తిరుమలకు భారీ వర్షాల హెచ్చరిక
x

తిరుమలకు భారీ వర్షాల హెచ్చరిక


తిరుపతికి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ జె.శ్యామల రావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్‌.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ 48 గంటల్లో తిరుపతిలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందనే వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కోరారు.2021లో భారీ కొండ చరియలు విరిగి పడిన ఘటనతో టీటీడీ 700 పేజీల విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించిందన్నారు. ఈ ప్రణాళిక బాగుందనీ, మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఈఓ స్థాయిలో విపత్తుల నివారణ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడిషనల్ ఈఓ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సమన్వయ కమిటీ ఉందన్నారు. అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖ, విజిలెన్స్ విభాగం, ఇతర కీలకమైన శాఖల విభాగాధిపతులు, తమ సిబ్బందితో డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలనీ, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ విద్యుత్తు అంతరాయ పరిస్థితిల్లో జనరేటర్లు నడపడానికి ముందస్తు జాగ్రత్తగా తగినంత డీజిల్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐటీ విభాగం భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సు లను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలనీ, ఘాట్ రోడ్డులలో జేసీబీ, ట్రక్కులు, ట్రాక్టర్లు తగిన సిబ్బందిని సంసిద్ధంగా ఉంచుకుని సమాయత్తంగా ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎస్వీబీసీ, మీడియా, టీటీడీ సోషియల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు.


Read More
Next Story