
Tirupati || తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం..!
మే 12న స్వర్ణ రథోత్సవం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మధ్యాహ్నం శుక్రవారపుతోటలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. మే 12న ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.
వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయి.
వైభవంగా స్నపన తిరుమంజనం
వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.
భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. వసంతోత్సవం కారణంగా ఆదివారం కల్యాణం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి.
Next Story