‘‘అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల మధ్య సంప్రదింపులు అవసరం’’

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్;

Update: 2025-07-14 11:12 GMT
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్

భారత్- చైనా మధ్య సాధారణ సంబంధాలు కొనసాగాలంటే నిరంతరం చర్చలు జరగాల్సిందే అని విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. రెండు పొరుగు దేశాల మధ్య అభిప్రాయాలు, దృక్ఫథాలు(ఒపినియన్) మార్పిడి కొనసాగేలా చూసుకోవాలని వివరించారు. చర్చలు జరగడం చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.

బీజింగ్ లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు దేశాల మధ్య చర్చలు, సంబంధాలను నిరంతరం సాధారణీకరించడం ద్వారా మాత్రమే ఇరుపక్షాలకు పరస్పర ప్రయోజనకరమైన ఫలితం లభిస్తుందని ఆయన అన్నారు.
అభిప్రాయాలను మార్చుకుందాం..
అంతర్జాతీయ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్న దశలో పొరుగు దేశాలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా భారత్, చైనా మధ్య బహిరంగ అభిప్రాయాల మార్పిడి చాలా కీలకమని జైశంకర్ అభిప్రాయపడ్డారు.
‘‘ఈ రోజు మనం సమావేశమవుతున్న అంతర్జాతీయ పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. పొరుగు దేశాలు, ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న భారత్, చైనా మధ్య అభిప్రాయాలు, దృక్ఫథాల బహిరంగ మార్పిడి చాలా ముఖ్యం. ఈ పర్యటన సందర్భంగా అలాంటి చర్చల కోసం నేను ఎదురు చూస్తున్నాము’’ అని జైశంకర్ అన్నారని జాతీయ మీడియా పేర్కొంది.
ద్వైపాక్షిక సంబంధాలు..
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో మెరుగుదల, చైనా షాంఘై సహకార సంస్థ అధ్యక్ష పదవికి భారత్ మద్దతును జైశంకర్ ప్రస్తావించారు.
‘‘ఈ రోజు నేను బీజింగ్ చేరుకున్న వెంటనే ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ను కలవడం సంతోషంగా ఉంది. చైనా ఎస్సీఓ అధ్యక్ష పదవికి భారత్ మద్దతును తెలియజేశాను. మా ద్వైపాక్షిక సంబంధాలలో మెరుగుదల గమనించాను. నా పర్యటన సమయంలో చర్చలు సానుకూల పథాన్ని కొనసాగిస్తాయని విశ్వాసాన్ని వ్యక్తం చేశాను’’ అని జైశంకర్ ఎక్స్ లో పోస్ట్ లో పేర్కొన్నారు.
ఐదు సంవత్సరాల విరామం తరువాత టిబెట్ కు కైలాస మానస సరోవర్ యాత్ర పున: ప్రారంభం గురించి జైశంకర్ మాట్లాడుతూ.. భారత్ లో దీనిని విస్తృతంగా ప్రశంసించారని అన్నారు. కోవిడ్-19, భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణల తరువాత మానస సరోవర్ యాత్ర నిలిచిపోయింది.
ఎస్సీఓ సెక్రటరీ జనరల్ తో సమావేశం...
జై శంకర్ ఎస్సీఈఓ సెక్రటరీ జనరల్ నూర్లాన్ యెర్మెక్ బయేవ్ ను కలిశారు. సమావేశం తరువాత విదేశాంగమంత్రి మాట్లాడుతూ.. 10 మంది సభ్యుల సంస్థ సహకారం, ప్రాముఖ్యత దాని పనితీరును ఆధునీకరించడానికి చేసిన ప్రయత్నాలను చర్చించామని అన్నారు.
‘‘ఈ రోజు బీజింగ్ లో ఎస్సీఓ ఎస్జీ నూర్లాన్ ను కలవడం ఆనందంగా ఉంది. ఎస్సీఓ సహకారం, ప్రాముఖ్యతను అలాగే దాని పనితీరును ఆధునీకరించే ప్రయత్నాలను చర్చించాము’’ అని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు.
గల్వాన్ ఘర్షణ తరువాత తొలిసారి..
ఐదు సంవత్సరాల తరువాత తొలిసారిగా బీజింగ్ పర్యటనకు భారత్ విదేశాంగ మంత్రి వెళ్లారు. సింగపూర్ పర్యటనను ముగించుకుని నేరుగా చైనా చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా జై శంకర్ టియాంజిన్ లో జరిగే ఎస్సీఓ విదేశాంగ మంత్రుల మండలి సమావేశం దానితో పాటు ద్వైపాక్షిక సమావేశాలకు కూడా హజరవుతారు.
ఎస్సీఓ 25వ దేశాధినేతల మండలి సమావేశం ఈ ఏడాది చివర్లో టియాంజిన్ లో జరగనుంది. 2023 లో ఎస్సీఓ అధ్యక్ష పదవికి భారత్ అధ్యక్షత వహించగా, 2024 లో పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది.


Tags:    

Similar News