రాఫెల్ మెరైన్ జెట్ల కొనుగోలుకు కుదిరిన ఒప్పందం
26 జెట్ విమానాలకు రూ. 63వేల కోట్లు - డెలివరీకి సుమారు ఐదేళ్ల సమయం;
భారత్ (India) 26 రాఫెల్ M ఫైటర్ జెట్ల(Rafale marine)ను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్(France)తో ఒప్పందం కుదిరింది. 22 సింగిల్ సీటర్ విమానాలు, శిక్షణ కోసం మరో నాలుగు ట్విన్ సీటర్ విమానాలను కొనుగోలు చేయనున్నారు. రూ. 63వేల కోట్లతో కొనుగోలు చేసే వీటిని భారత నావికాదళంలో వినియోగించనున్నారు. రాఫెల్ విమానాల నిర్వహణ, నేవీ సిబ్బందికి శిక్షణ ఒప్పందంలో భాగమే. ఈ నెల చివర్లో ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను భారత పర్యటన సందర్భంగా ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. ఆ ప్రక్రియ పూర్తి కాగానే నాలుగు నుంచి ఐదు సంవత్సరాలలో డెలివరీ అవుతాయి. తొలిబ్యాచ్‌లో 2029లో కొన్ని, 2031 నాటికి మొత్తం విమానాలను ఫ్రాన్స్ సమకూర్చనుంది.
అప్‌గ్రేడ్..
భారత నావికాదళం వద్ద ఇప్పటికే మిగ్ -29 కె విమానాల స్థానాలను రాఫెల్ M ఫైటర్లు భర్తీ చేయనున్నాయి. వీటిని ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై వినియోగించనున్నారు. ఇక ఇప్పటికే భారత వైమానిక దళం వద్ద ఉత్తర 36 రాఫెల్ జెట్‌లు ఉన్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచుతూనే..సముద్రం నుంచి దాడి సామర్థ్యాలను పెంచుకునే ఆలోచనలో ఉంది భారత్.
ఎందుకంత డిమాండ్..
రీన్‌ఫోర్స్డ్ ల్యాండింగ్ గేర్, మడతపెట్టే రెక్కలు, మెరుగైన అరెస్టర్ హుక్, కాటాపుల్ట్ లాంచ్ సిస్టమ్ అనుకూలత వల్ల వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంది.