
స్వదేశంలో ఒత్తిడి లేదు, కానీ అదృష్టం అవసరం: ద్రవిడ్
భారత్–శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు.
భారత్–శ్రీలంక(Bharat-Srilanka) సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) అభిప్రాయపడ్డారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్‌నే ఫేవరెట్‌గా పేర్కొన్న ఆయన, అయితే కొంత అదృష్టం కూడా అవసరమని అన్నారు.
‘ది ఫెడరల్’తో ప్రత్యేకంగా మాట్లాడిన ద్రవిడ్, 2024లో భారత్ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచినప్పుడు తాను కోచ్‌గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. స్వదేశంలో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టుపై ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పారు.
“భారత జట్టు చాలా మంచి క్రికెట్ ఆడుతోంది. జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. కానీ టీ20 క్రికెట్‌లో ఏదైనా జరగవచ్చు. సెమీ ఫైనల్ లేదా ఫైనల్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమూ ఉంటుంది” అని ద్రవిడ్ వ్యాఖ్యానించారు.
సీనియర్ జర్నలిస్ట్ ఆర్. కౌశిక్ రచించిన ‘ది రైజ్ ఆఫ్ ది హిట్‌మాన్ – ది రోహిత్ శర్మ స్టోరీ’ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా బెంగళూరులో ‘ది ఫెడరల్’తో మాట్లాడుతూ, “మనమందరం జట్టు వెనుక ఉన్నాం” అని తెలిపారు.
స్వదేశంలో ఆడటం వల్ల ఒత్తిడి ఉంటుందా అనే ప్రశ్నకు స్పందిస్తూ, “నాకు అలా అనిపించడం లేదు” అని ద్రవిడ్ స్పష్టం చేశారు. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే ఈ టోర్నీ మార్చి 8న ముగుస్తుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను యూఎస్ఏతో ఆడనుంది. ఆతిథ్య భారత్ గ్రూప్-ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో పాకిస్తాన్, నమీబియా, యూఎస్ఏ, నెదర్లాండ్ జట్లు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, టీ20 ప్రపంచకప్‌కు ముందు ఒక వివాదం చోటు చేసుకుంది. భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ భారతదేశానికి రావడానికి నిరాకరించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తిరస్కరించింది. ఐసీసీ నిర్ణయం మేరకు, ఈ టోర్నీలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టు పాల్గొననుంది.

