
TIRUPATI || గోశాల మాజీ డైరెక్టర్పై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
10 నెలల కాలంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు
టిటిడి గోశాలలో గోవులకు పెట్టే గడ్డిని కూడా గత పాలకులు వదలలేదని టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడారు. టిటిడి గోశాలలో ఆల్ ఇండియా గోసంరక్షణ సంస్థ ప్రధాన కార్యదర్శి, టిటిడి గోసంరక్షణ పూర్వ సభ్యులు కోటి శ్రీధర్ , టిటిడి బోర్డు సభ్యులు, మీడియాతో కలిసి ఛైర్మన్ శనివారం పరిశీలించారు. ప్రస్తుతం గోవులకు అందుతున్న దాణా, త్రాగునీరు, పరిశుభ్రత, అవసరమైన వైద్యం జరుగుతుందా తదితర అంశాలను గోశాల ఇంఛార్జి డైరెక్టర్ శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. గోశాలలో గోవులు, పేయ దూడలు ఉంటున్న షెడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
టీటీడీ గోశాలపై కోర్టుల్లో పిల్స్ దాఖలు చేస్తామని కొంత మంది ఫోన్ లు చేస్తున్నారని, వారిని ఒకటే కోరుతున్నా, గత ఐదేళ్ల పాలనలో టిటిడిలో జరిగిన నిధుల స్వాహా, అవకతవకల అంశాలను జోడించి కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తే వారికి పూర్తి సహకారం అందిస్తామని ఛైర్మన్ చెప్పారు . గతంలో పింక్ డైమండ్ మీద కోర్టులో కేసు వేశారని, ఆ కేసు ఏమైందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టిటిడిలో ఎలాంటి అవినీతి జరుగలేదని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు.
టిటిడిలో గత 10 నెలల్లో ఏమి జరుగకపోయినా ఏదో జరిగిపోతున్నట్లు కొంత మంది ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న గ్లోబల్ ప్రచారం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సరికాదని సూచించారు. 2023-24 ఏడాదిలో అప్పట్లో టిటిడి గోసంరక్షణ సలహాదారు శ్రీ కోటి శ్రీధర్ చెప్పిన మాటలను చూస్తుంటే , టిటిడి గోశాలలో జరిగిన అవకతవకలపై మాకు తెలిసింది కొంతే, ఇంకా చాలా ఉందని చెప్పారు. టిటిడి గోశాల గోవులను కూడా ఒంగోలులో అమ్ముకున్నట్లు తెలుస్తోందన్నారు.
గతంలో టిటిడి గోశాల సంచాలకులుగా పనిచేసిన డా. హరినాథ్ రెడ్డి టిటిడి గోశాలను సొంత ఎస్టేట్ లాగా భావించి భారీ అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ఎవరిని గోశాలలోకి రానివ్వకుండా హరినాథ్ రెడ్డి నియంతృత్వంగా వ్యవహరించారన్నారు. వైద్యులను, ఇతరులను గోశాలకు రానివ్వకుండా వేధించారణే ఆరోపణలు ఉన్నాయన్నారు.