యాదవులపై ఒక్క సారిగా ఇంత ‘ప్రేమ’ ఎందుకొచ్చిందీ?
x

యాదవులపై ఒక్క సారిగా ఇంత ‘ప్రేమ’ ఎందుకొచ్చిందీ?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పటి వరకు చక్రం తిప్పిన రెడ్డి, కమ్మ, కాపు కులాల పక్కన యాదవ కులం వచ్చి చేరడం అనివార్యంగా మారింది.



ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు ఎక్కువుగా కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య కులాల చుట్టూ తిరిగేవి. తర్వాత ఆ స్థానంలో కాపు సమాజిక వర్గం వచ్చి చేరింది. తాజాగా వీటి సరసన మరొక కులం వచ్చి చేరడం అనివార్యంగ మారింది. ప్రతి నియోజక వర్గంలో యాదవ ఓటర్లు ఉండటం, కొన్ని చోట్ల డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌గా ఉండటంతో యాదవ కులానికి అలాంటి పరిస్థితులు ఏర్పడక తప్ప లేదు. అంటే రాజకీయ నాయకులు వారి అవసరం నిమిత్తం ఆ కులం నేతలకు ప్రాధానత్య ఇచ్చినా లేదా ఆ కులం అవసరం రాజకీయ నాయకులకు ఏర్పడినా ఆ కులానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించడం మాత్రం అనివార్యంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటర్లుగా ఉండటంతో బీసీల వద్దకు టీడీపీ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే దీనిపైన వైఎస్‌ జగన్‌ కన్నేశారు. ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్‌ నుంచి వైఎస్‌ఆర్‌సీపీకి కన్వర్ట్‌ అవుతారని బలంగా నమ్మిన జగన్‌ బీసీలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహాలు రచించారు. అందులో భాగంగా బీసీల్లో బలమైన సామాజిక వర్గంగా గుర్తింపు ఉన్న యాదవ కమ్యునిపై కన్నేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వీరు సుమారు 9 శాతం వరకు ఉంటారు. దీంతో వీరికి ప్రాధానత ఇవ్వాలని ఎత్తుగడ వేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఇదే సూత్రాన్ని అమలు చేశారు. 2024 ఎన్నికల్లో అయితే కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఉన్న నియోజక వర్గాల్లో వారిని పక్కన పెట్టి మరీ యాదవ నేతలకు అభ్యర్థులుగా దింపారు. నరసరావుపే, ఏలూరు పార్లమెంట్‌ నియోజక వర్గాల్లో ఎప్పటి నుంచో ఆ రెండు సామాజిక వర్గాల వారిదే పైచేయి. ఏలూరులో కమ్మ సామాజిక వర్గం ఆదిపత్యం ఉండగా, నరసరావుపేట పార్లమెంట్‌లో కమ్మ, రెడ్డిల ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. అయితే ఈ సారి ఈ రెండు వర్గాలను కాదని యదవ నేతలకు ఇక్కడ రంగంలోకి దింపారు. నరసరావుపేటలో అనిల్‌కుమార్‌ యాదవ్, ఏలూరు నుంచి కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌ను రంగంలోకి దింపారు. ఇదే సూత్రాన్ని చంద్రబాబు కూడా అమల్లోకి తెచ్చారు. దాదాపు 450కిమీ దూరంలో ఉన్న కడప నుంచి పుట్టా మహేష్‌కుమార్‌ యాదవ్‌ను తీసుకొచ్చి ఏలూరు పార్లమెంట్‌లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దింపారు.
కమ్మ అడ్డాలో యాదవ నేత
మైలవరం ఎప్పటి నుంచో కమ్మ సామాజి వర్గం నేతలకు అడ్డా. వీరిని కాదని పోటీ చేసి నెగ్గడం అంత తేలిక కాదు. అయితే జగన్‌ ఇక్కడ రెండు ప్రయాగాలు చేశారు. 2014లో గౌడ్‌ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్‌తో ప్రయోగం చేసిన జగన్‌ ఈ సారి యాదవ నేతను రంగంలోకి దింపారు. 2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను పోటీలో పెట్టారు. ఇక్కడ టీడీపీ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వసంత కృష్ణప్రసాద్‌ను పోటీ పెట్టింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టీడీపీలోకి వెళ్లడంతో మరో యాదవ నేతకు అవకాశం కల్పించాలని ఉద్దేశంతో జగన్‌ ఈ ప్లాన్‌ చేశారు.
కనిగిరిలో కూడా కమ్మ, రెడ్డిలదే రాజ్యం
రెడ్డి, కమ్మలు గెలిచిన ప్రకాశం జిల్లా కనిగిరిలో కూడా యాదవ నేతను పోటీలో పెట్టారు. 2024లో దుద్దాల నారాయణ యాదవ్‌ను రంగంలోకి దింపారు. గత రెండు ఎన్నికల్లో కూడా యాదవులకే ఇక్కడ చాన్స్‌ ఇచ్చారు. 2019లో సక్సెసయ్యారు జగన్‌. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి నలుగురు యాదవ నేతలు గెలుపొందారు. 2014లో ముగ్గురు యాదవ నేతలు గెలిచారు. వీరిలో ఇద్దరు టీడీపీ నుంచి ఒకరు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గెలుపొందారు. గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు, తంబళ్లపల్లె నుంచి శంకర్‌ యాదవ్, నెల్లూరు సిటీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్‌కుమార్‌ యాదవ్‌లు గెలిచారు.
నలుగురు యాదవ నేతలు
2024 ఎన్నికల్లో నలుగురు యాదవ నేతలకు అసెంబ్లీల్లోను, ఇద్దరు యాదవ నేతలకు పార్లమెంట్‌లోను జగన్‌ చాన్స్‌ ఇచ్చారు. తణుకు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మైలవరం నుంచి సర్నాల తిరుపతిరావు యాదవ్, కనిగిరి నుంచి దుద్దాల నారాయణ యాదవ్, కందుకూరు నుంచి బుర్రా మధుసూధన్‌ యాదవ్‌ను రంగంలోకి దింపారు.
టీడీపీ నుంచి ఐదుగురు నాయకులు
తెలుగుదేశం పార్టీ ఈ సారి ఐదు అసెంబ్లీ నియోజక వర్గలు, ఒక పార్లమెంట్‌లో యాదవ నేతలను బరిలో దింపింది. మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను, తుని నుంచి యనమల దివ్యను, చీరాల నుంచి మద్దులూరి మాలకొండయ్య యాదవ్‌ను, నూజివీడు నుంచి కొలుసు పార్థసారధిని, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావును పోటీలో పెట్టింది. ఇక ఏలూరు పార్లమెంట్‌ స్థానం నుంచి పుట్టా మహేష్‌ యాదవ్‌ను రంగంలోకి దింపింది. అయితే యాదవ సామాజిక వర్గం నుంచి టెకెట్లు దక్కించుకున్న వారిలో ముగ్గురు యనమల రామకృష్ణుడు కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇక జనసేన కూడా ఒక యాదవ నేతను పోటీలో పెట్టింది. విశాఖపట్నం సౌత్‌ నుంచి వంశీకృష్ణ యాదవ్‌ను రంగంలోకి దింపింది.
Read More
Next Story