గాజాలో పిట్టల్లా రాలిపోతున్న పిల్లలు, ఎటుచూసినా ఆకలి కేకలు!

పేగులు ఎండి ఏడ్వడానికీ ఓపిక లేని పిల్లలు!;

Update: 2025-07-25 13:35 GMT
ఇజ్రాయిల్ యుద్ధం, ఆంక్షలతో గాజా ఆకలితో అలమటిస్తోంది. ఎటు చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. కంట కన్నీరు ఇంకిపోతోంది. కత్తి వేటుకు కూడా రక్తపు చుక్క కానరావడం లేదు.

అయినా ఆహారం పంపిణీకి సైతం ఇజ్రాయిల్ ససేమిరా అంటోంది. దీంతో నిత్యం పదుల సంఖ్యలో పసి పిల్లలు నేలరాలుతున్నారు. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఆహారం, ఔషధాలు లేక వైద్యులు చేతులెత్తేస్తున్నారు. గత నాలుగు రోజుల్లో కొన్ని వందల మంది పిల్లలు ఆస్పత్రి పాలుకావడమో, ఆకలితో మరణించినట్టు తెలుస్తోంది.
‘ఉత్తర గాజాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆ ప్రాంతంలోని ఆసుపత్రుల్లో ఎన్నడూ లేనంతగా చిన్నారులు ఆస్పత్రిలో చేరుతున్నారు. నిత్యం 200 నుంచి 300 మంది చేరుతున్నారు. ఈ విపత్తును చూస్తుంటే మాటలు రావడం లేదు. శరీరం బక్కచిక్కి ఎముకల గూడులా పిల్లలు కనిపిస్తున్నారు.
పిల్లలు నడవడం సరే, కనీసం ఏడవడానికీ ఓపిక లేదు. పేగులు ఎండిపోతున్నాయి. పొత్తికడుపులు ముడుచుకుపోయాయి. వీరికి ఇవ్వడానికి ఆసుపత్రిలో సరైన పోషకాహారం కూడా లేదు. కొందరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నా.. ప్రాణాలను కాపాడలేకపోతున్నాం.

ఇంతకంటే దారుణ, భయంకరమైన పరిస్థితి మరొకటి లేదు. మేం కూడా అలసిపోయాం’’ అని అమెరికా స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచేస్తున్న డాక్టర్‌ రానా సోహోబ్‌ కంట నీరు పెడుతున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
చిన్నపిల్లలకు పొటాషియం ఎంతో అవసరమని, కానీ అదే అందుబాటులో లేకపోవడంతో రానున్న రోజుల్లో మరిన్ని మరణాలు చూడక తప్పని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష మంది మహిళలు, చిన్నారులకు అత్యవసర చికిత్స అవసరమని ఐక్యరాజ్యసమితీకి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం విభాగం పేర్కొంది. చాలా కీలక చికిత్సలు ఆగిపోయాయని, అవసరమైన ఔషధాలు అయిపోయినట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆకలి చావులకు ఇది ఆరంభం మాత్రమేనని మెడ్‌గ్లోబల్‌ సహ వ్యవస్థాపకుడు, గాజాలో వాలంటీర్‌గా పనిచేసిన డాక్టర్‌ జాన్‌ కహ్‌లెర్‌ పేర్కొన్నారు.
ఐక్య రాజ్య సమితీ అంచనా ప్రకారం.. గాజా వాసులకు నిత్యం 500-600 ట్రక్కుల ఆహార పదార్థాలు అవసరం. కానీ, ప్రస్తుతం సరాసరి 69 ట్రక్కుల్లో మాత్రమే సరఫరా అవుతోంది. అయితే, వీటిని పంపిణీ చేయకముందే.. ఆహారం కోసం అల్లాడుతున్న పాలస్తీనా వాసులు ఈ ట్రక్కులపై దాడి చేసి లూటీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో భారీగా ఆకలి చావులు నమోదయ్యే ప్రమాదం ఉంది. ఆయా దేశాలు తక్షణమే స్పందించి ఆహార పదార్థాలు సరఫరా చేయాలని 115 అంతర్జాతీయ మానవ హక్కుల, స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.
Tags:    

Similar News