గుడివాడలో కొడాలి నానికి ఓటమి భయం?
x

గుడివాడలో కొడాలి నానికి ఓటమి భయం?

గుడివాడలో తిరుగులేని నేతగా చలామణి అవుతున్న నానికి ఈ సారి ఓటమి భయం పట్టుకుందా? నాలుగు సార్లు గెలిచిన నాని గుండెల్లో వెనిగండ్ల రైళ్లు పరిగెత్తిస్తున్నాడా?



గుడివాడ అంటే గుర్తొచ్చేది కొడాలి నాని. దీంతో పాటుగా ఎలాంటి జంకు బొంకూ లేకుండా తెలుగుదేశం పార్టీపైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై ఒంటి కాలితో లేస్తూ చేసే విమర్శలు అందరికి గుర్తొసాయి. దీంతో ఆయన తెలుగు ప్రజల్లో పాపులర్‌ అయ్యారు. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నేతగా నానికి పేరుంది. ప్రచారంలో స్థానికులు ఆయనకు పాలాభిషేకం కూడా చేశారు. నందివాడ, గుడివాడ రూరల్‌తో పాటు గుడ్లవల్లేరు ప్రాంతాల్లో నానికి మంచి పట్టుంది. గుడ్లవల్లేరు మండలంలోని కమ్మ సామాజిక వర్గంలో కూడా మంచి ఆదరణ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ నేతలైన చంద్రబాబు, లోకేష్‌లపై చేస్తున్న విమర్శల మూలంగా కమ్మ సామాజిక వర్గంలోని కొంత మంది నానిపై గుర్రుగా ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
2004లో మొదలైన రాజకీయ ప్రస్థానం
కొడాలి నాని ఇప్పటి వరకు నాలుగు పర్యాయాలు వరుసగా గుడివాడ నుంచి గెలుపొందారు. 2004లో మొదలైన ఆయన ప్రాస్థానం 2019 వరకు గెలుస్తూ జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. తొలుత టీడీపీతోనే నాని తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. అదే పార్టీ అభ్యర్థిగా 2004, 2009లో పోటీ చేసి గెలిచారు. తర్వాత టీడీపీకి గుడ్‌బాయ్‌ చెప్పి 2012లో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో ఏర్పడిన జగన్‌ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఈ సారి కూడా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ఐదో సారి గెలిచి గుడివాడలో తన తిరుగు లేదని నిరూపించడానికి వ్యూహాలు పన్నుతున్నారు. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. పదో తరగతి ఫెయిలయ్యారు.
టీడీపీ అభ్యర్థిగా ఎన్‌ఆర్‌ఐ
టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్లరాము బరిలో ఉన్నారు. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బిటెక్‌ చదవారు. ఈయన ఎన్‌ఆర్‌ఐ. అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ ఎఫిసెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థను స్థాపించారు. గత కొనేళ్లుగా గుడివాడలోనే మకాం వేశారు. వెనిగండ్ల పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసి దాని ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ ప్రాంత ప్రజలకు చేరువయ్యారు. ప్రధానంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం, తాగు నీరు అందించడం, ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయడం, అన్నదానం చేయడం, పేద విద్యార్థుల చదువులకు సహాయపడటం చేస్తూ వచ్చారు. గతేడాది కురిసిన వర్షాల కారణంగా నష్ట పోయిన రైతులకు సొంత నిధులతో సాయం అందించారు.
ఇంటర్‌ క్యాస్ట్‌ మ్యారేజ్‌
కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెనిగండ్ల రాము ఇంట్లో వాళ్లను ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్నారు. ఆయన భార్య ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ. ఆమె తండ్రి ఆ ప్రాంతంలో పాస్టర్‌గా పని చేస్తున్నారు. కులాంతర వివాహం కూడా రాముకు కలిసొచ్చే అంశంగా స్థానికులు చర్చించుకుంటున్నారు.
గుడివాడలో ఎస్సీలే కీలకం
గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గంలో ప్రధానంగా ఎస్సీ, బీసీ, కాపు ఓటర్లు అధికంగా ఉన్నారు. ఎస్సీ ఓటర్లు సుమారు 53వేలు, కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 26వేలు, యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 15వేలు, గౌడ్‌ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 14వేలు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 10వేల వరకు ఉన్నాయి. గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ మండలాలు ఉన్నాయి. వీటిల్లో నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువుగా ఉన్నారు. గుడివాడ నియోజక వర్గం పరిధిలో నానికి మంచి పట్టున్నా ఈ సారి అది ఓట్ల రూపం దాల్చక పోవచ్చనే చర్చ కూడా స్థానికుల్లో ఉంది. వెనిగండ్ల రాముకి కమ్మ, కాపు, బీసీ సామాజిక వర్గాలతో పాటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా సపోర్టు లభిస్తోందని స్థానికుల్లో చర్చ సాగుతోంది. ఇది ఓట్ల రూపంగా మారితే ఫలితాలు తారుమారవుతాయనే చర్చ సాగుతోంది.
అంతా ఒక తాటిపైకి
గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా ఒకే తాటిపైకి తీసుకొని రావడంలో వెనిగండ్ల రాము సక్సెస్‌ అయ్యారు. మరి ముఖ్యంగా రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ మధ్య నెలకొన్న విబేధాలను కూడా పరిష్కరించారు. ఇద్దరి మధ్య సఖ్యత కూడా కుదిర్చారు. పార్టీలో ఎవరికి ఏ కష్టమొచ్చినా నేను ఉన్నానంటూ అందరికీ భరోసా ఇచ్చారు. దీంతో ఆ పార్టీ కేడర్‌లో జోష్‌ నిండినటై్టంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రావి వెంకటేశ్వరరావుకు టీడీపీ అధికారంలోకి వస్తే రావికి ఎమ్మెల్సీ ఇచ్చే విధంగా ఆ పార్టీ అధిష్టానం కూడా మాట్లాడినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
అందుకే ఆ వ్యాఖ్యలు చేసిన నాని
ఇవే నా చివరి ఎన్నికలు అని ఇటీవల గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. 2029 ఎన్నికల్లో పోటీ చేయనని, అప్పటికి తన వయసు 58 ఏళ్లు అవుతాయని, ఆ వయసులో పోటీ చేయలేనని ప్రకటించారు. తనకు ఎవరూ వారసుల్లేరని, తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని, తన కుమార్తెలకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని, ఆసక్తి ఉంటే తన సోదరుడు కుమారుడు రాజకీయాల్లోకి వచ్చే చాన్స్‌ ఉందని స్పష్టం చేశారు. ఒక పక్క నియోజక వర్గంలో పెరుగుతున్న వ్యతిరేకత, మరో వైపు వెనిగండ్ల రాముకు పెరుగుతున్న సానుకూలత నేపథ్యంలో ఇవే నా చివరి ఎన్నికలంటూ నాని వ్యాఖ్యలు చేశారని, తద్వారానైనా సానుభూతి పెరుగుతుందని, దాంతో ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చనే భావనతోనే నాని ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా స్థానికుల్లో ఉంది.
Read More
Next Story