అందరిలోకి ఆమె సూపర్‌ రిచ్‌
x

అందరిలోకి ఆమె సూపర్‌ రిచ్‌

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. అదే పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల కంటే ఆమె ఆస్తులే ఎక్కువ.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకుల కంటే ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లలో జనసేన పార్టీ అభ్యర్థికి అధిక ఆస్తులు చూపించడం తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నామినేషన్‌లు ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులందరూ తమ ఆస్తుల వివరాలను కూడా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దాఖలు చేసిన వారందరికంటే లోకం మాధవి ఆస్తులే అధికంగా ఉండటం విశేషం. ఎన్నికల సంఘానికి ఆమె సమర్పించిన అఫిడవిట్లో రూ. 894.92 కోట్లు ఆస్తులున్నట్లు ప్రకటించారు. వీటిల్లో మిరాకిల్‌ పేరుతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, విద్యా సంస్థలు, భూములు, ఆభరణాలు, నగదు, బ్యాంకు డిపాజిట్లు వంటి ఉన్నాయని వెల్లడించారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ విలువ ఎక్కువుగా ఉందని సమర్పించారు. బ్యాంక్‌ ఖాతాలో రూ. 4.45 కోట్లు, నగదు రూపంలో రూ. 1.15లక్షలు, చరాస్తులు రూ. 856.57 కోట్లు, స్థిరాస్తులు రూ. 15.70 కోట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు వివరాలు అందజేశారు. అప్పులు కూడా ఉన్నాయని, రూ. 2.69 కోట్లు వరకు అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లు సమర్పించారు. ఆమె నెల్లిమర్ల నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం, బిజెపీ, జనసేన పొత్తుల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా లోకం మాధవి బరిలోకీ దిగారు.

నారా లోకేష్‌ వద్ద చంద్రబాబు అప్పు
అధికంగా ఆస్తులు కలిగిన వారిలో లోకం మాధవి తర్వాత రెండో స్థానంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిలచారు. ఇటీవల ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో వివరాలను వెల్లడించారు. రూ. 810.37 కోట్లు వరకు చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు పేరుతో స్థిరాస్తుల విలువ రూ. 36.31 కోట్లు, భువనేశ్వరికి రూ. 85.10 కోట్లు స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. 1994లో కొనుగోలు చేసిన అంబాసిడర్‌ చంద్రబాబుకు ఉండగా భువనేశ్వరికి సొంత వాహనం లేదని ప్రకటించారు. గత ఐదేళ్లలో వీరి ఆస్తులు 39 శాతం పెరిగాయి. 2019లో రూ. 668 కోట్లు ఉండగా, నేడది రూ. 931 కోట్లకు చేరుకుంది. చంద్రబాబు కంటే భువనేశ్వరికే ఆస్తులు ఎక్కువుగా ఉన్నాయి. చంద్రబాబు చరాస్తుల్లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్లో 2,26,11,525 షేర్ల విలువ రూ. 763.93 కోట్లు వరకు ఉంది. అప్పులు రూ. 6.83 కోట్లు చూపించారు. దీనిలో కుమారుడు లోకేష్‌ నుంచి రూ. 1.27 కోట్లు అప్పు తీసుకున్నట్లు వెల్లడించారు.
వేమిరెడ్డి ప్రభావకర్‌రెడ్డికి 19 కార్లు
ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో అత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థుల్లో నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మూడో స్థానంలో నిలచారు. రూ. 715.62 కోట్లు ఆస్తులను కలిగి ఉన్నట్లు ఆయన ఆఫిడవిట్‌లో ప్రకటించారు. ఆయన భార్య నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరుతో రూ. 76.35 కోట్లు, ప్రభాకర్‌రెడ్డి పేరుతో రూ. 639.26 కోట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. అప్పులు సుమారు రూ. 197.29 కోట్లు ఉన్నట్లు వివరించారు. బ్యాంకు అకౌంట్లలో రూ. 1.17 కోట్లు ఉండగా, బాండ్లు, షేర్ల రూపంలో రూ. 10.62 కోట్లు ఉన్నాయి. వీరికి రూ. 6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నాయని సమర్పించారు.
Read More
Next Story