‘‘తప్పుడు కథనాలు వ్యాప్తి చేయడంలో ఆరితేరారు’’
అయినా సిగ్గు లేకుండా అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకున్నారని పాక్ పై భారత్ మండిపాటు
By : Praveen Chepyala
Update: 2025-09-27 06:54 GMT
అంతర్జాతీయ దౌత్య వేదికలను ఉపయోగించుకుని భారత్ పై విషం కక్కడం పాక్ కు కొత్త కాదు.. అలాగే న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ కు తలంటడం కూడా పాత విషయమే. తాజాగా ఐరాస 80 వ సమావేశంలో మాట్లాడిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్.. మరోసారి ప్రగల్భాలు పలికారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ఏడు యుద్ధ విమానాలు కూల్చినట్లు చెప్పుకున్నారు.
ఈ వ్యాఖ్యలపై ఐరాస లో భారత ప్రతినిధి పెటల్ గెహ్లూట్ తీవ్రంగా ఖండించారు. పాక్ నాయకులు మరోసారి అసందర్భ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిన విషయాన్ని మరోసారి అంతర్జాతీయ వేదికలపై గుర్తు చేసిన భారత్, పాకిస్తాన్ తీవ్రవాదంపై యుద్ధం చేసినట్లు నటిస్తోందని ఆరోపణలు గుప్పించారు.
‘‘మిస్టర్ ప్రెసిడెంట్ ఈ అసెంబ్లీ మరోసారి పాక్ ప్రధానమంత్రి అసంబద్దమైన రాజకీయ ప్రదర్శనలకు వేదికగా నిలిచింది. ఆయన మరోసారి తమ విదేశీ విధానంగా మార్చుకున్న ఉగ్రవాదాన్ని కీర్తించుకున్నారు. అయితే ఎన్ని నాటకాలు ఆడినా అబద్ధాలు చెప్పినా, వాస్తవాలను కప్పిపుచ్చలేరు’’ అని ఘాటుగా బదులిచ్చారు.
ఏప్రిల్ 25న పహల్గామ్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులు మతం అడిగి మరీ పర్యాటకులును కాల్చిచంపారు. దీనికి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ బాధ్యత వహించింది. ఈ ఉగ్రవాద సంస్థను పాక్ రక్షించిందనే విషయాన్ని సభకు మరోసారి గుర్తు చేశారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులను కీర్తించింది..
‘‘ఒక ఒకే చిత్రం వేయి మాటలు మాట్లాడుతుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత దళాలు బహవల్పూర్, మురిడ్కే ఉగ్రవాద శిక్షణా శిబిరాలలో హతమార్చిన ఉగ్రవాదుల చిత్రాలను మనం చూశాము. పాకిస్తాన్ సైనిక, పౌర అధికారులు బహిరంగంగా ఉగ్రవాదులను కీర్తించి, నివాళులర్పించారు. ఇది ఎలాంటి ధోరణి, దీనిపై ప్రపంచానికి ఏదైనా సందేహం ఉందా? ’’ అని గహ్లూట్ ప్రశ్నించారు.
‘‘పాక్ ప్రధాని ఈ మధ్య విచిత్ర వివరణ ముందుకు తెచ్చారు. ఈ విషయంపై రికార్డు స్పష్టంగా ఉంది. మే 9 న భారత్ పై భారీ దాడులు చేస్తామని పాక్ బెదిరించింది. కానీ మే 10న పోరాటాన్ని నిలిపివేయాలని ఆ దేశ డీజీఎంఓ, భారత డీజీఎంఓను వేడుకున్నారు. ’’ అని ఆమె మరోసారి పాక్ ను ఎండగట్టారు.
కాల్పుల విరమణ కుదిరిన తరువాత భారత వైమానిక దళం దాడులు ఆపివేసింది. అమెరికా అధ్యక్షుడు అందరికంటే ముందుగా ఈ విషయం వెల్లడించారు.
‘‘ఉగ్రవాదాన్ని మోహరించడం, ఎగుమతి చేయడం అనే సంప్రదాయంలో ఆ దేశం మునిగిపోయినప్పటికీ అత్యంత హాస్యాస్పదమైన కథనాలను ప్రదర్శించడంలో పాకిస్తాన్ కు ఎలాంటి సిగ్గు లేదని దౌత్యవేత్త విమర్శించారు.
సింధూ నదీ జలాలు, కశ్మీర్..
పాక్ ప్రధాని తన ప్రసంగంలో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారత్ నిర్ణయాన్ని కూడా విమర్శించారు. కాశ్మీర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించిన ఆయన అక్కడి వారికి అండగా ఉంటామని చెప్పారు.
అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కూడా ప్రశంసించారు. దక్షిణాసియాలో యుద్ధాన్ని నివారించడంలో ఆయన చాలా గొప్ప కృషి చేశారని చెప్పారు. భారత్ తో సమగ్ర చర్చలు తిరిగి ప్రారంభించాలని కూడా కోరారని పేర్కొన్నారు.