స్టాలిన్‌తో విభేదాలకు రాహుల్‌ కారణమా? సోనియా ఆత్మకథలో కీలక విషయాలు!
x

స్టాలిన్‌తో విభేదాలకు రాహుల్‌ కారణమా? సోనియా ఆత్మకథలో కీలక విషయాలు!

కాంగ్రెస్‌-డీఎంకే బంధం తెగిపోవడానికి రాహుల్‌ వైఖరే కారణమా? సోనియా గాంధీ జోక్యం చేసుకుంటారా? సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎన్‌ రామ్‌ ఏమంటున్నారు?


Click the Play button to hear this message in audio format

కాంగ్రెస్‌-డీఎంకే మధ్య 2004లో పొత్తు కుదిరేందుకు సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారు. అయితే, అప్పట్లో ఆమె ఎదుర్కొన్న వ్యక్తిగత సంఘర్షణలు, సందేహాలు అన్నీ, ఇన్నీ కావు. ఈ విషయాలను తన తాజా ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'లో ఆమె స్వయంగా వెల్లడించారు. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన ఆ రాజకీయ బంధం... 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం బీటలు వారింది. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో, దెబ్బతిన్న కాంగ్రెస్‌-డీఎంకే సంబంధాలను సోనియా గాంధీ మళ్లీ చక్కదిద్దగలరా? ఈ ప్రశ్నకు సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎన్‌ రామ్‌ సందేహాస్పదంగానే సమాధానమిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వైఖరే ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

'ది ఫెడరల్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్‌ రామ్‌ కీలక విషయాలు వెల్లడించారు. యూపీఏ హయాంలో సోనియా గాంధీ అనుసరించిన సంకీర్ణ రాజకీయ విధానానికి, ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకత్వం అనుసరిస్తున్న తీరుకు మధ్య స్పష్టమైన తేడా ఉందని చెప్పారు. ముఖ్యంగా ఎం.కె. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకేను పక్కనపెట్టి, ప్రస్తుతం అధికారంలో ఉన్న సి. జోసెఫ్‌ విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే)తో చేతులు కలిపేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించడాన్ని ఆయన ప్రస్తావించారు.

స్టాలిన్‌, సోనియా గాంధీ మధ్య ఉన్న సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకుని, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సోనియా జోక్యం చేసుకోవాలనే ప్రతిపాదన కాంగ్రెస్‌లోని కొందరు నేతల నుంచి వచ్చినట్లు సమాచారం. 2004లో ఆమె స్వయంగా చొరవ తీసుకుని డీఎంకేతో పొత్తు కుదిర్చినట్లే, ఇప్పుడు కూడా పరిస్థితిని చక్కదిద్దగలరని కొందరు భావిస్తున్నారు. కానీ, అలాంటి జోక్యం జరిగే అవకాశాలు తక్కువేనని ఎన్‌ రామ్‌ అభిప్రాయపడ్డారు.

"అవును, నాకు తెలిసిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ ఆలోచనను ప్రతిపాదించారు, కానీ వారు దానిని ముందుకు తీసుకెళ్లలేకపోయారు," అని రామ్ అన్నారు. "ఎంకే స్టాలిన్ సోనియా గాంధీని చాలా గౌరవిస్తారని నాకు తెలుసు, ఎందుకంటే ఆమె యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు వారిద్దరి మధ్య చాలా మంచి సంబంధం ఉండేది. అయితే, ఇప్పుడు కాంగ్రెస్‌లో సోనియా గాంధీ పాత్ర గతంలోలా లేదు.’’ అని రామ్‌ గుర్తుచేశారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న ఆమె, ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీకి మాత్రమే నాయకత్వం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ రాజకీయ నిర్ణయాల్లో ఆమె ఎంతవరకు జోక్యం చేసుకోగలరన్నది ప్రశ్నార్థకమని అన్నారు.

"ఆమె ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా లేరు — ఆమె కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి అధిపతిగా కొనసాగుతున్నప్పటికీ, దీనిని పాక్షిక పదవీ విరమణ అని అనగలమో లేదో నాకు తెలియదు, కానీ వాస్తవానికి అది అదే. ఆమె ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉండటం, వీటన్నింటితో ఆమె విసిగిపోయి ఉండటం వంటి కారణాల వల్ల, ఆమె మరీ ఎక్కువగా జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదని నేను భావిస్తున్నాను," అని రామ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం మల్లికార్జున్‌ ఖర్గే కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు, పార్టీ ఎన్నికల వ్యూహాలను రాహుల్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వారిద్దరి నిర్ణయాల్లో సోనియా జోక్యం చేసుకోవడం పార్టీ సంస్థాగత వ్యవస్థను దాటినట్లవుతుందని రామ్‌ అభిప్రాయపడ్డారు.

సంకీర్ణ రాజకీయాల్లో సోనియా చూపిన ఆచరణాత్మకత ఎక్కడ?

ప్రస్తుత కాంగ్రెస్‌ నాయకత్వంలో కొరవడిన లక్షణం ఏమిటో చెప్పడానికి ఎన్‌ రామ్‌ 2004 నాటి పరిణామాలను గుర్తుచేశారు. డీఎంకేతో పొత్తు కోసం అప్పటి పార్టీ అధినేత ఎం. కరుణానిధికి ఫోన్‌ చేయడానికి సోనియా గాంధీ తొలుత తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చిందని ఆమె తన ఆత్మకథలో వివరించారు. దానికి కారణం లేకపోలేదు. 1991లో శ్రీలంక తమిళ మిలిటెంట్‌ వేర్పాటువాద సంస్థ లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ) జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై విచారణ జరిపిన జైన్‌ కమిషన్‌ 1997లో సమర్పించిన నివేదికలో, డీఎంకే నాయకత్వం ఎల్‌టీటీఈకి పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆరోపించింది. దీంతో డీఎంకేతో రాజకీయంగా చేతులు కలపడం సోనియాకు వ్యక్తిగతంగా ఎంతో కష్టమైన నిర్ణయంగా మారింది.

అయినప్పటికీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను రాజకీయంగా ఎదుర్కోవాలంటే విస్తృతమైన ప్రతిపక్ష కూటమి అవసరమని ఆమె భావించారు. వ్యక్తిగత బాధను పక్కనపెట్టి కరుణానిధితో పొత్తుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత స్టాలిన్‌తోనూ మంచి సంబంధాలను కొనసాగించారు.

అప్పట్లో సోనియా చూపిన ఈ రాజకీయ వాస్తవికతకు, ఇప్పుడు కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరికి చాలా తేడా ఉందని ఎన్‌ రామ్‌ విశ్లేషించారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్న తీరును ఆయన ప్రస్తావించారు. మిత్రపక్షాలతో సర్దుబాటుకు సిద్ధపడాల్సిన చోట కూడా కాంగ్రెస్‌ కఠిన వైఖరి ప్రదర్శిస్తోందని అభిప్రాయపడ్డారు.

"కాంగ్రెస్‌లోని ప్రస్తుత తరం కన్నా సోనియా గాంధీ చాలా మెరుగైన సంకీర్ణ నిర్మాత, నాయకురాలు అని నేను భావిస్తున్నాను," అని రామ్ అన్నారు. "ఆమె దాని గురించి గొప్పలు చెప్పుకోరు, కానీ ఇతరులు ఒంటరిగా వెళ్లాలనుకున్నప్పుడు, పార్టీ పతనమైందని, పొత్తులు ఏర్పరచుకోవాల్సిందేనని ఆమె చాలా స్పష్టంగా ఉన్నారని [పుస్తకంలో] పేర్కొన్నారు. కొన్నిసార్లు ఈ రాజీలు ఆమె మనస్సాక్షిని తీవ్రంగా వేధించాయి."


కూటమి విచ్ఛిన్నానికి అసలు కారణం ఏమిటి?

ప్రస్తుతం కాంగ్రెస్‌, డీఎంకే మధ్య నెలకొన్న విభేదాలకు శ్రీలంక తమిళుల సమస్య కారణమన్న వాదనను ఎన్‌ రామ్‌ తోసిపుచ్చారు. ఆ వివాదం ఎప్పుడో ముగిసిపోయిందని స్పష్టం చేశారు. ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం సీట్ల పంపకం, అధికారంలో వాటా కోరుకోవడమేనని ఆయన విశ్లేషించారు.

"ప్రస్తుత విభేదానికి, మనస్పర్థలకు మూలం వేరే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు, ప్రభుత్వంలో వాటా కోరుకుంది," అని రామ్ వివరించారు. "తమిళనాడులో అధికారాన్ని పంచుకోవడం డీఎంకే విధానం కాదు... డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు, ఒకానొక సమయంలో పార్టీకి మెజారిటీ లేనప్పటికీ, ఎలాంటి సంకీర్ణం లేదు. కాబట్టి, ఈ విభేదం వేరే కారణం వల్ల వచ్చింది, రాహుల్‌కు చేరిన కొన్ని సూచనల నుంచి ఇది పుట్టింది. ఇక్కడి ఈ పరిణామాలకు ఆయనే ప్రధానంగా బాధ్యుడని నేను భావిస్తున్నాను."

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ తీసుకున్న వైఖరి ఈ విభేదాలను మరింత పెంచిందని రామ్‌ పేర్కొన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్‌తో ముందుగా చర్చించకుండానే, టీవీకేతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోబోతోందన్న వార్తలు అకస్మాత్తుగా తెరపైకి వచ్చాయని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లోనూ టీవీకేతో కలిసి పోటీ చేయాలన్న ప్రచారం డీఎంకేలో తీవ్ర అసంతృప్తికి కారణమై ఉంటుందని విశ్లేషించారు.

స్టాలిన్‌తో సంప్రదింపులు జరపకుండా కాంగ్రెస్‌ తీసుకున్న ఈ నిర్ణయం రెండు పార్టీల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

మొత్తంగా చూస్తే, ఒకప్పుడు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి, రాజకీయ ప్రయోజనాల కోసం సంకీర్ణాలను నిర్మించిన సోనియా గాంధీ తరహా నాయకత్వం ఇప్పుడు కాంగ్రెస్‌లో కనిపించడం లేదన్నది ఎన్‌ రామ్‌ విశ్లేషణ. అయితే, దెబ్బతిన్న కాంగ్రెస్‌-డీఎంకే సంబంధాలను చక్కదిద్దేందుకు సోనియా మళ్లీ చొరవ తీసుకుంటారా? ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story