నేపాల్‌లో కర్ఫ్యూ.. రంగంలోకి సైన్యం

దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసాలు.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం..ఆందోళనలపై కఠిన ఆంక్షలు..అత్యవసర సేవలకు మినహాయింపు;

Update: 2025-09-10 12:17 GMT
Click the Play button to listen to article

నేపాల్‌లో సైన్యం రంగంలోకి దిగింది. హింసాత్మక ఘటనలు, నిరసన ముసుగులో ఆందోళనకారులు ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేయడాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా బుధవారం (సెప్టెంబర్ 10) దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ సమయంలో ఎవరైనా విధ్వంసాలు, దహనాలు, దాడులకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఒక ప్రకటనలో హెచ్చరించింది. అంబులెన్స్‌లు, అగ్నిమాపక సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా సిబ్బందిని కర్ఫ్యూ నుంచి మినహాయించారు.

అసలు నిరసనలు ఎందుకు?

నిబంధనలు పాటించని సామాజిక మాధ్యమాల ప్రసారాలపై నేపాల్ ప్రభుత్వ నిషేధం విధించింది. దీంతో యువత పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. నిరసనలకు దిగారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి నిన్న (సెప్టెంబర్ 9న) రాజీనామా చేశారు. ఆయనతో పాటు ముగ్గురు మంత్రులు కూడా రిజైన్ చేశారు.

ఈ రోజు (సెప్టెంబర్ 9న) తెల్లవారుజాము నుంచి ఖాట్మండు, ఇతర నగరాలను ఆర్మీ దళాలు మోహరించాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఖాట్మండు, లలిత్‌పూర్, భక్తపూర్ నగరాలతో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆంక్షలు విధించింది సైన్యం. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని నేపాల్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి చెందిన ఒక అధికారి కోరారు. దీంతో ఖాట్మండు వీధులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యావసరాలు కొనేందుకు కర్ఫ్యూ సమయంలో కొన్ని గంటలు సడలిస్తున్నారు.


21 మంది మృతి..

మంగళవారం నిరసనకారులు పార్లమెంటు, రాష్ట్రపతి కార్యాలయం, ప్రధానమంత్రి నివాసం, ప్రభుత్వ భవనాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, సీనియర్ నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సుమారు వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.


విమాన సర్వీసులు రద్దు..

వైమానిక సేవలు కూడా రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి ఖాట్మండుకు వెళ్లే విమాన సర్వీసును ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ రద్దు చేశాయి.


ఆందోళన వ్యక్తం చేసిన రష్యా ..

నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలపై మంగళవారం రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. సంక్షోభానికి త్వరలో శాంతియుత పరిష్కారం కనుగొనాలని కోరింది. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో తమ పౌరులను నేపాల్‌కు వెళ్లొద్దని కోరింది. 

Tags:    

Similar News