
‘అభివృద్ధి పనులకు రూ.1362 కోట్లు కేటాయించాం’
ధను జాతరలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి వెల్లడి
ఒడిశా(Odissa) రాష్ట్రం బర్గఢ్ పట్టణంలో ఏటా సాంస్కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. డిసెంబర్–జనవరి మాసాల్లో నిర్వహించే ఈ ధను జాతర ఉత్సవాలకు ప్రత్యేకంగా అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇక్కడ ఉంది. ఈ ఉత్సవంలో కృష్ణ లీలలు ప్రధానాంశం. బర్గఢ్ పట్టణం గోకులం, అంబాపాలి గ్రామం మథురగా మారుతుంది. ప్రజలే పాత్రధారులు. కంసుడి పాత్ర ప్రత్యేక ఆకర్షణ. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు.. ఒడిశా ప్రజల సంస్కృతి, ప్రజానాట్య సంప్రదాయాలకు ప్రతీక.
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి(Chief Minister Mohan Charan Majhi) మంగళవారం ఓపెన్-ఎయిర్ థియేటర్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని 'కళింగ చక్రవర్తి' అని సంబోధించిన కంస రాజు.. బర్గఢ్ అభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించాలని కోరారు.
అందుకు సీఎం సమాధానమిస్తూ.. రాష్ట్రంలో రూ.1362కోట్లతో 123 అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. బర్గఢ్ జిల్లాలో రూ.980.58 కోట్ల విలువైన 85 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయని, రూ.382.26 కోట్ల విలువైన 38 ప్రాజెక్టులను ప్రారంభించామని ముఖ్యమంత్రి తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి.. సుభద్ర యోజన కింద బర్గఢ్‌లోని 3,41,614 మంది మహిళలు ఒక్కొక్కరికి రూ. 10,000 ఆర్థిక సహాయం పొందారని చెప్పారు. 2024-25 ఖరీఫ్, రబీ సీజన్లలో 2,41,135 మంది రైతుల నుంచి దాదాపు 13.99 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ జరిగిందని, మొత్తం రూ. 4,338 కోట్ల ఇన్‌పుట్ సహాయం అందించామని చెప్కపారు.
సాంస్కృతిక ఉత్సవానికి రాష్ట్ర గ్రాంట్‌ను రూ. కోటి నుంచి 1.5 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. 200 మంది ప్రముఖ కళాకారులను ఒక్కొక్కరికి రూ. 10 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఉత్సవానికి యునెస్కో గుర్తింపు లభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

