భారత్ పై అమెరికా సుంకాలను సమర్థించుకున్న విదేశాంగ కార్యదర్శి

రెండు దేశాల సంబంధాలలో ‘ఆయిల్’ చికాకు కలిగిస్తుందన్న రూబియో;

Update: 2025-08-18 08:13 GMT
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో

రష్యా నుంచి ముడి చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న చైనా ను కాదని, భారత్ పై సుంకాలు విధించిన అంశంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు. చైనా పై సుంకాలు విధిస్తే అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంధన ధరలు పెరగడానికి దారి తీస్తుందని అంగీకరించారు.

‘‘ఒక దేశంపై ద్వితీయ ఆంక్షలు విధించినట్లు అయితే రష్యా చమురును చైనాకు రవాణా చేసే విషయంలో లాగా, చైనా ఆ చమురును శుద్ది చేస్తుంది. అది తిరిగి ప్రపంచ మార్కెట్లకు వస్తుంది. ఇలాంటి చమురును కొనుగోలు చేయాలంటే ఎవరైన సరే అధిక ధరకు కొనుగోలు చేయాలి. అది అందుబాటులో లేకపోతే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి’’ అని రూబియో ఫాక్స్ న్యూస్ తో చెప్పారు.
యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే ఇటువంటి చర్యలపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని ఆయన వివరించారు. చైనా, భారత్ పై వంద శాతం సుంకం ప్రతిపాదించే సెనెట్ బిల్లుపై అమెరికాలో చర్చ జరుగుతున్నప్పుడూ అనేక యూరోపియన్ దేశాలు తమ ప్రతిపాదనలతో ఏకీభవించడం లేదని రూబియో అన్నారు.
చిరాకు కలిగించే అంశం..
రష్యాతో భారత్ చేస్తున్న ఇంధన వ్యాపారం చాలాకాలంగా వాషింగ్టన్ కు చికాకు కలిగిస్తున్న అంశాల్లో ఒకటని రూబియో చెప్పారు. భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగించడం వలన ఉక్రెయిన్ లో రష్యా యుద్ధాన్ని నిలబెట్టడానికి సహాయపడుతుంది.
ఇది అమెరికా- భారత్ మధ్య సంబంధాలలో కచ్చితంగా చికాకు కలిగించే అంశమని ఆయన అన్నారు. అదే సమయంలో ఇది ఆందోళన కలిగించే ఏకైక అంశం కాదని స్పష్టం చేశారు.
ఏ దేశమైన తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని, భారత్ కు అపారమైన ఇంధన వనరులు దిగుమతి అవసరమని అన్నారు. ఆంక్షల కారణంగా చమురు, బొగ్గు, గ్యాస్ చౌకగా లభిస్తుందని అందుకే అది రష్యా నుంచి కొనుగోలు చేస్తుందని ఆయన అంగీకరించారు.
కానీ దురదృష్టవశాత్తూ రష్యాతో భారత్ వాణిజ్యం ఉక్రెయిన్ లో దాని యుద్ధ ప్రయత్నాలను కొనసాగించడంలో సాయపడుతుందన్నారు.
ద్వంద్వ ప్రమాణాలు..
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసినందుకు న్యూఢిల్లీపై అదనంగా 25 శాతం సుంకం విధించి ద్వితీయ ఆంక్షలు విధిస్తామని వాషింగ్టన్ బెదిరిస్తూనే ఉంది. అయితే ఇదే సమయంలో చైనా పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
రష్యా నుంచి పెద్ద మొత్తంలో అది ఇప్పటికీ చమురు కొనుగోలు చేస్తునే ఉంది. చైనాపై అది మౌనంగా ఉండటంతో ఇది ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తుందని తేటతెల్లమైంది.
భారత్ పై సుంకాలను సమర్థించిన ట్రంప్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అలస్కాలో జరిగిన సమావేశానికి ముందు ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ పై సుంకాల విధింపు వలన అమెరికాతో, రష్యా నేరుగా సంప్రదించడానికి ఉపయోగపడతాయని వాదించారు.
రష్యా తన అయిల్ ఎగుమతుల్లో రెండో ప్రధాన కస్టమర్ ను కోల్పోతుందని తద్వారా అది తన ఆదాయాన్ని కోల్పోతుందని అన్నారు. ఈ వాదనను భారత్ ఖండించింది. రష్యాతో తన ఇంధన అవసరాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని పేర్కొంది.


Tags:    

Similar News