సూపర్‌ స్టార్‌ కృష్ణను పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారు?
x

సూపర్‌ స్టార్‌ కృష్ణను పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారు?

ఎన్నికల ప్రసంగంలో అసందర్భంగా సూపర్‌ స్టార్‌పై వపన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు.


ఇద్దరు లెజండరీ పర్సనాలిటీస్‌ను పోల్చినప్పుడు ఏ ఒక్కరికీ, వారి ఇమేజ్‌కి ఇబ్బంది కలుగ కుండా ప్రసంగం చేయాలి. పోలికలు చెప్పాలి. లేదంటే ఆ జోలికి పోకూడదు. కానీ వపన్‌ కల్యాణ్‌ ఈ సూత్రాన్ని మరచినట్లున్నారు. అందుకే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇరకాటంలో పడ్డారు. సూపర్‌ స్టార్‌ కృష్ణపై ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాలు, ఇటు సినీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. తనకు నచ్చినట్టుగా ఎన్నికల ప్రసంగాలు చేసుకోకుండా ఎలాంటి సంబంధం లేని సూపర్‌ స్టార్‌ కృష్ణను పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగాల్లోకి లాగి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటని సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేష్‌ బాబు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి లేని పోని వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పవన్‌ కల్యాణ్‌పై ఉండే అభిమానం కూడా పోతుందని చర్చించుకుంటున్నారు.

వేదికపైన బిజెపీ అధ్యక్షురాలు పురందేశ్వరి
రాజమండ్రి పార్లమెంట్‌ పరిధిలో జరిగిన ఒక ఎన్నికల ప్రచారంలో ఇటీవల పవన్‌ కల్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్న సమయంలో ఎన్నికల ప్రచార వాహనంపై ఎన్టీఆర్‌ కుమార్తె, ఆంధ్రప్రదేశ్‌ బిజెపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్‌ బిజెపీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి కూడా ఉండటం గమనార్హం. రాజానగరం అసెంబ్లీ నియోజక వర్గంలో టీడీపీ, బిజెపీ, జనసేన కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ బరిలో ఉన్నారు. ఆయనకు, రాజమండ్రి పార్లమెంట్‌ బిజెపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ, ఎన్టీఆర్‌లను పోల్చుతూ మాట్లాడారు. అప్పట్లో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా సూపర్‌ స్టార్‌ కృష్ణ కాంగ్రెస్‌లో ఉండేవారని, ఎన్టీఆర్‌ను కృష్ణ విమర్శించినా, ఎన్టీఆర్‌ ఎప్పుడూ కృష్ణను పల్లెత్తి మాట కూడా అనలేదని, కోటా శ్రీనివాసరావు కూడా వేరే పార్టీలో ఉండే వారని, ఆయనను కూడా ఎన్టీఆర్‌ ఎప్పుడూ పల్లెత్తి మాట కూడా అన లేదని అంటూ అప్పటి రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో, ఇప్పటి రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో చెప్పేందుకు పవన్‌ కల్యాణ్‌ ఈ పోలిక తెరపైకి తెచ్చారు.
రచ్చకెక్కిన వ్యాఖ్యలు
ఇది కాస్త గెలుక్కున్నటై్టంది. దీంతో అవి కాస్తా రచ్చకెక్కాయి. దీనిపైన కృష్ణ, మహేష్‌ బాబు అభిమానులు పవన్‌ కల్యాణ్‌పై ట్రోలింగ్‌లకు తెర లేపారు. పోలికలో ఎన్టీఆర్‌ను ఎక్కువ చేయడం, కృష్ణను తక్కువ చేయడం ఏమిటని, అంత అవసరం ఏముందంటూ సోషల్‌ మీడియా వేదికగా విమర్శలకు తెర లేపారు.
స్పందించిన నరేష్‌
ఈ నేపథ్యంలో సినీనటుడు, విజయనిర్మల కుమారుడు నరేష్‌ రియాక్ట్‌ అయ్యారు. కృష్ణ గురించి భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడొద్దని సవినయంగా కోరుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగంలో దివంగత సూపర్‌ స్టార్‌ను విమర్శించడం దిగ్బ్రాంతికి గురిచేసింది. దీంతో చాలా బాధ పడ్డాను. కృష్ణ మనసు బంగారం. పార్లమెంట్‌ సభ్యుడిగా నైతిక విలువలకు పెద్ద పీట వేసిన వ్యక్తి కృష్ణ. సినీ రంగానికి, రాజకీయ రంగానికి కృష్ణ అందించిన సేవలు నిత్యనూతనం. కృష్ణ ఏనాడూ పార్టీ మారింది లేదు. కృష్ణ తన ప్రసంగాల్లో ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించింది లేదు. అని నరేష్‌ ట్వీటర్‌ వేదికగా స్పందించారు. అంతేకాకుండా ఓ నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్‌ కల్యాణ్‌ పట్ల తనకెంతో గౌరవం ఉందని, నేను పవన్‌ కల్యాణ్‌లో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ను చూస్తున్నానని, ఆంధ్రప్రదేశ్‌కు పునర్‌వైభవం కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించాలని బిజెపీ మాజీ యువజన అధ్యక్షుడిగా, ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శిగా కోరుకుంటున్నానని మరొక ట్వీట్‌లో ఒకవైపు పవన్‌ కల్యాణ్‌ను సున్నితంగానే విమర్శస్తూ మరో వైపు తన అభిమానాన్ని, ఆకాంక్షను వెల్లడించారు నరేష్‌.
Read More
Next Story