ఆచంటలో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందా? వారు మంత్రులవుతున్నారా?
x

ఆచంటలో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందా? వారు మంత్రులవుతున్నారా?

ఆచంటపైనే అందరి దృష్టి. సెంటిమెంట్‌గా మారిన ఆచంట అసెంబ్లీ నియోజక వర్గం. మూడు సార్లు నెరవేరిన సెంటిమెంట్‌


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక ప్రత్యకత ఉంది. ఆచంట అసెంబ్లీ నియోజక వర్గం రిజర్వుడు స్థానం నుంచి జనరల్‌ స్థానంగా మారిన తర్వాత నుంచి ఈ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ స్పెషాలిటీ గురించి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ కూడా ఉంది. ఎన్నికలు వచ్చాయంటే దీని గురించిన చర్చే సాగుతుంటుంది. ఈ ప్రత్యేకతను ఒక సెంటిమెంట్‌గా కూడా భావిస్తుంటారు. దీనికి ఒక లెక్క కూడా ఉంది. అదేంటంటే ఆచంట అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఏ అభ్యర్థి అయితే విజయం సాధిస్తారో ఆ ఆభ్యర్థికి చెందిన పార్టీ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకొని అధికార పీఠంలో కూర్చుంటుందనే ఒక సెంటిమెంట్‌ ఉంది. దీంతో పాటుగా ఆచంట నుంచి గెలిచిన అభ్యర్థి మంత్రి పదవి కూడా అలంకరిస్తారని కూడా చెబుతుంటారు. ఇది ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎక్కువుగా ప్రాచుర్యంలో ఉన్నా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని గురించి చర్చించుకోవడం రాజకీయ వర్గాల్లో పరిపాటిగా మారింది.

గత ఎన్నికల ఫలితాలు
గత ఎన్నికల ఫలితాలు కూడా ఈ అంచనాలను ధృవీకరిస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇక్కడ నుంచి గెలిచిన అభ్యర్థుల పార్టీలే అధికారాన్ని చేజిక్కించుకుంటూ రావడం, వారు కూడా మంత్రి పదవులు దక్కించుకోవడం కొనసాగుతోంది. ఆచంట అసెంబ్లీ నియోజక వర్గం జనరల్‌ స్థానంగా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. మూడు సార్లు గెలిచిన వారికి మంత్రి పదవులు దక్కాయి. వారి పార్టీలే అధికారంలోకి వచ్చాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన పితాని సత్యనారాయణ టీడీపీ అభ్యర్థి కర్రి రాధాకృష్ణారెడ్డిపై గెలుపొందారు. దాదాపు 15వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది అధికారాన్ని చేజిక్కించుకుంది. నాడు ఏర్పడిన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో పితాని సత్యనారాయణ మంత్రి పదవి దక్కించుకున్నారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న కే రోశయ్య, ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గాల్లోను పితాని సత్యనారాయణ మంత్రిగా కొనసాగారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, ఎన్నికలు రావడం చకచక జరిగి పోయాయి. రాష్ట్ర విభజన అనంతరం పితాని టీడీపీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పితాని ఆచంట నుంచి గెలుపొందారు. విభజన అనంతరం జరిగిన ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. నాడు ఏర్పడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో పితాని సత్యనారాయణ మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెరుకువాడ శ్రీరంగనాధరాజు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పితాని సత్యనారాయణపై 12వేలపైగా ఓట్ల మెజారిటీతో శ్రీరంగనాధరాజు విజయం సాధించారు. ఇదే ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలను సొంతం చేసుకొన్న వైఎస్‌ఆర్‌సీపీ అధికారిన్ని కైవసం చేసుకుంది. తర్వాత ఏర్పడిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో శ్రీరంగనాధరాజును మంత్రి పదవి వరించింది. ఇలా ఆచంట నుంచి ఏ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం, ఆచంట నుంచి గెలిచిన వారికి మంత్రి పదవులు వరించడం పరిపాటిగా వస్తోందని స్థానికుల్లో చర్చ సాగుతోంది.
ఈ సారి కూడా ఇదే నిజమం అవుతుందా
అయితే 2024 ఎన్నికల్లో పాత ప్రత్యర్థులే బరిలోకి దిగడం, ఇద్దరూ మాజీ మాంత్రులు కావడంతో పోటీ తీవ్రంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పోటీ చేస్తుండగా, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి మరో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు బరిలోకి దిగారు. హోరా హోరీగా తలపడుతున్న ఈ పోరులో తీవ్ర పోటీ నెలకొన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు, గత మూడు పర్యాయాలు జరిగినట్లు ఈ సారి కూడా నెరవేరుతుందా అని స్థానికులు, రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
2008లో జనరల్‌ స్థానంగా ఆచంట నియోజక వర్గం
2004 వరకు ఆచంట ఎస్సీ రిజర్వుడు స్థానంగా ఉండేది. 2008లో దీనిని జనరల్‌ స్థానంగా మార్చారు. 2009లో జనరల్‌ స్థానానికి తొలి సారి ఎన్నికలు జరిగాయి. పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర మండలాలతో పాటు పోడూరు మండలంలోని సగభాగంతో కలిపి ఆచంట జనరల్‌ అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేశారు.
Read More
Next Story