‘‘భారత వృద్ది రేటుకు దోహదం చేయండి’’
జపాన్ రాష్ట్రాల గవర్నర్లను ఆహ్వానించిన ప్రధాని మోదీ;
By : Praveen Chepyala
Update: 2025-08-30 08:47 GMT
జపాన్ లో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ టోక్యోలో 16 మంది గవర్నర్లతో సమావేశం అయ్యారు. భారత్- జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యం కింద సహకారాన్ని ఏర్పరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘ఈ ఉదయం టోక్యోలో జపాన్ లోని 16 మంది గవర్నర్లతో చర్చలు జరిపాను. భారత్- జపాన్ స్నేహానికి ప్రిఫెక్చర్ సహాకారం ఒక ముఖ్యమైన వారధి. అందుకే నిన్న జరిగిన 15వ వార్షిక ఇండియా- జపాన్ శిఖరాగ్ర సమావేశంలో దీనిపై ప్రత్యేక చొరవ ప్రారంభించాం’’ అని ప్రధాని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
‘‘వాణిజ్యం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత మరిన్ని రంగాలలో సహకరించుకోవడానికి అపారమైన అవకాశం ఉంది. స్టార్టప్ లు, టెక్, ఏఐ వంటి భవిష్యత్ రంగాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి’’ అని ఆయన అన్నారు.
‘‘భారత్- జపాన్ సంబంధాలలో పురోగతి సాధిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యోలో 16 మంది గవర్నర్లతో సమావేశం అయ్యారు’’ అని విదేశాంగ శాఖ ఎక్స్ లో పోస్ట్ చేసింది. రెండు దేశాలు సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, పెట్టుబడి, నైపుణ్యాలు, స్టార్టప్, రంగాలలో భాగస్వామ్యం మరింత పెంచే మార్గాలపై చర్చించినట్లు ఎంఈఏ తెలిపింది.
నైపుణ్యాల పై దృష్టి..
ప్రతి జపాన్ ప్రిఫెక్చర్(రాష్ట్రం) దాని స్వంత ఆర్ధిక, సాంకేతిక బలాలు ఉన్నాయని, భారత రాష్ట్రాలకు వాటి ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయని ప్రధానమంత్రి గుర్తు చేశారు. భారత వృద్దికి తోడ్పాలని జపాన్ గవర్నర్లను ఆహ్వనించారు. యువత నైపుణ్యాల మార్పిడిలో ఉమ్మడి ప్రయత్నాలు, భారతీయ ప్రతిభతో జపనీస్ సాంకేతికతను కలపాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
భారత్- చైనా సంబంధాలు స్థిరంగా ఉండాలి
జపాన్ లో పర్యటనలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చైనాతో బలమైన సంబంధాలు కీలకమైనవని నొక్కి చెప్పారు. ఇది ప్రాంతీయ శక్తి, శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తీసుకురాగలదని పేర్కొన్నారు.
జపాన్ పర్యటన ముగిసిన తరువాత ప్రధాని మోదీ చైనాకు వెళ్లనున్నారు. అక్కడ జరగబోయే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి హజరవుతారు. ఈ కూటమిలో రష్యా, ఇరాన్, కజకిస్థాన్, కిర్గిజ్ స్థాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్ బెకిస్తాన్, బెలారస్ ఉన్నాయి.
‘‘చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఆహ్వానం మేరకు నేను ఇక్కడి నుంచి టియాంజిన్ లో జరిగే ఎస్సీఈఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి వెళ్తాను. గత సంవత్సరం ఎస్సీఈఓ శిఖరాగ్ర సమావేశం కజాన్(రష్యా) లో జరిగింది.
అప్పుడు జిన్ పింగ్ తో సమావేశం అయ్యాను. మా ద్వైపాక్షిక సంబంధం స్థిరమైన, సానుకూల పురోగతి సాధించింది’’ అని మోదీ జపాన్ మీడియాతో అన్నారు. ‘‘భూమి మీద అతిపెద్ద దేశాలైన భారత్, చైనా మధ్య స్థిరమైన సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతి, శ్రేయస్సు పై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది బహు ధ్రువ ఆసియా, ప్రపంచానికి చాలా ముఖ్యమైనది’’ అని ఆయన అన్నారు.
ద్వైపాక్షిక సంబంధాలలో క్షీణత..
ఉక్రెయిన్ లో రష్యా యుద్ధం, గాజా- ఇజ్రాయెల్ యుద్ధం, భారత ఎగుమతులపై అమెరికా 50 శాతం టారిఫ్ లు విధించడం వలన భారత్ ఆర్థిక, భౌగోళిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఎస్సీఈఓ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది.
ముఖ్యంగా అమెరికా సుంకాల నిర్ణయం భారత్, చైనాలను దశాబ్ధాలుగా కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలను తగ్గించే దిశగా నడిపించింది. ఎందుకంటే రెండు దేశాలపై అమెరికా సుంకాలు విధించి తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తోంది. మధ్యలో చైనా- అమెరికా మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపించినా.. తరువాత పరిస్థితి మారలేదు.
ఈ తరుణంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా, రష్యాలో పర్యటించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ న్యూఢిల్లీతో చర్చలు జరిపారు. రెండు దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. డ్రాగన్, ఏనుగు రెండు కలిసి డ్యాన్స్ చేయాలని చైనా ఆకాంక్షించింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం తీసుకురావడానికి భారత్, చైనా కలిసి పనిచేయాలని షీ జిన్ పింగ్ కూడా అభిప్రాయపడ్డారు. రెండు దేశాలకు ఆసక్తి ఉన్న కీలక రంగాలలో ఎలక్ట్రిక్ వెహికల్ రంగం ఒకటని భావిస్తున్నారు. ఇది అరుదైన ఖనిజాలపై ఆధారపడి ఉంది. దీనిపై చైనా గుత్తాధిపత్యం ఉంది. బహుశా ఈ రంగంలో రెండు దేశాలు సహకరించుకునే అవకాశం ఉంది.