
విశాఖ కేజీహెచ్ లో అవయవదానంపై నర్సులతో అవగాహన కార్యక్రమం
అవయవాలు దానమిచ్చి రోగులకు పునర్జన్మ ప్రసాదిద్దాం
తెలంగాణలో అవయవ దాన చైతన్య ఉద్యమం
తెలంగాణ రాష్ట్రం అవయవదానంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ స్ఫూర్తితో అవయవదానాన్ని (Human Organ Donation) మరింత ప్రోత్సహించేందుకు పూర్వ జిల్లా కేంద్రాల్లోనూ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయాలని తాజాగా వైద్య శాఖ నిర్ణయించింది. దీనివల్ల అవయవాలు దెబ్బతిని మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎదురు చూస్తున్న రోగులకు వైద్యశాఖ తీపి కబురు చెప్పింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తెలంగాణలో జీవన్ దాన్ కు జై
తెలంగాణ రాష్ట్రంలో జీవన్‌దాన్ పథకం (Jeevandan) కింద అవయవాల మార్పిడిని మరింత సులభతరం చేయాలని నిర్ణయించారు. రోగాల బారిన పడి అవయవాలు చెడిపోయి అవయవదానం కోసం ఎదురుచూస్తున్న రోగులకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ శుభవార్త వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోనే కాదు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. అవయవదానాన్ని జిల్లా ఆసుపత్రులకు విస్తరించాలని నిర్ణయించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవమార్పిడి సర్జరీలను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకున్నారు. స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ ను కొత్తగా ఏర్పాటు చేసి అవయవదానాన్ని ప్రభుత్వ దవాఖాన్లలో అవయవ మార్పిడి చికిత్సలను ప్రోత్సహించనున్నారు.
ప్రభుత్వ హాస్పిటళ్లలో అవయవమార్పిడి చికిత్సలు
వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్‌లో అవయవాల ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు చేయనున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవమార్పిడి చికిత్సలను ప్రోత్సహించేందుకు సర్కార్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎక్స్ పోస్టులో వెల్లడించారు. ఆర్గాన్ డోనర్ల కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియాతో పాటు ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎంలోనూ అవయవమార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.సీనియర్ డాక్టర్లతో డెడికేటెడ్ టీమ్స్ ఏర్పాటు చేయాలని, ఒక్కో ఆర్గాన్‌కు ఒక్కో టీమ్ ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తుకు సూచించారు.ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవమార్పిడి సర్జరీలను ప్రోత్సహించే విధంగా ఈ బృందాలు పనిచేయాలని మంత్రి కోరారు.
ఆర్గాన్ డోనర్ల దహన సంస్కారాలకు ఆర్థిక సాయం
ఆర్గాన్ డోనర్ల దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని వైద్య శాఖ అధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో జరుగుతున్న అవయవమార్పిడి సర్జరీలపై నిరంతరం నిఘా పెట్టాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.నిబంధనలు ఉల్లంఘించే హాస్పిటళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు.
అవయవదానంపై కొత్త చట్టం
అవయవదానంపై కేంద్ర చట్టాన్ని అడాప్ట్ చేసుకునేందుకు వీలుగా స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా కొత్త నిబంధనలను రూపకల్పన చేయనున్నారు. ఈ చట్టం ప్రకారం సొంత కుటుంబ సభ్యులతో పాటు,గ్రాండ్ పేరెంట్స్ కూడా అవయవాలు డొనేట్ చేసేందుకు, స్వీకరించేందుకు అర్హులేనని ఈ నిబంధనను అమలు చేస్తున్నామని తెలంగాణ ఆరోగ్యశాఖ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ చెప్పారు.తోట యాక్ట్ ప్రకారం ఆర్గాన్ స్వాపింగ్‌కు కూడా అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని ఆమె వివరించారు. ఈ యాక్ట్ ప్రకారం ఇరువురు పేషెంట్ల కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఆర్గాన్స్ డొనేట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు
అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జీవన్‌దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దీనికోసం ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల సహకారం తీసుకుంటామని ఆయన తెలిపారు. అవయవదాతల కుటుంబసభ్యులకు అండగా నిలుస్తామని డాక్టర్ పేర్కొన్నారు. బ్రెయిన్ డెత్ అయిన వారి అవయవాలను ఇతరులకు డొనేట్ చేసి ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలను అందరూ అభినందించాలని డాక్టర్ సూచించారు. దాతలకు తాము సన్మానాలు చేస్తున్నామని చెప్పారు. అవయవ దానంపై సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపుతామని ఆయన వివరించారు.
అవయవ దానాన్ని మహోద్యమంలా చేపట్టండి
అవయవ దానాన్ని మహోద్యమంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని అఖిలభారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు గూడూరు సీతామహాలక్ష్మీ సూచించారు. అవయవ దాతల అంత్య క్రియలు ప్రభుత్వ లంఛనాలతో నిర్వహించే ఉత్తర్వులను విడుదల చేయాలని ఆమె కోరారు.ఇప్పటికే పలు దక్షిణాది రాష్ట్రాల్లో అంత్యక్రియలు చేస్తున్నారని ఆమె చెప్పారు. మెడికల్ కళాశాలలకు శరీర దానం చేస్తే ఆయా కళాశాలల నుంచి వ్యాన్లు వచ్చి అందులో గౌరవంగా మృతదేహాలను తీసుకువెళ్లాలని కోరారు. విద్యాసంస్థల్లో ప్రవేశ సమయంలో నింపే దరఖాస్తుల్లో అవయవదానంపై ఒక కాలమ్ పెట్టి వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించాలని కోరారు. డ్రైవింగ్ లైసెన్సులు,ఇతర కార్డుల కోసం దరఖాస్తుల్లో ఆర్గాన్ డోనర్ అవుతారా అనే కాలమ్ పెట్టాలని ఆమె సూచించారు. జనాభా లెక్కల్లోనూ ఆర్గాన్ డొనేషన్ సంసిద్ధతపై ప్రశ్నలు అడగాలని ఆమె డిమాండ్ చేశారు. శరీర అవయవదానం చేసేవారు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ పొందేలా చూడాలన్నారు. పాఠ్యాంశాల్లో అవయదానాన్ని చేర్చి అవగాహన కల్పించడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో అవయవదానాన్ని ప్రోత్సహించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సీతామహాలక్ష్మీ ప్రభుత్వానికి సూచించారు.
ఏడుగురికి ప్రాణదానం
తేదీ 2025,ఆగస్టు 18 : హైదరాబాద్ నగర పరిధిలోని మియాపూర్ జనప్రియా వెస్ట్ సిటీకి చెందిన కృష్ణ సుమంత్ భువనగిరి (37) ప్రైవేటు ఉద్యోగిగా విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి వెళుతుండగా అదుపుతప్పి కింద పడ్డాడు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు చెప్పారు. జీవన్ దాన్ గురించి కృష్ణ సుమంత్ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అంగీకరించడంతో అతని మృతదేహం నుంచి గుండె, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులను సేకరించి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు అమర్చామని జీవన్ దాన్ నోడల్ అధికారి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు చెప్పారు.
ముగ్గురికి పునర్జన్మ
తేదీ 20225 జూన్ 27 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన కావలి శివప్రసాద్ (22)దుండుగుల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శివప్రసాద్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు.అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమారుడు విగత జీవిగా మారినా తట్టుకున్న అతని తండ్రి కావలి నర్హింహులు అతని అవయవాలను దానం చేసి పలువురికి ప్రాణ దానం చేశారు. శివప్రసాద్ లివర్, లంగ్స్, కిడ్నీలను జీవన్ దాన్ సంస్థకు అప్పగించారు. తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లినా, అతని అవయవాలను దానం చేయడం ద్వారా ముగ్గురికి పునర్జన్మ కల్పించడం సంతోషంగా ఉందని కావలి నర్హింహులు చెప్పారు.
అవయవదానంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్
అవయవదానంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. దేశంలో 10లక్షల జనాభాకు సగటున 0.8 శాతం అవయవదానాలు జరగ్గా, తెలంగాణ రాష్ట్రం 4.88శాతం అవయవదానాలతో అగ్రస్థానంలో నిలిచింది. 2013 వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు 1691 మంది బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను వారి కుటుంబసభ్యులు దానం చేయగా 6,372 మంది ప్రాణాపాయ రోగులకు అమర్చడం ద్వారా వారికి పునర్జన్మను ప్రసాదించారు. బ్రెయిన్ డెడ్ అయిన మృతదేహాల నుంచి అవయవాలను సేకరించి వాటిని గ్రీన్ కారిడార్ ద్వారా రోగులున్న ఆసుపత్రులకు హుటాహుటిన తరలించి ట్రాన్స్ ప్లాంట్ చేశారు. 2,538 కిడ్నీలు, 1550 లివర్లు, 230 గుండెలు, 403 ఊపిరితిత్తులు, 14 పంక్రాయీస్, 170 గుండె వాల్వులు, 1467 కార్నియాలను రోగులకు అమర్చారు.
ఏటేటా పెరుగుతున్న అవయవదానాలు
తెలంగాణ రాష్ట్రంలో ఏటేటా అవయవదానాల సంఖ్య పెరుగుతోంది. 2013వ సంవత్సరంలో 189 మందికి అవయవాలను అమర్చగా ఏ యేటి కాఏడు పెరుగుతోంది.జీవన్ దాన్ విభాగం వైద్యాధికారుల కృషితో జీవన్ దాన్ పథకం కింద అవయవాలను దానం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. గత సంవత్సరం 725 మంది రోగులకు అవయవాలను ట్రాన్స్ ప్లాంట్ చేశారు. ఈ ఏడాది ఇప్పటికే 527 మంది రోగులకు అవయవ దానం ద్వారా వైద్యులు ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్రచికిత్సలు చేసి పునర్జన్మ ప్రసాదించారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతుందంటే...
భారతదేశంలో ఏటా 5 లక్షలమంది రోగులు ప్రధాన అవయవాలు పనిచేయక పోవడంతో మరణిస్తున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాలు చెబుతున్నాయి. వీరికి పునర్జన్మ ప్రసాదించాలంటే అవయవదానం చేసేందుకు బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబసభ్యులు ముందుకు రావాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఏ అవయవాలు దానం చేయవచ్చంటే...
మనిషి బ్రెయిన్ డెడ్ అయ్యాక అతని శరీరం నుంచి పలు అవయవాలను దానం చేయవచ్చు. కళ్లు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్దపేగు, చిన్న పేగులు, ఎముకలు, మూలుగును దానం చేయడం ద్వారా ఏడుగురికి పునర్జన్మ ప్రసాదించవచ్చని జీవన్ దాన్ వైద్యులు చెప్పారు.
అవయవాల కోసం రిజిస్ట్రేషన్
అవయవాల కోసం ఎదురుచూస్తున్న రోగులు తమ పేర్లను జీవన్ దాన్ సంస్థ, మోహన్ ఫౌండేషన్ లలో పేర్లను నమోదు చేసుకోవచ్చు. నిమ్స్, ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 23 కార్పోరేట్ ఆసుపత్రుల్లో అవయవాల ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్రచికిత్సలు చేస్తున్నారు.
అవయవాల కోసం రోగుల ఎదురుచూపులు
తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలిక రోగాల వల్ల అవయవాలు చెడిపోయి పలువురు రోగులు మంచాన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్థుతం 3,835 మంది రోగులు అవయవాల దాతల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా 2,715మందికి కిడ్నీలు దెబ్బతినడంతో వారు ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. కిడ్నీలు ఫెయిల్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 926 మంది లివర్ దెబ్బతిన్న రోగులు దాతల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. జీవన్ దాన్ పథకం కింద ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబాలు అవయవాలను దానం చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. 100 మంది రోగులు గుండె కోసం, లంగ్స్ కోసం 79 మంది, పాంక్రియాస్ కోసం 15 మంది రోగులున్నారు. మొత్తం మీద 3,835 మంది రోగులు అవయవాల మార్పిడి కోసం ఎదురు చూస్తూ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు.
తెలంగాణలో అవయవదానం పొందిన రోగుల పట్టిక
సంవత్సరం - అవయవదానం పొందిన రోగుల సంఖ్య
2013 -189
2014 -233
2015 - 364
2016 -411
2017 -563
2018 -573
2019 -469
2020 -257
2021 -616
2022 -716
2023 -729
2024 -725
2025 -527
Next Story