269 చెరువులకు ఎఫ్‌టీఎల్,బఫర్‌ జోన్ల గుర్తింపు
x

269 చెరువులకు ఎఫ్‌టీఎల్,బఫర్‌ జోన్ల గుర్తింపు

హెచ్ఎండీఏ‌లోని చెరువుల్లో అధికారులు సర్వే చేశారు.చెరువుల ఫుల్‌ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్‌ల నోటిఫికేషన్ జారీ చేశారు.చెరువుల్లో ఆక్రమణలను గుర్తిస్తున్నారు.


హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో 51 చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ లకు సంబంధించి తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. నవంబరు 1వతేదీలోగా మరో 200 చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నోటిఫై చేస్తామని హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ వెల్లడించారు.హెచ్ఎండీఏ అధికారులు గత నెల రోజుల్లో 65 చెరువులను సర్వే చేశారని ఆయన పేర్కొన్నారు. 269 చెరువులకు చెందిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ల గురించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశామని కమిషనర్ వివరించారు.


13 చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో 1100 అక్రమ భవనాలు
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో చెరువులఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో 1100 అక్రమ భవనాలను అధికారుల సర్వేలో గుర్తించారు.మాదాపూర్ దుర్గం చెరువు ఎఫ్‌దతటీఎల్, బఫర్ జోన్ల పరిధిలో 204 భవనాలు నిర్మించారని తేలింది. చెరువుల్లో నిర్మించిన అక్రమ భవనాలను కూల్చివేసేందుకు వీలుగా వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఉస్మాన్ సాగర్ ఆక్రమణలపై వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
ఉస్మాన్ సాగర్ సరస్సు ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ల పరిధి చిత్రపటాలు, ఆక్రమణల గురించి సమగ్ర వివరాలు సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ వినోద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని ఖానాపూర్ ప్రాంతానికి చెందిన గవ్వ విద్యాసాగర్ రెడ్డి, శ్రీరమనేని అనుపమలకు హైడ్రా అధికారులు అక్రమంగా చెరువు ప్రాంతాల్లో భవనాలు నిర్మించారని కూల్చివేత నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించగా జడ్జి జస్టిస్ వినోద్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల వివరాలు సమర్పించాలని హైకోర్టు కోరింది.

తన చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్న జడ్జి
సరస్సుల ఆక్రమణలపై నోటీసుల జారీ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ టి వినోద్ కుమార్ తన స్వగ్రామం జన్వాడ గ్రామం పక్కనే ఉందని ఆయన చిన్ననాటి పాఠశాలలో చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు. వర్షాకాలంలో తాను తన స్వగ్రామానికి వెళ్లాలంటేనే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవని జడ్జి ప్రస్థావించారు. తెలంగాణ రాష్ట్రంలో నిజాం కాలం నాటి 43వేల చెరువులను సర్వే చేసి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల వివరాలను హైకోర్టుకు సమర్పించాలని జడ్జి జస్టిస్ టి వినోద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఉస్మాన్ సాగర్ వివరాలు
నిజాం హయాంలో నిర్మించిన ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ 46 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉందని నాడు ఉర్దూ భాషలో రాసిన పత్రాల్లో ఉంది. ఉస్మాన్ సాగర్ జలాశయం ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ల వివరాలను 1970వ సంవత్సరంలో అప్పటి పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ ఉర్దూ నుంచి ఇంగ్లీషు భాషలో అనువదించి నోటిఫై చేసింది. ఈ సరస్సు రికార్డులు నీటిపారుదల శాఖ వద్ద ఉన్నాయి. ఈ సరస్సు వివరాలు హెచ్ఎండీఏ వద్ద కూడా ఉన్నాయి.

నిండుకుండలా 33 చెరువులు
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని పలు చెరువులు నిండిపోయాయి. 33 చెరువులు నిండటంతో వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నామని జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు చెప్పారు. హుస్సేన్‌సాగర్‌ 513.41 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో స్లూయిస్ గేట్లను ఎత్తివేశారు.

హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్
భారీవర్షాలు, వరదల కారణంగా హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చి వేతలకు బ్రేక్ ఇచ్చింది.ఫిర్యాదులు రావడంతో అమీన్ పూర్ గ్రామంలోని ఐలాపూర్ తండాల్లో వేసిన ప్లాట్ల వెంచరును మంగళవారం అధికారులు కూల్చివేశారు.హైడ్రా బృందాలు జీహెచ్ఎంసీ మాన్‌సూన్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. వర్షాలు తగ్గిన తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చివేత పనులు మళ్లీ మొదలుపెడతామని ఆయన పేర్కొన్నారు.భారీవర్షాలు, వరదల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించి, అక్రమ నిర్మాణాలను పరిశీలిస్తున్నారు.. చెరువుల, కుంటల పక్కన ఉన్న కాలనీల్లో బాధితుల పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకుంటున్నారు.మరోవైపు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో పర్యటిస్తూ అక్రమ నిర్మాణాలకు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.



Read More
Next Story