హైదరాబాద్ చరిత్ర గతిని మార్చిన మూసీ నది
x
మూసీ నదీ : సుందరీకరణ పనులు షురూ

హైదరాబాద్ చరిత్ర గతిని మార్చిన మూసీ నది

మూసీ వరద విపత్తు నుంచి పునర్జీవం దాకా...


సరిగ్గా 117 ఏళ్ల క్రితం...అది 1908వ సంవత్సరం సెప్టెంబరు 25వతేదీ...ఆ రోజు హైదరాబాదీలకు కాళరాత్రి. అప్పట్లో నగరంలో కేవలం 24 గంటల్లో 12.8 సెంటీమీటర్లు, 48 గంటల్లో 19.90 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంతే మూసీనది పొంగి ప్రవహించింది.


మూసీ వరదల విషాదం
హైదరాబాద్ చరిత్ర పుటల్లో 1908వ సంవత్సరంలో సంభవించిన మూసీ వరదల విషాద ఘటన చిరస్థాయిగా నిలిచింది.1908 మూసీ నది వరదల విధ్వంసం 117వ వార్షికోత్సవం రేపు హైదరాబాద్ నగరంలో జరగనుంది. ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25వతేదీన అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో గ్రేట్ టమరిండ్ ట్రీ కింద స్మారక, సంఘీభావ సమావేశాన్ని నిర్వహించింది.తాము గడచిన 17 ఏళ్లుగా చింత చెట్టు వద్ద సంఘీభావ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మణికొండ వేదకుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మూసీకి వచ్చిన వరద విపత్తు ఫొటో క్రెడిట్ : ఆసిఫ్ అలీఖాన్


15వేల మంది మృతి

నాటి మూసీ వరదల్లో 15వేల మంది నగర ప్రజలు వరదనీటిలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. వరదల వల్ల వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.నాటి మూసీ వరదలు హైదరాబాద్ పరిపాలకు మేల్కొలుపుగా నిలిచింది.1914వ సంవత్సరంలో సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డును నిజాం ఏర్పాటు చేశారు.నాటి వరదల్లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. నాటి వరదలు నగర ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది.ప్రముఖ ఉర్దూ కవి అమ్జాద్ హైదరాబాదీ తన తల్లి, భార్య , కుమార్తెతో సహా తన మొత్తం కుటుంబాన్ని వరదలో కొట్టుకుపోవడాన్ని చూశారు.

సిటీ ఇంప్రూవ్ ట్రస్ట్‌ ఏర్పాటు
సయ్యద్ అజామ్ హుస్సేని 1909 అక్టోబర్ 1వతేదీన వరదలు పునరావృతం కాకుండా నిరోధించడం, పౌర సౌకర్యాలను మెరుగుపరచడంపై సిఫార్సులతో తన నివేదికను సమర్పించారు. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1912లో సిటీ ఇంప్రూవ్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాడు. అతను నదిపై వరద నియంత్రణ వ్యవస్థను నిర్మించాడు. నాటి వరదలు పునరావృతం కాకుండా నిజాం మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆహ్వానించి జంట జలాశయాలను నిర్మించారు.

కొట్టుకుపోయిన వంతెనలు
నాటి వరదల్లో తన కుటుంబంలో అతను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.అఫ్జల్ జంగ్, చాదర్ ఘాట్, ముసల్లం జంగ్ వంతెనలు కొట్టుకుపోయాయి. నాటి వరదల్లో పురానాపూల్ వంతెన ఒక్కటే అనుసంధానంగా నిలిచింది. నాడు మూసీ వరదల నివారణకు జంట జలాశయాలను నిర్మించాలని అప్పటి గొప్ప ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశరయ్య సూచించారు. మూసీ నదికి వరదలు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా అప్పట్లో నిజాం నవాబు మూసీ నదీ ఎగువన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మంచినీటి సరస్సులను నిర్మించారు. ఈ సరస్సులు నేటికి హైదరాబాద్ నగరానికి మంచినీరు అందించడంతోపాటు మూసీ నదిలో వరదలు తలెత్తకుండా రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. నాటి మూసీ వరదలు నగర రూపురేఖలను మార్చాయి.

రాజభవనంలోనే ప్రజలకు ఆశ్రయం
నాటి మూసీ వరదల్లో ముంపునకు గురైన ఇళ్ల బాధితులకు నిజాం తన రాజభవనం ద్వారాలు తెరచి అందులో ఆశ్రయం కల్పించారు. వరద విపత్తు సమయంలో పదిరోజుల పాటు అధికారిక సెలవు ప్రకటించి నగరంలో పది వంటశాలలు ఏర్పాటు చేసి బాధితులకు భోజనాలు పెట్టారు.

మూసీలో నిజాం శాంతి పూజలు
హిందూ సంప్రదాయం ప్రకారం నదులను దేవతలుగా భావిస్తుంటారు. ఉప్పొంగుతున్న మూసీని శాంతింపచేయాలని అప్పటి నిజాం ఆస్థాన జ్యోతిష్కుడు ఝుమర్ లాల్ తివారీ అప్పటి నిజాం మహబూబ్ అలీఖాన్ కు సలహా ఇచ్చారు. దీంతో 1908 సెప్టెంబరు 28వతేదీన నిజాం ధోతి ధరించి హిందూ మతపరమైన ఆచారాల ప్రకారం మూసీ నదికి పండ్లు, పూలు, కొబ్బరికాయలు, పట్టుచీర,ముత్యాలు, బంగారంతో పూజలు చేసి మూసీని శాంతింపజేశారని చెబుతుంటారు.

మూసీలో మూడు సార్లు ప్రవహించిన వరదనీరు
ఈ ఏడాది తాజాగా మూసీనది ఎగువ పరివాహక ప్రాంతంలో భారీవర్షాలు కురవడంతో మూడు సార్లు మూసీ నది పొంగింది. అయితే నగరానికి ఎగువన ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. వరదనీరు ఎక్కువగా రావడంతో మూసీ నదిలోకి రెండు సరస్సుల గేట్లు ఎత్తి దిగువకు వరదనీటిని వదిలారు. మూసీ నదీ పొంగి ప్రవహించడంతో మూసీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. చాదర్ ఘాట్ వద్ద మూసీ నదిపై ఉన్న లో లెవెల్ వంతెన పైనుంచి వరదనీరు పారింది.

మూసీ తీరంలో ఆక్రమణలు
మూసీ నదికి వరదలు రాకుండా ఎగువ ప్రాంతంలో జంట జలాశయాలను నిర్మించి వరద సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొన్నారు. అయితే కాలక్రమేణా ప్రజలు మూసీ నదీ గర్భంలో ఇళ్లు, దుకాణాలు, గోదాములను నిర్మించడంతో కొత్త సమస్యలు ఏర్పడ్డాయి.అధిక వర్షాలతో మూసీ నదిలో వరదనీరు వచ్చినపుడల్లా మూసీ తీరంలో ఉన్న ఇళ్లు నీట మునుగుతున్నాయి. మూసీ నదీ గర్భంలోనే కాకుండా బఫర్ జోన్ లో ఆక్రమించి ఇళ్లు నిర్మించారు. దీని వల్ల వరద ముంపు సమస్యలు ఏర్పడుతున్నాయి. లంగర్ హౌస్ నుంచి చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ ప్రాంతాల్లో మూసీ తీరంలో ఇళ్లు వెలిశాయి.

కాలుష్య కాసారంగా మూసీ
హైదరాబాద్ నగరంలోని మూసీ నదీ తీర ప్రాంతంలోని పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం మూసీలోకి కలుస్తుంది. దీంతో మూసీ నది కాస్తా కాలుష్య కాసారంగా మారింది. డ్రైనేజీ నీరు కూడా మూసీలో కలుస్తుండటంతో తీవ్ర దుర్గంధం వెలువడుతుంది.

నాటి మూసీ వరదల్లో 150 మందిని రక్షించిన చింత చెట్టు


150 మంది ప్రాణాలు కాపాడిన చింతచెట్టు

నాటి మూసీ వరదల నుంచి తమను తాము కాపాడుకునేందుకు 150 మంది ప్రజలు అఫ్టల్ గంజ్ ప్రంతంలోని ఎతైన చింత చెట్టుపైకి ఎక్కారు. అంతే ఆ చింత చెట్టు 150 మంది ప్రాణాలను కాపాడింది. నాటి ఘటన గుర్తుగా ఈ చింత చెట్టు వద్ద బోర్డు వేలాడదీశారు.అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలోని చింతచెట్టు వరదల సమయంలో 150 మందికి పైగా ప్రాణాలను కాపాడింది.దీంతో 17 సంవత్సరాలుగా ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్, సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్ అండ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్‌ గ్రేట్ టమరిండ్ ట్రీ కింద స్మారక, సంఘీభావ సమావేశాన్ని నిర్వహిస్తోంది.

చింతచెట్టు చెంత సంఘీభావ సమావేశం
నాటి మూసీ వరదల ముప్పు నుంచి 150 మంది నగర ప్రజల ప్రాణాలను కాపాడిన అఫ్జల్ గంజ్ ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలోని చింతచెట్టు సాక్షిగా నగరంలోని చరిత్రకారులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు గురువారం సంఘీభావంగా సమావేశం అయ్యారు. నాటి మూసీ వరద విపత్తు, దాని ప్రభావంపై చరిత్రకారులు మాట్లాడుకున్నారు.వరదల సమయంలో 150 మంది ప్రాణాలు కాపాడిన చింతచెట్టు చారిత్రక ప్రాముఖ్యతను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చింతచెట్టు వద్ద నగర పౌరులు మొక్కలు నాటారు.


మూసీ ప్రక్షాళనపై కొత్త ఆశలు

నాటి మూసీ వరదల నుంచి నేటి మూసీ ప్రక్షాళన, ఆధునికీకరణ ప్రాజెక్టు దాకా హైదరాబాద్ చరిత్రలో మూసీని విడదీసి చూపించలేం. మూసీతో ముడిపడిన హైదరాబాద్ ప్రస్థానం ప్రక్షాళనతోనైనా నగర రూపురేఖలు మారుతాయని నగర ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తుంది.

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్
మూసీ నదీ తీర ప్రాంతంలోని ఆక్రమణలను తొలగించి, కలుషితమైన మూసీనదిని ప్రక్షాళన చేసి, గోదావరి నది నీటిని మూసీలోకి తరలించడం ద్వారా నగరం నడిబొడ్డున ఉన్న మూసీ నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి వినూత్న ప్రణాళికను రూపొందించారు.

మూసీ ప్రక్షాళనకు తొలి అడుగు
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మూసీ నదీ కాలుష్య కాసారంగా మారి తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్న నేపథ్యంలో దీన్ని ప్రక్షాళన చేసి, గోదావరి జలాలను ఈ నదిలో పారించి పునరుజ్జీవింపజేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు తొలి అడుగు పడింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ లో రూ.375 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే మూసీ నదీ తీరంలోని ఆక్రమణలను సగం తొలగించింది.

మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు రూ.4,100 కోట్ల రుణం

మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు రూ.4,100 కోట్ల రుణం ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ అంగీకరించింది. నదిలో పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులు చేపట్టారు. నదికి ఇరువైపులా రోడ్లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. డ్రైనేజీ నీరు వేరు చేసి వెళ్లేందుకు వీలుగా ఇంటర్ సెప్టర్ ఛానెల్ నెట్ వర్క్ పద్ధతిలో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.


Read More
Next Story