జగన్‌ కుమార్తెల ఆస్తులు 50 శాతం పెరిగాయి, ఎలా?
x

జగన్‌ కుమార్తెల ఆస్తులు 50 శాతం పెరిగాయి, ఎలా?

కోట్ల రూపాయలకు అధిపతి అయిన సీఎం వైఎస్‌ జగన్‌ చేతిలో కేవలం ఏడు వేలే ఉన్నాయట.. వారి కుటుంబ సభ్యుల చేతిలో కూడా అంతంత మాత్రమేనట.



కోట్లకు పడగలెత్తిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధనికా లేదా పేదా లేదా పెత్తందారా అనేది తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. సీఎం వైఎస్‌ జగన్‌ తన పేరు మీద, తన సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి పేరు మీద, తన కుమార్తెలిద్దరి పేర్ల మీద కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్లు చూపించారు. అంటే కోటీశ్వరుడే కాదు అపర కోటీశ్వరులు అని అర్థమవుతోంది. మరి ఇంత పెద్ద ఎత్తున ఆస్తులును కూడబెట్టుకున్న జగన్‌ కుటుంబం పెత్తందారా కాదా అనే దానిపైన రాజకీయ పక్షాల్లో చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే కోట్లకు పడగలెత్తిన జగన్‌ పేదలకు, పెత్తందారులకు మధ్య 2024 ఎన్నికలు జరుగుతున్నాయని చెబుతుండటంపైనా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరో ఆసక్తి కరమైన అంశం ఏమిటంటే అపర కుభేరులైన సీఎం జగన్‌కు సొంత కారు లేక పోవడం. బంగారు ఆభరణాలేమీ కూడా లేక పోవడం. ఆయన చేతిలో కేవలం రూ. 7వేలు నగదు ఉన్నట్లు అఫిడవిట్లో చూపించడం. ఆయన సతీమణి భారతీరెడ్డి చేతిలో రూ. 10వేలు, విదేశాల్లో చదువుతున్న ఆయన కుమార్తెలు హర్షిణిరెడ్డి చేతిలో రూ.9వేలు, వర్షారెడ్డి చేతిలో రూ. 6,987లు మాత్రమే నగదు ఉన్నట్లు చూపడం గమనార్హం.
48 శాతం పెరిగిన జగన్‌ కుటుంబ ఆస్తులు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ ఆస్తులు రూ. 1,287.52 కోట్లు. వీటిల్లో కేవలం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు మీద రూ. 529. 87 కోట్లు స్థిర, చరాస్తులు ఉండగా, సీఎం జగన్‌ సతీమణి భారతిరెడ్డి, కుమార్తెలు హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిల పేరుతో ఉన్న ఆస్తులు రూ. 757. 65 కోట్లు. ఈ ఆస్తులు ఎక్కువుగా పలు కంపెనీల్లో షేర్లు, ఇన్వెస్టెమెంట్‌ల రూపంలో ఉన్నాయి. గత ఎన్నికల్లో చూపించిన ఆస్తులకు, తాజాగా ప్రకటించిన ఆస్తులకు పోల్చితే బాగా పెరిగాయి. జగన్‌ పేరుతో ఉన్న ఆస్తులు దాదాపు 41.22 రెట్లు పెరుగగా, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఆస్తులు 48.45 శాతం పెరిగాయి. 2019 ఎన్నికల్లో చూపించిన ప్రకారం వైఎస్‌ జగన్‌ ఆస్తులు రూ. 375. 20 కోట్లు ఉంటే అధికారంలోకి వచ్చిన ఐదేళ్లల్లో వాటి విలువ రూ. 154.67 కోట్లకు పెరిగింది. అదేవిధంగా జగన్‌ కుటుంబం రూ. 510. 38 కోట్లు ఉండగా గడచిన ఐదేళ్లల్లో వాటి విలువ రూ. 247. 27కోట్లకు పెరిగింది. గత ఎన్నికల్లో జగన్‌ ప్రకటించిన చరాస్తుల కంటే తాజాగా వెల్లడించిన చరాస్తుల్లో భారీగా పెరుగుదల ఉంది. అలాగే స్థిరాస్తులు కూడా బాగానే పెరిగాయి. వారి కుటుంబ ఆస్తులు కూడా బాగా పెరిగాయి. 2019లో రూ. 92.53కోట్లుగా ఉన్న భారతీరెడ్డి చరాస్తులు 2024 నాటికి రూ. 119.38కోట్లకు పెరిగాయి. 2019లో రూ. 31.59 కోట్లుగా ఉన్న భారతీరెడ్డి స్థిరాస్తులు 2024 నాటికి రూ. 56.92 కోట్లకు పెరిగింది. ఇక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దకుమార్తె హర్షిణిరెడ్డికి 2019ఎన్నికల్లో రూ. 6.45కోట్లు చరాస్తులుండగా, 2024 ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 24.26కోట్లు ఉన్నట్లు చూపించారు. 2019లో స్థిరాస్తులు ఏమీ లేనట్లు చూపగా 2024 ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం రూ. 1.63కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక రెండో కుమారె హర్షిణిరెడ్డి పేరుతో 2019 ఎన్నికల్లో రూ. 4.59 కోట్లు చరాస్తులు ఉండగా 2024లో రూ. 23.94కోట్లు ఉన్నట్లు చూపారు. ఆమెకు 2019లో ఎలాంటి స్థిరాస్తులు లేకపోగా 2024లో మాత్రం రూ. 1.63 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. గడచిన ఐదేళ్లలో ఆస్తుల విలువ భారీగా పెరిగినట్లు 2024 ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు.
పలు కంపెనీల్లో షేర్లు, ఇన్వెస్ట్‌మెంట్లు
సీఎం వైఎస్‌ జగన్‌కు 7, ఆయన సతీమణి భారతీరెడ్డికి 22, వారి కుమార్తెలు హర్షిణిరెడ్డి 7, వర్షారెడ్డికి 9 కంపెనీల్లో పెట్టుబడులున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. భారతీ సిమెంట్స్‌ కార్పొరేషన్‌ ప్రవేటు లమిటెడ్, కార్మెల్‌ ఏషియా హోల్డింగ్స్‌ ప్రవేట్‌ లిమిటెడ్, క్లాసిక్‌ రియాల్టి ప్రైవేటు లిమిటెడ్, హరీష్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేటు లిమెటెడ్, సండూర్‌ పవర్‌ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్, సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్, సిలికాన్‌ బిల్డర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ వంటి పలు కంపెనీల్లో కోట్ల రూపాయల విలువైన షేర్లు ఉన్నాయి. ఇవి కాకుండా రిలయన్స్, జియో ఫైనాన్స్, రేవన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, యుటోపియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ,మకరియోస్‌ ఎల్‌ఎల్‌పీ, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌ ఎల్‌ఎల్‌పీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్స్, ఎన్‌ఎండీసీ, ఏషియన్‌ పెయింట్స్, కోల్గేట్‌ పామోలివ్, ఓఎన్‌జీసీ, సెయిల్, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌ పెట్టుబడులు, షేర్లు ఉన్నాయి. జగన్‌ కుమార్తెలు వైఎస్‌ హర్షిణిరెడ్డి, వర్షారెడ్డి పేరుతో రెండు కంపెనీల్లో పెట్టుబడులున్నాయి. మకరియోస్‌ ఎల్‌ఎల్‌పీ, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌ ఎల్‌ఎల్‌పీల్లో హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిలకు కోట్ల విలువైన పరిమిత భాగస్వామ్య పెట్టుబడులున్నాయి. ßæర్షిణిరెడ్డికి కెల్వన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఈక్విటీ షేర్లున్నాయి. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సనోఫి ఇండియా, ఏషియన్‌ పెయింట్స్, గ్లాక్సో స్మిత్‌క్లిన్‌ ఫార్మాలో కూడా ఈక్విటీ షేర్లున్నాయి. వర్షారెడ్డికి కెల్వన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఈక్విటీ షేర్లున్నాయి. జెన్సర్‌ టెక్, సనోఫి ఇండియా, ఏషియన్‌ పెయింట్స్, గ్లాక్సో స్మిత్‌క్లిన్‌ ఫార్మా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్స్‌లలోఈక్విటీ షేర్లున్నాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కుమార్తెలు హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిలకు విదేశాల్లో కూడా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.
కోట్లల్లో బంగారం
వైఎస్‌ భారతీరెడ్డి, వారిద్దరి కుమార్తెలకున్న బంగారం, వజ్రాభరణాలు కూడా పెరిగాయి. 2019లో భారతిరెడ్డి పేరుతో రూ. 3. 57కోట్లు, విలువైన 5,862.818 గ్రాములు ఉండగా 2024లో భారతి పేరిట 5.29 కోట్ల విలువైన 6,427.79 గ్రాములు బంగారం. హర్షిణిరెడ్డి పేరుతో పేరిట 4.43కోట్ల విలువైన 4,187.19 గ్రాముల బంగారం, వర్షారెడ్డి పేరుతో రూ. 4. 46కోట్ల విలువైన 3,457.33 గ్రాముల బంగారం, వజ్రాభరణాలు ఉన్నట్లు లెక్కలు చూపించారు.
అప్పులు ఇలా
సీఎం వైఎస్‌ జగన్‌ రూ. 1.10కోట్లు, భారతీరెడ్డి రూ. 7.41 కోట్లు, హర్షిణిరెడ్డి రూ. 9.2కోట్లు, వర్షారెడ్డి కూడా అప్పులున్నట్లు చూపించారు. తాడేపల్లి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్యాలెస్‌ ఆయన సతీమణి భారతిరెడ్డి పేరుతోనే ఉన్నట్లు చూపారు. ఇవి కాకుండా తాడేపల్లిలో భారతికి విల్లాలు, స్థలాలు కూడా ఉన్నట్లు చూపారు. సీఎం జగన్‌కు ఇడుపులపాయలో 39.52 ఎకరాలు, వ్యవసాయ భూమి, పులివెందుల మండలంలో రూ. 11.03 కోట్ల విలువైన 4,51,282 చదరపు అడుగుల వ్యవసాయేతర భూమి, హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో రూ. 20.92 కోట్ల విలువైన కమర్షియల్‌ కాంప్లెక్స్, 13.29 కోట్ల విలువైన రెండు నివాస భవనాలున్నాయి. భారతిరెడ్డి పేరుతో పులివెందుల మండలంలో రూ. 28.57 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములున్నాయి. పులివెందుల, రాయదుర్గం ప్రాంతాల్లో రూ. 14.28 కోట్ల విలువైన కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు ఉన్నాయి.
జగన్‌పైన 26 కేసులు
2019లో మొత్తం 31 కేసులు ఉన్నట్లు జగన్‌ చూపగా, 2024లో 26 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వీటిల్లో 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో జగన్‌ నిందితుడిగా ఉన్నారు. అంతేకాకుండా రెండు తెలుగురాష్ట్రాల పరిధిలో వివిధ పోలీస్‌స్టేషన్లలో మరో 6 కేసులు ఉన్నాయి. వీటితో పాటుగా అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌ నిరోధక చట్టంతో పాటు మోసం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలతో కేసులు ఉన్నాయి. సీబీఐ, ఈడీ కేసులన్నీ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయి. వీటితోపాటు జాతీయ గీతానికి అవమానం కలిగించడం, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, అనుచిత ప్రవర్తన, పరువునష్టం కలిగించడం తదితర అంశాలతో జగన్‌పై కేసులు నమోదయ్యాయి. ఆ మేరకు సీఎం జగన్‌ తరఫున వైఎస్‌ మనోహర్‌రెడ్డి సోమవారం పులివెందుల ఎన్నికల అధికారికి దాఖలు చేసిన నామినేష్‌ అఫిడవిట్‌లో వివరాలు వెల్లడించారు. అయితే అఫిడవిట్లకు అవసరమైన స్టాంప్‌ పేపర్లు విజయవాడలో కొనుగోలు చేయగా, రాజమండ్రిలో నోటరీ చేయించినట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు.
Read More
Next Story