని అలాగే భారత నౌకలు పాక్ నౌకాశ్రయాల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది.