సరదాగా వెళ్లారు..శవాలై వచ్చారు
x

సరదాగా వెళ్లారు..శవాలై వచ్చారు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీరని విషాదం చోటుచేసుకుంది.


అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీరని విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు కళ్లముందే ఆడుకుంటూ గెంతులేసిన ఆ చిన్నారులు, కాసేపు ఈత కొట్టి వస్తామని వెళ్లారు. కానీ, అదే వారి చివరి ప్రయాణం అవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. పాడేరు మండలం పెదబయలు పరిధిలోని పర్రెడ గ్రామంలో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోవడం యావత్ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేసింది.

మృత్యువు ఊబిలో ముగ్గురు బాలురు
స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి సమీపంలోని మత్య గెడ్డ చిన్నారుల పాలిట మృత్యుకూపంగా మారింది. ఈత కొట్టేందుకు ఉత్సాహంగా వెళ్లిన కోడా ప్రదీప్ (9), పాంగి శ్రీను (10), జలంగి హర్షిత్ (10) నీటిలో దిగారు. అయితే, అక్కడ లోతైన ఊబి ఉండటంతో వారు దానిలో చిక్కుకుపోయారు. బయటపడటానికి వారు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఊపిరాడక ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.
మిన్నంటిన రోదనలు - విషాదంలో పర్రెడ
ఒకేసారి ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటంతో పర్రెడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు శవాలై రావడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు వింటున్న గ్రామస్తులు కంటతడి పెడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తల్లిదండ్రులకు హెచ్చరిక
ఈత సరదాగా వెళ్లి ఇలా నిండు ప్రాణాలు బలికావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వర్షాకాలం తర్వాత వాగులు, గెడ్డల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటమే కాకుండా అడుగున ప్రమాదకరమైన ఊబి పేరుకుపోయే అవకాశం ఉంటుంది. పిల్లలు ఇలాంటి చోట్లకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వారిని ఒంటరిగా నీటి వనరుల వద్దకు పంపకూడదని ఈ ఘోర కలి హెచ్చరిస్తోంది.
Read More
Next Story