వైఎస్‌ఆర్‌సీపీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గుబులు పట్టుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన జంగా ఆ పార్టీ గెలుపు కోసం పని చేస్తుండటంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతల్లో ఆందోళనలు నెలకొన్నాయి. జంగా కృష్ణమూర్తి బీసీ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీ ఉన్నా, ప్రత్యేకించి పల్నాడు జిల్లా, నరసరావుపే పార్లమెంట్ నియోజక వర్గంలో ఆయన ప్రభావం ఎక్కువుగా కనిపిస్తోంది. జంగా కృష్ణమూర్తి పల్నాడు జిల్లా వాసి కావడం, గురజాల నుంచి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, సుదీర్ఘకాలం పాటుగా ఆయన రాజకీయాల్లో ఉండటం వల్ల ఈ జిల్లాలో జంగా ప్రభావం ఎక్కువుగానే ఉంది. ప్రత్యేకించి వెనుకబడిన తరగతుల వర్గాల్లో అయితే జంగాకు మంచి గుర్తింపు, ఆదరణ ఉంది. సొంత నాయకుడుగా జంగాను బీసీలు అభిమానిస్తారు. ఇటీవలె ఆయన వైఎస్‌సీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో జంగా ప్రభావం పల్నాడు జిల్లాలోని వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులపై ఉంటుందని ఆ పార్టీ నేతలు, శ్రేణులు అంచనా వేస్తున్నారు. టీడీపీలో చేరిన జంగా ఆ పార్టీ గెలుపు కోసం పని చేస్తుండటంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతల్లో ఓటమి భయాందోళనలు నెలకొన్నాయనే టాక్ కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది. ఇదే అంశం ప్రస్తుతం పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు కునుకు లేకుండా చేస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
అనిల్‌కు జంగాకు మధ్య మాటల యుద్ధం
నెల్లూరు సిటీ సిట్టింగ్ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను సీఎం జగన్ రాజకీయ బదిలీ చేశారు. నెల్లూరు నుంచి ఆయనను తరలించి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ పెట్టారు. 2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. గతంలో వీరిద్దరి మధ్య భారీ స్థాయిలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. తెలుగుదేశం వాళ్ల స్క్రిప్ట్‌ను మాట్లాడుతున్నారని గత ఫిబ్రవరిలో అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపైన విమర్శలు గుప్పించారు. దీనిపై జంగా బదులిస్తూ తన గురించి మాట్లాడే అర్హత అనిల్ యాదవ్‌కు లేదని కౌంటర్ ఇచ్చారు. పదవుల కోసం తాను ఆశపడలేదని, బీజీలకు రాజ్యాధికారం దక్కాలన్నదే తన తాపత్రయమన్నారు. భజన చేయడం తన పద్దతి కాదని, ఒకరిని పొగడటం ఎప్పుడూ చేయలేదని నాడు స్పందించారు. ఇలా వారిద్దరి మధ్య నాటి నుంచి మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇటీవల అనిల్ కుమార్ యాదవ్ జంగా కృష్ణమూర్తిపై చేసిన వ్యాఖ్యలు స్థానికంగా సంచలనంగా మారాయి. జంగా కృష్ణమూర్తి తన ఓటమిని కోరుకుంటున్నారని, పెద్దన్నలా ఉండి నా చేయి పట్టుకొని నడిపించాల్సిన ఎమ్మెల్సీ జంగాకృష్ణమూర్తి తన ఓటమిని కోరుకోవడం బాధగా ఉందని అనిల్ అన్నారు. బీసీలు, వారి హక్కుల గురించి మాట్లాడే జంగా వైఎస్‌ఆర్‌సీపీ బీసీలకు సీటిస్తే జంగా టీడీపీలోకి పోవడం ఏమి సామాజిక న్యాయమని, తానెప్పుడూ జంగా అభివృద్ధినే కోరుకుంటున్నాని అనిల్ వ్యాఖ్యలు చేశారు.
బలమైన బీసీ నేతగా ముద్ర
అయితే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఇది వరకే వైఎస్‌ఆర్‌సీపీని వీడారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆయన టీడీపీలో చేరారు. 1988లో రాజకీయాల్లో జంగా ప్రవేశించారు. తొలుత గ్రామ సర్పించిగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా గురజాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004లో కూడా ఇదే నియోజక వర్గం నుంచి గెలుపొందారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గం సభ్యుడిగా కూడా పని చేశారు. వైఎస్‌ఆర్ మరణానంతరం ఆయన కాంగ్రెస్‌ను వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. 2014లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా గురజాల నుంచి పోటీ చేసి ఓడి పోయారు. వైఎస్‌ఆర్‌సీపీ బీసీ సంఘం అధ్యయన కమిటీ చైర్మన్‌గాను, ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగాను, వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడిగాను జంగా పని చేశారు. 2019లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అయ్యారు. అయితే అక్కడ నెలకొన్న విబేధాల కారణంగా వైఎస్‌ఆర్‌సీపీలో ఇమడలేక పోఆయరు. తీవ్ర మనస్తాపం చెందిన జంగా ఆపార్టీకి రాజీనామా చేసి ఇటీవల టీడీపీలో చేరారు. అయితే పల్నాడు ప్రాంతంలో జంగాకు బలమైన బీసీ నేతగా ముద్ర ఉంది. ఇది వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల గెలుపు ఓటములపై పడే చాన్స్ ఉందని, అనిల్ కుమార్ వ్యాఖ్యలే దీనికి నిదర్శనమనే టాక్ కూడా స్థానికుల్లో ఉంది.