అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌నకు CVI..

70 ఏళ్లు దాటిన వృద్ధుల్లో ఇది సాధారణంగా కనిపించే వ్యాధేనని అంటున్న వైద్యులు..;

Update: 2025-07-18 12:53 GMT

అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)నకు దీర్ఘకాల సిరల వ్యాధి (Chronic Venous Insufficiency)గా నిర్ధారణ అయింది. ట్రంప్‌ కాళ్ల దిగువ భాగంలో చీలమండ వద్ద వాపు రావడంతో వైద్యులు పరీక్షించారు. వయసు పైబడిన వారిలో ముఖ్యంగా 70 ఏళ్లు దాటిన వృద్ధుల్లో ఈ వ్యాధి సాధారణంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ ఆరోగ్య విషయంలో పారదర్శకత కోసం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నామని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ ప్రకటించారు.

ఎందుకు వస్తుంది?

సాధారణంగా సిరలు శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకు చేరుస్తాయి. కాళ్ల భాగంలో ఉండే లోతైన సిరలు, ఇతర భాగాల్లోని సిరలు సరిగ్గా పనిచేయకపోతే రక్తప్రసరణలో సమస్యలు తలెత్తుతాయి. సిరల్లోని కావాటాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తం వెనక్కి ప్రవహించి కాళ్లలోని పేరుకుపోతుంది. ఫలితంగా దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఎక్కువ సేపు నిలబడడం లేదా కూర్చోవడం, వయసు పెరగడం, అధిక బరువు తదితర కారణాల వల్ల దీర్ఘకాల సిరల వ్యాధి సంభవిస్తుంది. ఇది సాధరణమే అయినప్పటికీ కొన్నిసార్లు సమస్య తీవ్రతరం అవుతుంది. వ్యాయామంతో ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. కొన్నిసార్లు ఆపరేషన్‌తో సరిచేయాల్సి వస్తుంది.   

Tags:    

Similar News